వెల్వేర్ వర్సెస్ డెవలప్మెంట్... ఏపీ రాజకీయాల్లో ఓటరు ఏది కోరుకుంటున్నాడు ?
అభివృద్ధి కోణంలో ఓట్లు వేస్తారు అనుకుంటే దానికి విరుద్ధమైన తీర్పుని ఇచ్చిన ఘనత ఓటర్లది, ఇక సంక్షేమమే ఫస్ట్ అన్నట్లుగా వారి కోసం లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి అమలు చేసినా తిప్పికొట్టి ఓడించారు.
By: Satya P | 28 Aug 2026 8:23 AM ISTఏపీ ఓటరు తీరు విలక్షణం అన్నది అనేక ఎన్నికల ఫలితాలను బట్టి రుజువు అవుతూ వచ్చింది. అభివృద్ధి కోణంలో ఓట్లు వేస్తారు అనుకుంటే దానికి విరుద్ధమైన తీర్పుని ఇచ్చిన ఘనత ఓటర్లది, ఇక సంక్షేమమే ఫస్ట్ అన్నట్లుగా వారి కోసం లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి అమలు చేసినా తిప్పికొట్టి ఓడించారు. దాంతో ఏపీ ఓటరు ఏమి కోరుకుంటున్నాడు అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు, ఇంతకీ ఏపీ ఓటర్ కి ఏమి కావాలన్నది రాజకీయ పార్టీలకే కాదు తలపండిన రాజకీయ విశ్లేషకులకు కూడా అర్థం కావడం లేదు. నిజానికి చూస్తే ఏపీ ఓటర్ తీర్పు ఎపుడూ చిత్రంగానే ఉంటూ వస్తోంది.
ఈ రోజు అవసరాలే ముఖ్యమా :
సంక్షేమం అంటే ఈ రోజు అవసరాలే అని చెప్పాల్సి ఉంటుంది. అంతే కాదు ఓటర్లకు తాత్కాలిక ఊరటగానే సంక్షేమ పధకాలు ఉంటాయి. బడ్జెట్ లో వీటిని ప్రణాళికేతర వ్యయంగా చూపిస్తారు. అంటే సంక్షేమానికి పెట్టిన ఖర్చు తిరిగి వెనక్కి రాదు, అదే సమయంలో అభివృద్ధి కోసం అప్పులు చేసి ఖర్చు చేసినా వాటి ఫలాలు అందుబాటులోకి దీర్ఘకాలంలో వస్తాయి. దాంతో ఏదో నాటికి తెచ్చిన అప్పులను తీర్చే ఆర్థిక స్తోమత ప్రభుత్వానికి వస్తుంది. అందుకే ఈ ఖర్చుని ప్రణాళిక వ్యయంలో చేరుస్తారు. నిజానికి చూస్తే ఏ ప్రభుత్వం అయినా సంక్షేమాన్ని చూస్తూ అభివృద్ధిని చేపట్టాలి. మనది సంక్షేమ రాజ్యం అని చెబుతారు కాబట్టి. అయితే ఇక్కడ బ్యాలెన్స్ అవసరం ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయించి ఖర్చు చేసినపుడే ఏ రాష్ట్రం అయినా ప్రగతిబాటలో పడుతుంది.
రెండూ ప్రజలకు అవసరమే :
ఇదిలా ఉంటే ఓటరుకు ఈరోజు భరోసా ముఖ్యమా లేక రేపటి అవకాశాలు ముఖ్యమా అంటే రెండూ ముఖ్యమనే అని చెప్పాలి. సంక్షేమం అభివృద్ధి నిజానికి వేరు వేరు అంశాలు అయితే కావనే అంటున్నారు. పేదలు ఎక్కువగా ఉన్న సమాజంలో సంక్షేమం చూస్తూనే అభివృద్ధికి పెద్ద పీట వేయాలి. అదే సమయంలో ఒక్క సంక్షేమమే ముఖ్యం అనుకుంటే రాష్ట్ర ప్రగతి ఆగిపోతుంది. రేపటి భవిత కూడా అయోమయంలో పడుతుంది. అందువల్ల అభివృద్ధి అంటూ జరిగితేనే ఉద్యోగాలు, పరిశ్రమలు, రోడ్లు వంటివి అందుబాటులోకి వస్తాయి. ఇలా రెండింటి విషయంలో సమ తూకంలోనే ఎవరైనా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఓటర్ విచక్షణ దేని మీద :
ఇక్కడ మరో పాయింట్ ఉంది. ఓటరు విచక్షణ మేరకు ఎన్నికల్లో ఓటు వేస్తున్నాడు. అయితే అతను ఒక ప్రభుత్వం విషయంలో దేనిని ప్రాధాన్యతగా తీసుకుని తీర్పు చెబుతున్నాడు అన్నది కీలక పాయింట్. అయితే ఓటరు అయిదేళ్ళ పాలన మీద అభివృద్ధి మీద అలాగే సంక్షేమం మీద పూర్తిగా సమగ్రంగా ఆలోచించి ఓటు వేస్తున్నాడా అంటే ఒక్కోసారి కాదు అనే అనిపిస్తుంది. ఎక్కువ మంది ఎన్నికల వేళ అప్పటి ఆలోచనలకు అనుగుణంగా ఓట్లు వేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. అలాగే అభివృద్ధి అన్నది పెద్ద సబ్జెక్ట్. దాని మీద పూర్తి అవగాహన పెంచుకుని ఓటేసే వారు తక్కువే ఉంటారు. ఇక తమకు ఎంత మేలు జరిగింది, ఇంకెంత మేలు జరగబోతోంది అన్న కోణంలో ఇటీవల కాలంలో ఓటర్లు ఓట్లు వేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. అందుకే ఎన్నికల మేనిఫేస్టోలో ఉచిత పధకాలు అధికంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.
