పది నిముషాలో రిటైర్మెంట్...ఇంతలో భారీ షాక్ !
ఒక్క పది నిముషాలు గడిస్తే చాలు ఆయన పదవి నుంచి తప్పుకుంటారు. ఇక రిటైర్ అయిపోతారు అన్న మాట.
By: Satya P | 1 Aug 2026 9:27 AM ISTఒక్క పది నిముషాలు గడిస్తే చాలు ఆయన పదవి నుంచి తప్పుకుంటారు. ఇక రిటైర్ అయిపోతారు అన్న మాట. ఒక విధంగా చెప్పాలంటే స్వేచ్చా జీవి అవుతారు. కానీ ఆ పది నిముషాలే ఆయన మీద యాక్షన్ కి చాలు అన్నట్లుగా సస్పెన్షన్ వేటు పడిపోయింది. దాంతో ఆయన రిటైర్మెంట్ మీద ఒక మచ్చ పడేలా ఈ చర్య ఉందని అంటున్నారు. ఇంతకీ సస్పెన్షన్ కి గురి అయిన ఆ మాజీ వీసీ ఎవరు అంటే వైసీపీ హయాంలో ఆంధ్రా వర్శిటీలో హవా చాటుకున్న ప్రసాద్ రెడ్డి. ఆయన మీద వివిధ ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ పదవీ విరమణ రోజే సస్పెన్షన్ చేస్తూ ఏయూ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది.
అభియోగాలు ఇవే :
ఇక ప్రసాద్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా కాలం పాటు వీసీగా వ్యవహరించారు. ఆయన వీసీగా ఉన్నపుడు నిధుల దుర్వినియోగం జరిగిందని అధికార దుర్వినియోగం కూడా చేశారని విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఏయూ పాలక మండలి నిర్ణయించింది. మాజీ వీసీ మీద వచ్చినవి తీవ్రమైన అభియోగాలు అని యాజమాన్యం పేర్కొంది. ఈ విధంగా విజిలెన్స్, విచారణ కమిటీలు సమర్పించిన నివేదికల ఆధారంగా ఏయూ పాలక మండలి అత్యవసర సమావేశం జరిపి మరీ ఈ రకంగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఏసీబీతో విచారణ :
ఇక చూస్తే మాజీ వీసీ హయాంలో జరిగిన విషయాల మీద ఫిర్యాదులు అందాయని, అందువల్ల దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, ఆయన అక్రమాలకు పాల్పడినట్లు తేల్చింది. అంతే కాదు ఈ నిధుల దుర్వినియోగం, అక్రమాస్తుల ఆరోపణలపై ఏసీబీతో విచారణ జరిపించాలని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తన నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దాంతో ఏయూ పాలక మండలి ఆయనకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏయూలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలతో ప్రసాద్ రెడ్డి పని గంటలు ముగుస్తాయి. ఆయన రిటైర్ అవుతారు. అయితే దానికి కరెక్ట్ గా పది నిముషాల ముందు సస్పెన్షన్ ఉత్తర్వులను ఏయూ యాజమాన్యం పంపించింది అని చెబుతున్నారు.
సుప్రీం కోర్టు తీర్పు అలా :
అయితే ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పులు నిబంధనలకు విరుద్ధంగా ఆఖరి పది నిమిషాల్లో సస్పెన్షన్ వేటు వేయడమేంటి అని మాజీ వీసీ వర్గీయుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ఏ ఉద్యోగి విషయంలో అయినా అతని పదవీ విరమణకు కనీసం మూడు నెలలు ముందుగా అతడి మీద వచ్చిన ఆరోపణలు విచారించి నిగ్గు తేల్చాలని అపుడే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం తీర్పులలో ఉందని అంటున్నారు. దానిని విరుద్ధంగా ఈ సస్పెన్షన్ ఉందని మాజీ వీసీ వర్గీయులు అంటున్నారు. మరో వైపు చూస్తే ఏయూ చరిత్రలో ఒక ఉద్యోగి పదవీ విరమణ రోజు సస్పెన్షన్ చేయడం ఎక్కడా లేదని అంటున్నారు. ఈ నిర్ణయం అయితే చారిత్రాత్మకం అని చెబుతున్నారు. చూడాలి మరి దీని మీద పర్యవసానాలు ఎలా ఉంటాయో.
