Begin typing your search above and press return to search.

అమ్మ పుట్టినరోజు అదృష్టం: రూ. 240 కోట్లు గెలుచుకున్న తెలుగోడు!

వీటితో పాటు ఒక సూపర్‌ కార్ కొనుగోలు చేయాలని, అలాగే ఏదైనా లగ్జరీ రిసార్ట్‌లో లేదా 7-స్టార్‌ హోటల్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

By:  A.N.Kumar   |   28 Oct 2025 8:20 PM IST
అమ్మ పుట్టినరోజు అదృష్టం: రూ. 240 కోట్లు గెలుచుకున్న తెలుగోడు!
X

ఒక సామాన్య తెలుగోడి జీవితాన్ని అమ్మ పుట్టినరోజు నెంబర్ అద్భుతంగా మార్చేసింది. యూఏఈ చరిత్రలోనే తొలిసారిగా AED 100 మిలియన్ (భారతీయ కరెన్సీలో దాదాపు ₹240 కోట్లు) జాక్‌పాట్‌ను గెలుచుకున్న అదృష్టవంతుడిగా అనిల్‌కుమార్ బొల్లా నిలిచారు. అక్టోబరు 18న జరిగిన 23వ ‘లక్కీ డే డ్రా’లో అబుదాబీలో నివాసిస్తున్న ఈ 29 ఏళ్ల తెలుగు వ్యక్తి జీవితమే మారిపోయింది.

* 'ఈజీ పిక్'లో అమ్మ లక్కీ నెంబర్

విజేత అనిల్‌కుమార్ బొల్లా మాట్లాడుతూ "నేను ప్రత్యేకంగా మ్యాజిక్ ఏమీ చేయలేదు. 'ఈజీ పిక్' ఆప్షన్‌ను ఎంచుకుని టికెట్ తీసుకున్నాను. అయితే, నా టికెట్‌లోని చివరి నెంబర్ మాత్రం నాకు చాలా ప్రత్యేకం. అది నా అమ్మ పుట్టినరోజు" అని తన అదృష్ట రహస్యాన్ని వెల్లడించారు. ఈ అదృష్ట సంఖ్యే ఆయనకు దేశంలోనే అత్యధిక లాటరీ మొత్తాన్ని అందించింది.

* నమ్మశక్యంగాని ఆ క్షణం

లాటరీ గెలిచిన వార్త విన్నప్పుడు కలిగిన అనుభూతిని అనిల్‌కుమార్ ఇలా పంచుకున్నారు: "నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. సోఫాలో షాక్‌లో కూర్చుండిపోయాను. నిజంగా నేనే గెలిచానని అర్థమయ్యేలోపు కొంత సమయం పట్టింది." యూఏఈ లాటరీ నిర్వాహకులు అనిల్‌కుమార్ భారీ చెక్కు అందుకుని, బంగారు కాన్ఫెట్టి వర్షంలో సంబరాలు చేసుకుంటున్న వీడియోను తమ అధికారిక X ఖాతాలో పంచుకున్నారు.

* పెట్టుబడిపై దృష్టి, కుటుంబంతో సంతోషం

అనిల్‌కుమార్ తన భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ "ఇంత పెద్ద మొత్తం వచ్చిన తర్వాత దాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలో, సరిగ్గా ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తున్నాను. ఏదైనా పెద్ద పని చేయాలనుకుంటున్నాను" అని చెప్పారు. తన మనసులోని అతి పెద్ద కోరికను ఆయన ఇలా వెల్లడించారు: "నా కుటుంబాన్ని యూఏఈకి తీసుకువచ్చి, వారితో సంతోషంగా జీవించాలనుకుంటున్నాను."

వీటితో పాటు ఒక సూపర్‌ కార్ కొనుగోలు చేయాలని, అలాగే ఏదైనా లగ్జరీ రిసార్ట్‌లో లేదా 7-స్టార్‌ హోటల్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గెలుచుకున్న మొత్తంలో కొంత భాగాన్ని దానం చేయాలని కూడా నిర్ణయించుకున్నారు.

* అదృష్టం కోసం ఆయన సందేశం

లాటరీ ఆడే మిగతా వారికి అనిల్‌కుమార్ ఇచ్చిన సందేశం "అన్నీ ఒక కారణంతోనే జరుగుతాయి. అందరూ ప్రయత్నించండి, ఒక రోజు అదృష్టం తప్పకుండా మీవైపు తిరుగుతుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనిల్‌కుమార్ బొల్లా విజయం యూఏఈలో ఉంటున్న తెలుగు సమాజంలో కొత్త ఆనందాన్ని నింపింది. కాగా, ఇటీవల సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో భారతీయుడు, టెక్నీషియన్‌ సందీప్ కుమార్ ప్రసాద్ కూడా అబుదాబీ బిగ్‌ టికెట్‌ డ్రాలో 15 మిలియన్ దిర్హామ్‌ (సుమారు ₹35 కోట్లు) గెలుచుకున్న సంగతి తెలిసిందే.