కోబ్రా పోస్ట్ సంచలనం.. ఇండియన్ బిజినెస్ ఇండియన్లను ఎలా దోచుకుంటోంది?
ఈ సమయంలో... జెర్సీకి చెందిన అమ్మోలైట్ హోల్డింగ్స్ మధ్యవర్తిగా వ్యవహరించిందని నివేదిక సూచిస్తుంది.
By: Raja Ch | 31 Oct 2025 3:13 PM ISTభారతీయ వ్యాపారం భారతీయులను ఎలా దోచుకుంటోంది అనే విషయ చెబుతామంటూ కోబ్రాపోస్ట్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇందులో భాగంగా... 2006 నుండి అనిల్ అంబానీకి చెందిన అనిల్ ధీరూభాయ్ అంబానీ (ఏడీఏ) గ్రూప్ బ్యాంకు రుణాలు, ప్రారంభ పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ), బాండ్ల ద్వారా సేకరించిన నిధులను ప్రమోటర్ సంస్థల్లోకి మళ్లించడం ద్వారా మొత్తం రూ.28,874 కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్ దర్యాప్తు ఆరోపించింది.
ఇదే సమయంలో.. రు.28,874 కోట్లకు అదనంగా $1.53 బిలియన్లు (సుమారు రూ.13,048 కోట్లు) విదేశాల నుండి ఏడీఏ గ్రూపు సంస్థలకు అక్రమంగా మళ్లించబడ్డాయని.. దీని వలన మొత్తం దుర్వినియోగం రూ.41,921.6 కోట్లకు చేరుకుందని దర్యాప్తులో తేలిందని తెలిపింది. ఈ సందర్భంగా తమ దర్యాప్తు బహుళ అధికారిక, పబ్లిక్ థర్డ్-పార్టీ వనరుల సమగ్ర విశ్లేషణపై ఆధారపడి ఉందని కోబ్రాపోస్ట్ వెల్లడించింది.
అదేవిధంగా... తమ దర్యాప్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), సెబీతో సహా నియంత్రణ సంస్థల వైఫల్యాన్ని మాత్రమే కాకుండా.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ వంటి చట్ట అమలు సంస్థల వైఫల్యాన్ని కూడా నొక్కి చెబుతుందని.. ఈ కథనం నొక్కి చెప్పింది. దీంతో.. ఇది కాస్తా సంచలనంగా మారింది.
కోబ్రాపోస్ట్ ప్రకారం.. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్ ఇన్ఫ్రా), రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ (ఆర్ కాప్), రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్ కాం), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్ హెచ్.ఎఫ్.ఎల్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్.సీ.ఎఫ్.ఎల్), రిలయన్స్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్ (ఆర్.సీ.ఏ.ఎస్.ఎల్) వంటి ఆరు లిస్టెడ్ ఏడీఏ గ్రూప్ కంపెనీలు ప్రమోటర్ గ్రూప్ కంపెనీలకు నిధులను మళ్లించడానికి ఉపయోగించబడ్డాయి.
'ది లూట్ వాల్లాస్: హౌ ఇండియన్ బిజినెస్ ఈజ్ రాబింగ్ ఇండియన్స్ (పార్ట్ 1)' అనే శీర్షికతో కోబ్రాపోస్ట్ విడుదల చేసిన నివేదికలో... సింగపూర్, సైప్రస్, మారిషస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, జెర్సీలలో నమోదైన డజన్ల కొద్దీ పాస్-త్రూ కంపెనీలను ఉపయోగించి రిలయన్స్ ఏడీఏ గ్రూప్ ప్రజా నిధులను అనిల్ అంబానీ, కుటుంబ సభ్యుల నియంత్రణలో ఉన్న దాని హోల్డింగ్ కంపెనీ రిలయన్స్ ఇన్నోవెంచర్ కు తిరిగి తరలించిందని ఆరోపించింది.
