Begin typing your search above and press return to search.

గణేషా.. ఈసారికి క్షమించు తండ్రీ.. నిన్ను ఇలా వదిలేస్తున్నాం..

వినాయక చవితి అంటే సందడి.. భారీ విగ్రహాలు.. ఊరేగింపులు.. డప్పుల మోత.. చివర్లో ఘనంగా జరిగే నిమజ్జనం.

By:  A.N.Kumar   |   18 Sept 2026 11:56 AM IST
గణేషా.. ఈసారికి క్షమించు తండ్రీ.. నిన్ను ఇలా వదిలేస్తున్నాం..
X

వినాయక చవితి అంటే సందడి.. భారీ విగ్రహాలు.. ఊరేగింపులు.. డప్పుల మోత.. చివర్లో ఘనంగా జరిగే నిమజ్జనం. కానీ ఈసారి ఆ చివరి ఘట్టానికే నీటి కొరత అడ్డంకిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.. చెరువులు–కుంటలు–కాలువల్లో నీటిమట్టాలు పడిపోవడంతో గణేశ విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కడప, చిత్తూరు ప్రాంతాల్లో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది.

వర్షాలు లేక.. ఎండిపోతున్న జలాశయాలు

ఈ ఏడాది ఏపీలో వర్షపాతం లోటు తీవ్రంగా ఉంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా 496.1 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా కేవలం 244.7 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే సుమారు 50.7 శాతం లోటు ఉంది. వైఎస్సార్ కడపలో 57.3 శాతం, చిత్తూరులో 58.7 శాతం వర్షపాతం లోటు నమోదైంది. కడప జిల్లాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలోని 27 మండలాల్లో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 50 శాతానికి పైగా లోటు నమోదైంది. ఫలితంగా నదులు, కాలువలు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత బాగా తగ్గిపోయింది.

నిమజ్జనానికి వెళ్లిన విగ్రహాలు.. ఖాళీ చెరువుల్లో వదిలేస్తున్న పరిస్థితి

సాధారణంగా పెద్ద విగ్రహాలను సమీపంలోని చెరువులు, నదులు, సాగునీటి ప్రాజెక్టుల్లో నిమజ్జనం చేస్తారు. కానీ నీరు లేకపోవడంతో ఈసారి నిర్వాహకులకు కొత్త సమస్య ఎదురైంది. కొన్ని ప్రాంతాల్లో చిన్న చెరువులు, చెక్‌డ్యామ్‌లను నిమజ్జనానికి ఉపయోగించాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల పెద్ద విగ్రహాలు పూర్తిగా నీటిలో మునిగే పరిస్థితి లేక సగం మాత్రమే నీటిలో ఉండిపోయిన దృశ్యాలు కనిపించాయి. ఇక ఖాళీ నీరు లేని ఎండిన చెరువుల్లో గణనాథులను నిలబెట్టి వచ్చేస్తున్న దుస్థితి నెలకొంది. కడప జిల్లా కమలాపురం వద్ద కుందేరు నదిలో కూడా ఇలాంటి పరిస్థితి నమోదైనట్లు వార్తలు వచ్చాయి.

పంటలకే నీరు లేకపోతే.. భారీ విగ్రహాల సంగతేంటి?

ఇక్కడే మరో ప్రశ్న తెరపైకి వస్తోంది. రైతులు పంటలకు నీటి కోసం ఎదురుచూస్తున్న సమయంలో భారీ విగ్రహాల నిమజ్జనానికి నీరు దొరకకపోవడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం వ్యవసాయంతో పాటు భూగర్భ జలాలపై కూడా ప్రభావం చూపుతోంది. విశాఖపట్నంలో ఏడాది వ్యవధిలో భూగర్భ జలమట్టం 3.8 మీటర్లు పడిపోయినట్లు ఇటీవల నివేదికలు వెల్లడించాయి.

ఇలాంటి పరిస్థితుల్లో భారీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలి.. వీలైనంత వరకు కృత్రిమ నిమజ్జన కుంటలను ఏర్పాటు చేయాలి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం పర్యావరణ పరిరక్షణ కోణంలోనే కాకుండా నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని కూడా ఆలోచించాల్సిన అంశంగా మారింది.

పండుగ జరగాలి.. కానీ ప్రకృతికి భారం కాకూడదు

వినాయక చవితి భక్తి, సంప్రదాయాలకు ప్రతీక. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు పండుగల నిర్వహణ పద్ధతులపై కూడా మనం ఆలోచించేలా చేస్తున్నాయి. వర్షాలు తగ్గినప్పుడు నీటి వినియోగానికి ప్రాధాన్యతలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది.

గణేషుడి నిమజ్జనానికి నీరు దొరకని పరిస్థితి.. నిజానికి మన నీటి భవిష్యత్తుపై ప్రకృతి ఇచ్చిన హెచ్చరికగానే చూడాలి. పండుగ ఉత్సాహం కొనసాగుతూనే నీటి సంరక్షణ, మట్టి విగ్రహాలు, కృత్రిమ నిమజ్జన కుంటలు వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.