Begin typing your search above and press return to search.

పార్టీపై అసంతృప్తా? పోటీపై విరక్తా..? అనిల్ కుమార్ యాదవ్ ప్రకటన వెనుక లోగుట్టు ఏంటి!

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటన వైసీపీ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.

By:  Tupaki Political Desk   |   28 Aug 2026 12:16 PM IST
పార్టీపై అసంతృప్తా? పోటీపై విరక్తా..? అనిల్ కుమార్ యాదవ్ ప్రకటన వెనుక లోగుట్టు ఏంటి!
X

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటన వైసీపీ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజులుగా పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ఆకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గురువారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ పార్టీ విధానాలను గట్టిగా సమర్థించారు. ఇలాంటి సమయంలోనే తాను పోటీ చేసే అవకాశాలపై చెప్పిన మాటలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చునని అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి. ఆయన ఎందుకీ నిర్ణయం తీసుకున్నారనే విషయమై కార్యకర్తల మధ్య విస్తృత చర్చ జరుగుతోంది. వైసీపీలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ ఉందని, రెండుసార్లు ఎమ్మెల్యే, ఒక సారి మంత్రిగా పనిచేసిన సంతృప్తి చాలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వెనుక ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా? అంటూ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు వచ్చినా, రాకపోయినా గతంలో పనిచేసిన సంతృప్తి చాలు అంటూ అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన మాటలు వెనుక అసంతృప్తి ఉందేమోనని అనుమానిస్తున్నారు.

రెండు సార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై క్లారిటీ లేకపోవడంతోనే ఈ ప్రకటన చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2014, 2019లో నెల్లూరు సిటీ నుంచి గెలిచిన ఆయన 2019 నుంచి మూడేళ్ల పాటు మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత ఆయన స్థానంలో వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్దన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ ను నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపారు. దీంతో ఆయనకు జిల్లా రాజకీయాల నుంచి దూరంగా పంపినట్లైందని అంటున్నారు. మరోవైపు అనిల్ కుమార్ సొంతనియోజకవర్గం నెల్లూరు సిటీ నుంచి మైనార్టీ నేత ఖలీల్ అహ్మద్ కు అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ తేడాతో ఖలీల్ అహ్మద్ ఓడిపోగా, తర్వాత నెల్లూరు సిటీ ఇంచార్జిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ కు సొంత నియోజకవర్గం అంటూ లేకపోయిందని చెబుతున్నారు. ఈ కారణంగానే జిల్లా రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే అప్పుడప్పుడు పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉనికి చాటుకుంటున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్మోహనరెడ్డి తాజాగా చేసిన ప్రకటనతో అనిల్ కుమార్ యాదవ్ వ్యూహాత్మకంగా తన భవిష్యత్తుపై క్లారిటీ కోసం పోటీ చేసే అవకాశాలు లేవంటూ అధిష్టానానికి సంకేతాలు పంపారా? అని పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేకుండా పనిచేయాలని, ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే ఆ నియోజకవర్గ ఇంచార్జి ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదులుకోవాలని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి రెండు రోజుల క్రితం పార్టీ ముఖ్యనేతల సమావేశంలో చేసిన హెచ్చరికలు అనిల్ కుమార్ ప్రకటనకు కారణమై ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో తనకు ఏ బాధ్యత లేదని చెప్పడమే కాకుండా, తనకు అవకాశం ఇస్తే అధినేత ఆకాంక్షలకు తగినట్లు పనిచేస్తానని చెప్పడమే అనిల్ కుమార్ అంతరంగం కావొచ్చునని భావిస్తున్నారు.