ఈ పోస్ట్ ప్రకారం ఆ నిధుల్లో కొంత మొత్తం ఎలా వ్యక్తిగత విలాసాలకు వాడారనేది వివరించింది. ఇందులో భాగంగా... 2008లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ నిధులతో అనిల్ అంబానీ, టీనా అంబానీ పేరిట 20 మిలియన్ డాలర్ల (సుమారు రూ.170 కోట్లు) విలువైన ఓ యాచ్ కొనుగోలు చేశారు. రిలయన్స్ ట్రాన్స్ పోర్ట్ & ట్రావెల్స్, గేట్ వే నెట్ ట్రేడింగ్ ద్వారా ఫోనీ హ్యాండ్ సెట్ సరఫరా ఒప్పందం ద్వారా ఆర్.కాం నిధులను దారి మళ్లించారని చెబుతోంది.
ఈ సమయంలో... జెర్సీకి చెందిన అమ్మోలైట్ హోల్డింగ్స్ మధ్యవర్తిగా వ్యవహరించిందని నివేదిక సూచిస్తుంది. ఈ క్రమంలో... యాచ్ అమ్మకం పూర్తయిన తర్వాత, అమ్మోలైట్ లోని ఈక్విటీని గ్రూప్ కంపెనీలు రద్దు చేశాయి.. తద్వారా జవాబుదారీతనం రద్దు చేయబడింది. మరో రూ.395 కోట్లు హాలీవుడ్ లో స్టీవెన్ స్పీల్ బర్గ్ డ్రీమ్ వర్క్స్ స్టూడియోస్ లో పెట్టుబడిగా పెట్టారు.
ఇదే క్రమంలో.. ఆఫ్ షోర్ మార్గాల్లో సింగపూర్ లోని ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ & ట్రేడింగ్ 2007లో ఏడీఏ సంస్థలకు $750 మిలియన్లను బదిలీ చేసిందని.. ఆ తర్వాత ఆ సంస్థ రద్దు చేయబడిందని కోబ్రాపోస్ట్ ఆరోపించింది. షెల్ సంస్థలు ఏఏఏ & సన్స్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో డౌన్ స్ట్రీమ్ పెట్టుబడిని ఉపయోగించాయని, తరువాత రిలయన్స్ ఇన్నోవెంచర్ లో అవి విలీనం అయ్యాయని, ఈ ప్రవాహాన్ని కప్పిపుచ్చాయని ఈ కథనం వాదిస్తుంది.
ఆరోపణలను తోసిపుచ్చిన ఏడీఏ గ్రూప్!:
ఈ కథనంపై రిలయన్స్ ఏడీఏ గ్రూప్ స్పందించిందని.. ఒక అధికారిక ప్రకటనలో దీనికి ఖండించిందని కోబ్రాపోస్ట్ తెలిపింది. దీని ప్రకారం... కోబ్రాపోస్ట్ ను 'పనికిరాని, అపఖ్యాతి పాలైన ఆన్ లైన్ ప్లాట్ ఫామ్' అని పిలిచింది. 2019 నుండి నిద్రాణమై ఉన్న ఈ ఫ్లాట్ ఫామ్... రిలయన్స్ ఏడీఏ గ్రూప్ ఆస్తులను కొనుగోలు చేయడంలో వాణిజ్య ప్రయోజనాలతో ప్రత్యర్థుల నుండి నిధులు సేకరించబడిన కార్పొరేట్ కుట్రలో భాగంగా పునరుజ్జీవింపబడుతోందని పేర్కొంది.
ఇదే సమయంలో... ఈ కథనం.. అనిల్ అంబానీ, రిలయన్స్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్, రిలయన్స్ పవర్ యొక్క ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు 55 లక్షల మంది వాటాదారులను తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా ఉందని.. కోబ్రాపోస్ట్ వ్యవస్థాపకుడు అనిరుద్ధ బహల్ గ్రూప్ నుండి రాయితీలు పొందేందుకు అనుచితమైన, బలవంతపు వ్యూహాలకు పాల్పడుతున్నారని కఅంపెనీ ఆరోపించింది.
