విమెన్స్ డే స్పెషల్ : కూటమి భారీ గిఫ్ట్ రెడీ
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల కోసం అయిదు కొత్త పధకాలకు చంద్రబాబు శ్రీకారం చుడతారు అని అంటున్నారు.
By: Satya P | 7 March 2026 11:16 PM ISTఏపీలో తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలా సంక్షేమ కోసం పట్టుదలగా పనిచేస్తోంది అని అంటున్నారు. దానిని నిలువెత్తు సాక్ష్యంగా ఉచిత బస్సు పధకం ఉంది. ఈ పధకం ద్వారా ఎంతో మంది మహిళలు లబ్ది పొందుతున్నారు. ఏకంగా ఏడు నెలల వ్యవధి లోనే 50 కోట్ల ఉచిత ప్రయాణాలు ఈ బస్సులలో జరిగాయని నివేదికలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం 1660 కోట్ల సబ్సిడీని మహిళల ఫ్రీ బస్ కోసం ఆర్టీసీకి అందించింది. ఈ బస్సులలో మహిళల ఆక్యుపేషన్ 65 శాతానికి పెరిగింది. రోజుకు సగటున చూస్తే పాతిక లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు.
మహిళా సాధికారత దిశగా :
ఇదిలా ఉంటే కూటమి ప్రభుతం మహిళా సాధికారత దిశగా మరో కీలక అడుగు వేస్తోంది అని అంటున్నారు. అందుకోసం అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం ఆదివారం ఘనంగా నిర్వహిస్తోంది. రాజధానిలోని అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిధిగా హజరుకానున్నారు. గత 20 నెలల కూటమి పాలనలో మహిళా సంక్షేమం, అభివృద్ధి, సాధికారతను ప్రభుత్వం ఈ సందర్భంగా వివరించనుంది.
అయిదు కొత్త పధకాలకు శ్రీకారం :
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల కోసం అయిదు కొత్త పధకాలకు చంద్రబాబు శ్రీకారం చుడతారు అని అంటున్నారు. అలాగే అయిదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న కూటమి లక్ష్యాలను వారికి వివరించడమే కాకుండా ఆ దిశగా ఎంతవరకూ సక్సెస్ అయ్యామన్నది రివ్యూ చేస్తారని అంటున్నారు. ఇక చంద్రబాబు సమక్షంలో 36 ఎంవోయూలపై ఉన్నతాధికారులు సంతకాలు చేయనున్నారు. మహిళల కోసం ఏకంగా ఏడు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు అని అంటున్నారు. డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్వయం పేరుతో బ్రాండింగ్ చేయాలని నిర్ణయించారు. అలాగే స్వయం లోగోను తీర్చిదిద్దారు. స్వయం బ్రాండ్ పేరు, లోగోలను ముఖ్యమంత్రి మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించనున్నారు.
వారితో బాబు ముఖాముఖీ :
వివిధ రంగాలకు చెందిన 50 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, ఆర్‌టిసి మహిళా డ్రైవర్లు సహా సక్కెస్ అయిన మహిళా ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొని వారితో చర్చించనున్నారు.వివిధ రంగాలలో తమదైన శైలిలో రాణించి సక్సెస్ ఫుల్ మహిళలతో ముఖాముఖీ భేటీ అవుతారు. వారి సక్సెస్ స్టోరీలను అడిగి తెలుసుకుంటారు. ఏపీలోని మిగిలిన వారికి ఇది ఒక స్పూర్తిగా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏపీలో ప్రతీ పధకానికి మహిళల పేర్లను పెడుతున్నామని వారికే వాటిని అందచేస్తున్నాన్న విషయాన్ని మరోసారి ప్రభుత్వం గట్టిగా చెప్పదలచుకుంది అని అంటున్నారు.
