పోలీసులను పక్కన పెట్టి తేల్చుకుందామా? అనిల్ కుమార్ యాదవ్ మాస్ రియాక్షన్
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు వైసీపీ నేతల్లో చలనం తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది.
By: Tupaki Political Desk | 3 Feb 2026 9:42 PM ISTమాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు వైసీపీ నేతల్లో చలనం తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు సైలెంటుగా ఉన్న వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వరుసగా స్పందిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు తమ నేతలపై దాడి చేయడాన్ని ఖండించడమే కాకుండా, తాడోపేడో తేల్చుకుందామంటూ సవాల్ విసురుతున్నారు. ఈ స్పందన వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతోందని అంటున్నారు. కొన్నాళ్లుగా బయటకు కనిపించని వైసీపీ సీనియర్ నేతలు బయటకు రావడం, ప్రభుత్వంపై తిరగబడేలా గట్టిగా మాట్లాడుతుండటం వారిలో ధైర్యాన్ని తీసుకువస్తోందని అంటున్నారు.
తాజాగా నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడిన తీరు వైసీపీ శ్రేణులను ఆకర్షించింది. అనిల్ కుమార్ యాదవ్ తన సహజ శైలిలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై చేసిన విమర్శలు ఆ పార్టీ కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని అంటున్నారు. మంగళవారం మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి ఆయనను అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన వాగ్దాటితో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఎన్నికల అనంతరం అనిల్ కుమార్ ఈ స్థాయిలో మాట్లాడలేదని గుర్తు చేస్తున్నారు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులతో చలించిన ఆయన పోలీసులను పక్కన పెట్టి రమ్మనమని టీడీపీ నేతలు, కార్యకర్తలకు సవాల్ విసిరారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. గత ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నెల్లూరు రూరల్ నుంచి అనిల్ ను నరసారావుపేట పార్లమెంటుకు వైసీపీ హైకమాండ్ మార్చింది. అయితే కూటమి హవాలో అనిల్ కుమార్ ఓటమి చెందారు. ఆ తర్వాత ఎక్కువగా చెన్నైలోనే గడుపుతున్నట్లు చెబుతున్నారు. ఒకటి రెండు సార్లు సొంత నియోజకవర్గం నెల్లూరు వచ్చినా, పెద్దగా హడావుడి చేయలేదు. కానీ, మంగళవారం ఆయన చాలా యాక్టివ్ గా కనిపించారు. తిరుమల లడ్డూ ఇష్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప్రస్టేషన్ లో ఉన్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై ఇష్టానుసారం దాడులు చేస్తున్నారని, పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు దిగుతున్నారని విమర్శించారు.
దమ్ముంటే పోలీసులను పక్కనపెట్టి రావాలని, ఎక్కడికి రమ్మనమని పిలిచినా తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అనిల్ కుమార్ యాదవ్ తేల్చిచెప్పారు. తెగిస్తే ఎవరికి ఎవరు ఏమీ కారని, కానీ, అంది మంచి రాజకీయం కాదని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో జగన్ ఈ తరహా రాజకీయాలు చేయలేదని చెప్పారు. ఈ తరహాలో రాజారెడ్డి రాజ్యాంగం, రాయలసీమ ఫ్యాక్షన్ చూపించి ఉంటే నిజంగా మీరు బయట తిరగేవారా? అంటూ ప్రశ్నించారు. కాపులు, బీసీ నేతలపై దాడులు శోచనీయమని విచారం వ్యక్తం చేశారు.
లడ్డూ వ్యవహారంలో దుష్ప్రచారం చేసి కూటమి నాయకులు దొరికిపోయారని వ్యాఖ్యానించారు. ఆ ఇష్యూ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరో మూడేళ్లు ఈ ఆటవిక పాలన భరిస్తామని, 2029లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలపై దాడులతో కూటమి నేతలు ఆటవిక పాలనకు తెరలేపారని, రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేశారని ధ్వజమెత్తారు.
