లక్షల విలువైన బైక్ ను బూడిద చేసిన తండ్రి..! కారణం తెలుసుకొని షాక్..
ఒక తండ్రి తన కష్టార్జితంతో కొడుకు కోరిక తీర్చాలని స్పోర్ట్స్ బైక్ కొనిస్తే, ఆ కొడుకు దాని విలువ తెలియకుండా ప్రవర్తించడం విచారకరం.
By: Tupaki Political Desk | 28 April 2026 11:27 AM ISTఒక తండ్రి తన కష్టార్జితంతో కొడుకు కోరిక తీర్చాలని స్పోర్ట్స్ బైక్ కొనిస్తే, ఆ కొడుకు దాని విలువ తెలియకుండా ప్రవర్తించడం విచారకరం. విశాఖ జిల్లా, పూడూరులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు.. నేటి యువత ప్రవర్తన, తల్లిదండ్రుల ఆవేదనపై పెద్ద చర్చకు దారితీసింది. తల్లిదండ్రులు తమ పిల్లలు మారం చేయడమే తడవుగా, శక్తికి మించి ఖరీదైన వస్తువులు కొనిస్తుంటారు. విశాఖపట్నం జిల్లా పూడూరులో ఒక తండ్రి కూడా తన కొడుకు ముచ్చటపడ్డాడని కష్టపడి ఒక స్పోర్ట్స్ బైక్ కొనిచ్చాడు. కానీ, ఆ కొడుకు బాధ్యతగా చదువుకోవాల్సింది పోయి, ఆ బైక్‌ను గాలికి తిరగడానికి, ర్యాష్ డ్రైవింగ్ చేయడానికి వాడుతూ తండ్రి నమ్మకాన్ని వమ్ము చేశాడు. చివరకు ఆ తండ్రి సహనం నశించి, కళ్లముందే ఆ బైక్‌కు నిప్పు పెట్టాడు. ఈ దృశ్యం విశాఖ వాసులను ఆశ్చర్యానికి గురి చేసింది.
అడిగాడని కొనిస్తే..
పూడూరుకు చెందిన ఆటో డ్రైవర్ కు ఇద్దరు కుమారులు.. అందులో ఒక కుమారుడు బైక్ కొనివ్వాలని కొంత కాలంగా తండ్రిని వేధించాడు. కొడుకు కోరిక కాదనలేక ఆ తండ్రి రూ. లక్షలు వెచ్చించి ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌ను కొనుగోలు చేశాడు. బైక్ వచ్చిన తర్వాత ఆ యువకుడి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. కాలేజీకి వెళ్లడం మానేసి, స్నేహితులతో జల్సాలు చేయడం మొదలుపెట్టాడు. కేవలం తిరగడమే కాకుండా, రోడ్లపై అతివేగంగా వెళ్లడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి పనులు చేస్తూ తన ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో నెట్టాడు. గతంలో ఒకసారి బైక్ పై పడిన ఘటనలో రూ. లక్ష వరకు ఖర్చయ్యాయి.
చలాన్ల మోత..
కొడుకు చేస్తున్న విన్యాసాలు ట్రాఫిక్ పోలీసుల కంటపడ్డాయి. హెల్మెట్ లేకపోవడం, అతివేగం వంటి కారణాలతో బైక్‌పై వరుసగా చలాన్లు పడ్డాయి. చలాన్ల మెసేజ్‌లు తండ్రి ఫోన్‌కు రావడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. బైక్ కొన్న ఖర్చు ఒకెత్తయితే, ఈ చలాన్ల రూపంలో వేల రూపాయలు చెల్లించాల్సి రావడం తండ్రిని కలవరపరిచింది. కొడుకు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ ఎక్కడ ప్రమాదానికి గురవుతాడో అన్న భయం ఆ తండ్రిని నిద్రపోనివ్వలేదు.
ఆగ్రహంతో నిప్పు
చట్టాన్ని అతిక్రమిస్తూ, చదువును నిర్లక్ష్యం చేస్తున్న ఆ బైక్ ఉంటేనే కదా కొడుకు ఇలా తయారయ్యాడని భావించిన ఆ తండ్రి, బయటకు తీసుకువచ్చి అందరూ చూస్తుండగానే నిప్పు పెట్టాడు. ‘నా కొడుకు భవిష్యత్ నాకు ముఖ్యం కానీ ఈ బైక్ కాదు’ అన్న సందేశం ఆయన చర్యలో కనిపిస్తోంది. లక్షల రూపాయల ఆస్తి కాలిపోతున్నా, తన కొడుకు బాధ్యతగా మారాలనే ఉద్దేశంతో ఆయన ఈ పని చేశారు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో, అది కాస్తా వైరల్ గా మారింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎక్కువ మంది తండ్రి చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.
ఈ ఘటన కేవలం బైక్ దహనానికి సంబంధించింది కాదు. ఇది నేటి యువతకు ఒక హెచ్చరిక. తల్లిదండ్రుల కష్టాన్ని గౌరవించని ఏ వస్తువూ నిలవదని ఈ ఘటన నిరూపిస్తోంది. స్పోర్ట్స్ బైక్‌లు వేగం కోసం కాదు, సౌకర్యం కోసం అని యువత గుర్తించాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం గొప్ప కాదు.., అది మన ప్రాణాలకు ముప్పు. తండ్రి తీసుకున్న కఠిన నిర్ణయం.. కనీసం ఇకనైనా ఆ కొడుకులో, అటువంటి ఇతర యువతలో మార్పు తీసుకువస్తుందని ఆశిద్దాం.
