Begin typing your search above and press return to search.

ఏయూలో ఆందోళనగా మారిన నిరసనలు.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా స్పందించిన విద్యార్థులు తమ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ మీడియా ఎదుట వాపోయారు. మణికంఠ మృతికి అధికారులే కారణమంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

By:  Raja Ch   |   26 Sept 2025 1:58 PM IST
ఏయూలో ఆందోళనగా మారిన నిరసనలు.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!
X

ఆంధ్ర యూనివర్శిటీలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్డ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (ఐ.ఏ.ఎస్‌.ఈ)లో బీఎడ్‌ చదువుతున్న విజయనగరానికి చెందిన వి.వెంకట సాయి మణికంఠ(23) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించిన ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. గురువారం మొదలైన ఈ ఆందోళనలు శుక్రవారం మరింత తీవ్రంగా మారాయి.

అవును... ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. ఇందులో భాగంగా... వీసీ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఉదయం విద్యార్థులు రిజిస్ట్రార్ ఆఫీస్‌ ను చుట్టుముట్టారు. ఈ క్రమంలో వాళ్లను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి రణరంగంగా మారింది.

ఈ సందర్భంగా స్పందించిన విద్యార్థులు తమ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ మీడియా ఎదుట వాపోయారు. మణికంఠ మృతికి అధికారులే కారణమంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వీసీ రాజశేఖర్‌ రాజీనామా చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు బలంగా డిమాండ్ చేస్తున్నారు.

స్పందించిన విద్యాశాఖ మంత్రి లోకేష్!:

ఆంధ్ర యూనివర్శిటీలో జరుగుతున్న ఆందోళనలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన... గురువారం ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఫిట్స్‌ తో చనిపోయారని.. అయితే దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయని.. అది ఏమాత్రం సరికాదని అన్నారు.

ఆ విషయంలో ప్రభుత్వపరంగా ఎలాంటి తప్పు లేకపోయినప్పటికీ రాజకీయాలు చేయడం సరికాదని చెప్పారు. యూనివర్సిటీ వీసీలను రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీని టాప్ - 100 వర్శిటీల్లో ఒకటిగా తీర్చిదిద్దే బాధ్యతను ముఖ్యమంత్రి తనకు అప్పగించారని లోకేష్ పేర్కొన్నారు.

కాగా.... ఏయూలోని శాతవాహన వసతి గృహంలో ఉంటున్న మణికంఠ గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో బాత్‌ రూమ్‌ కు వెళ్లేందుకు తలుపు తీస్తుండగా కింద పడిపోయాడు. ఆ సమయంలో ఎంతకీ లేవకపోవడంతో అతని దగ్గరికి వెళ్లిన తోటి విద్యార్థులు అతడిని పైకి లేపారు.

ఆ సమయంలో తనకు ఊపిరి అందడం లేదని, ఆక్సిజన్‌ కావాలని మణికంఠ వారిని కోరాడు. దీంతో వెంటనే ఏయూ డిస్పెన్సరీకి చెందిన అంబులెన్స్‌ కు ఫోన్‌ చేసి కేజీహెచ్‌ కు తరలించారు. అయితే... ఆసుపత్రికి వెళ్లే సరికే అతడు గుండెపోటు కారణంగా ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.