ఆనాడు వైఎస్సార్ ఆలోచన...ఈనాడు ఎన్డీయే చేస్తోంది !
ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీ పర్యటన లో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమయ్యారు.
By: Satya P | 17 Jun 2026 8:48 AM ISTఇప్పటికి ఇరవై ఏళ్ళ క్రితం 2006 ఫిబ్రవరి నెలలో అనంతపురం జిల్లాలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. దాని వెనక చొరవ తీసుకున్నది ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నది తెలిసిందే. ఇరవై ఏళ్ళ పాటు దేశవ్యాప్తంగా సాగిన ఆ పథకాన్ని తాజాగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మొత్తం మార్చింది. పేరుతో పాటు అన్ని మార్గదర్శకాలు మారిపోయాయి. ఈ కొత్త పధకం పేరు వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ షార్ట్ కట్ లో వీబీజీ రాం జీ. ఈ పధకాన్ని ఈ ఏడాది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు. మరి దానిని ఎక్కడ నుంచి ప్రారంభిస్తారు అంటే ఏపీ నుంచే అని అంటున్నారు.
ఏపీకి రానున్న కేంద్ర మంత్రి :
వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ వీబీజీ రాం జీ పధకం జాతీయస్థాయిలో ప్రారంభోత్సవం జూలై 1న ఆంధ్రప్రదేశ్ నుండి జరుగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు తమ తమ రాష్ట్రాల్లోని వివిధ క్షేత్రస్థాయి ప్రాంతాల నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. అంటే ఏపీ నుంచే ఈ కొత్త పధకం కూడా స్టార్ట్ అవుతుంది అన్న మాట.
కేంద్ర మంత్రితో పవన్ :
ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీ పర్యటన లో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల పురోగతితో పాటుగా ఉపాధి కల్పన జీవనోపాధి పెంపు, పంచాయతీల అభివృద్ధి, వివిధ కేంద్ర పథకాల అమలుపై చర్చలు జరిపారు. ఈ ముఖ్యమైన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రస్తుత స్థితి భవిష్యత్ ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇదే సందర్భంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఏపీ నుంచే వీబీఆర్ రాం జీ పధకం ప్రారంభిస్తామని చెప్పడం విశేషం.
ఏపీని మెచ్చుకున్నారు :
ఇక ఏపీలో పంచాయతీ రాజ్ వ్యవస్థలో అమలు అవుతున్న పలు కార్యక్రమాల గురించి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రికి వివరించారు. దాంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసిన ఆదర్శ పంచాయతీలు, వ్యర్థరహిత గ్రామ పంచాయతీల పనుల గురించి కూడా అందరికీ అవగాహన కల్పిస్తామని తెలిపారు. గ్రామీణ పరిపాలన సుస్థిర అభివృద్ధి, సామాజిక భాగస్వామ్యం వంటి రంగాలలో ఏపీ ఉత్తమ నమూనాగా నిలిచిందని కేంద్ర మంత్రి అన్నారు. అలాగే నూతన ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోందని తద్వారా ఇతర రాష్ట్రాలు ఈ విజయవంతమైన అనుభవాల నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోగలవని కూడా కేంద్ర మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం ఏపీకి మెచ్చుతునకగా అంతా భావిస్తున్నారు.