వివిధ వర్గాల తీర్పు :
ఇక అదే సమయంలో యువత అయితే తమకు ఉపాధి అవకాశాలు దక్కాలని కోరుకుంటుంది. ఆ దిశగా చూసి ఓటేస్తుంది. మధ్య తరగతి వర్గం అయితే స్థిరమైన ప్రగతిని చూసి తమ తీర్పుని ఇస్తుంది. పేదలు ఎక్కువగా సంక్షేమం గురించి ఆలోచిస్తారు అని అంటారు. అలాగే ఉన్నత వర్గాలు ఇతర వర్గాలు అభివృద్ధి వేగంగా చేసే వారిని చూసి తమ ఓటు వేస్తారు. అయితే మెజారిటీ ఓటర్లు మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చూస్తూ ఓట్లు వేస్తున్నారు అని ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. దానికి కారణం వ్యవస్థల మీద నమ్మకం లేకపోవడం, ఎవరి గెలిచినా తనకేమిటి ప్రయోజనం అన్నది వారిలో ఏర్పడిన నిర్వేదంగా చూడాల్సి ఉంది.
దీర్ఘ కాలం వ్యవహారం :
ఇక్కడ మరో విషయం ఉంది. అభివృద్ధి అంటే అది దీర్ఘకాల వ్యవహారంగా ఉంటుంది. ఇపుడున్న పరిస్థితులలో అభివృద్ధి ఫలితాలు అందుకోవాలంటే చాలా సమయం పడుతోంది. అయిదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటర్లు అంత దీర్ఘకాలం విజన్ తో ఆలోచించడం లేదు, పైగా అభివృద్ధి అంటే అందరిదీ అవుతోంది. తాయిలాలు మాత్రం తమకు నేరుగా వచ్చి చేరుతాయన్న ఆలోచనతో అనేక మంది ఉంటున్నారు అన్నది కూడా విశ్లేషణగా ఉంది. దాంతోనే ఇపుడు సంక్షేమానికి తప్పనిసరిగా పెద్ద పీట వేయాల్సిన అవసరం అగత్యం అన్ని రాజకీయ పార్టీలకు ఏర్పడుతోంది. ఇది దేశమంతా కూడా కనిపిస్తోంది.
ఇవి ప్రభుత్వాల బాధ్యత :
అయితే సంక్షేమం అంటే కేవలం తాయిలాలు మాత్రమే కాదు విద్య వైద్యం ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడం వారి జీవన ప్రమాణాలు పెంచడం కూడా బాధ్యతనే ఉంటుంది. అయితే మందితో పాటు తమకూ వ్యక్తిగతంగా జరిగే మేలు ఏమిటి అన్న కొత్త రకం ఆలోచన గడచిన కొన్నేళ్ళుగా ఓటర్లలో బయలుదేరింది. దాంతో వారు ఆ దిశగానే ఆలోచించి ఓటు వేస్తున్నారు. అలాగని ఉచితాలు దండీగా ఇంచుకుంటూ పోతే అది అనుచితమే అవుతుంది. ఖజానాకు ఆర్థిక భారం పెరిగితే రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. అందువల్ల ఉచితాలు ఇస్తూనే అభివృద్ధి గురించి వారికి సవివరంగా పాలకులు తెలియచెప్పాలి. అలా జనాలలో చైతన్యం తీసుకుని రావాల్సి ఉంది.
అభివృద్ది అంటే ఏమిటి :
అభివృద్ధి అంటే సరైన నిర్వచనం ఏమిటి అన్న ప్రశ్నలు ఉన్నాయి. ఎత్తైన భవనాలు అలాగే రోడ్లు, మౌలిక వసతులు అభివృద్ధి నమూనాగా చూడాలా అంటే ఇవి అభివృద్ధి కిందకే వస్తాయి. కానీ వీటితో పాటుగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడితేనే అసలైన అభివృద్ధి అన్నది ఆర్ధిక మేధావుల మాటగా ఉంది. మరో వైపు చూస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించడం కూడా అభివృద్ధిగా చూడాల్సి ఉంటుంది. ఇన్ని పరిశ్రమలు వచ్చాయి అన్ని పెట్టుబడులు వచ్చాయి అని వల్లిస్తే నిరుద్యోగ యువత సంతృప్తి చెందదు, వాటి ద్వారా తమకు ఉపాధి దక్కితేనే వారు ప్రగతి ఫలితాలను స్వయంగా ఆస్వాదిస్తారు. అది జరగాలి అంటే ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలి, పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా పారదర్శకంగా ఉండాలని మేధావులు సూచిస్తున్నారు.
రాష్ట్రం శక్తి ఎంత :
ఇక ఇవన్నీ బాగానే ఉన్నా అభివృద్ధి సంక్షేమం రెండూ సరిగ్గా అమలు చేయాలీ అంటే రాష్ట్రానికి శక్తి కావాలి. ఆ విషయంలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. అలాగని ఒక వైపే చూడడం వల్ల కూడా మేలు జరిగేది ఉండదని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ లాంటి రాష్ట్రాలు ఈ విషయంలో కచ్చితంగా నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలి. ప్రజలు కూడా ఈ విషయంలో చైతన్యవంతులు కావాల్సి ఉంది. వీటన్నింటికంటే కూడా పాలకుల మీద ప్రజలకు పూర్తి విశ్వాసం నెలకొన్న నాడు వారు ఖచ్చితంగా ప్రభావితం అవుతారు. అపుడు పాలకుడు నాయకుడిగా మారి తన వెంట కోట్లాదిమంది ప్రజలను నడిపిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలరన్నది అసలైన విశ్లేషణ.
