నెల్లూరు పాలిటిక్స్: 'అనిల్' అందుకే సైలెంట్..!
నెల్లూరు రాజకీయాలను శాసించిన వైసీపీ కీలక నాయకుడు బిసి సామాజిక వర్గానికి చెందిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
By: Garuda Media | 20 Dec 2025 10:00 PM ISTనెల్లూరు రాజకీయాలను శాసించిన వైసీపీ కీలక నాయకుడు బిసి సామాజిక వర్గానికి చెందిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఒకవైపు నెల్లూరు కార్పొరేషన్ లో మేయర్ స్రవంతి ఇటీవల రాజీనామా చేశారు. ఈ పదవిని టిడిపి దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు వైసీపీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆ పార్టీ తరఫున ఎవరూ బలంగా పనిచేయడం లేదు. పట్టించుకోవడం కూడా లేదు. ఇంత జరుగుతున్నా అనిల్ కుమార్ మాత్రం బలమైన వాయిస్ వినిపించడంలో కానీ పార్టీ నాయకులను ఏకం చేయటంలో కానీ ప్రయత్నాలు చేయలేకపోతున్నారు.
నిజానికి అనిల్ కుమార్ పట్టించుకుని ఉంటే మేయర్ స్రవంతి రాజీనామా చేసే పరిస్థితి ఉండేది కాదన్నది పార్టీల్లో జరుగుతున్న చర్చ. మరి దీనికి కారణం ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. ప్రధానంగా గత ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా అనిల్ పోటీ చేశారు. కానీ ఆయన అక్కడ ఓడిపోయారు. తిరిగి నెల్లూరు సిటీకి వచ్చారు. ఇక్కడ బాధ్యతలు అప్పగించాలని పార్టీని ఆయన కోరుతున్నప్పటికీ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు పార్టీ శ్రేణులు కూడా అనిల్ వెంట ఉండడం లేదు.
దీంతో ఉద్దేశపూర్వకంగానే పార్టీ తనను దూరం పెట్టిందన్న వాదన అనిల్ అనుచరుల మధ్య వినిపిస్తోంది. దీని వెనక వైసీపీలో నుంచి బయటికి వెళ్లిన కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని అనిల్ భావిస్తున్నారు. ఇది కూడా ఆయన ఆవేదనకు కారణమని తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీ పట్టించుకోవాలని కోరుతున్నప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి పెద్దగా స్పందన అయితే కనిపించడం లేదు. ఈ పరిణామాల నేపద్యంలోనే అనిల్ సైలెంట్ అయ్యారు అన్న వాదన వినిపిస్తుంది.
గతంలో తన అనుమతి లేకుండా ఫ్లెక్సీ కూడా కట్టే పరిస్థితి లేని నియోజకవర్గం లో ఈరోజు ఎక్కడ చూసినా తన మాట వినిపించకపోవడం, తనని పట్టించుకోకపోవడం వంటివి అనిల్ కు ఇబ్బందికరంగా మారాయి అన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. మరి పరిస్థితి ఇలాగే ఉంటుందా.. అనిల్ కి ప్రాధాన్యం ఇస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే నెల్లూరు రాజకీయాల్లో అనిల్ హవా అయితే కనిపించడం లేదన్నది స్పష్టం అవుతోంది. ఒకప్పుడు ఆయన తొడగొట్టిన నియోజకవర్గంలోనే ఇప్పుడు తిరలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సొంత బాబాయే టీడీపీలో చేరడం మరింత ఇబ్బందిగా మారింది.
