Begin typing your search above and press return to search.

కేంద్ర బడ్జెట్‌పై ఏపీ నుంచి కీలక ప్రతిపాదనలు.. నిర్మలమ్మ ఏం చేస్తారో..

బడ్జెట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.

By:  Tupaki Political Desk   |   11 Jan 2026 1:00 AM IST
కేంద్ర బడ్జెట్‌పై ఏపీ నుంచి కీలక ప్రతిపాదనలు.. నిర్మలమ్మ ఏం చేస్తారో..
X

బడ్జెట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. 29న ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. 30, 31 తేదీల్లో పార్లమెంటుకు సెలవు. ఫిబ్రవరి 1న 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఆదివారమైనా సంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. నిజానికి ఫిబ్రవరి నెల చివరి రోజున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. కానీ, 2017లో ఈ సంప్రదాయంలో మార్పు చేశారు. ఆ ఏడాది నుంచి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.

ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబరులోనే కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది నిధుల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ క్రమంలో ఏపీ ప్రతిపాదనలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఏపీలోని అధికార కూటమి మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతున్నందున గత పదేళ్లలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యం గత బడ్జెట్ నుంచి ఏపీకి దక్కుతోంది. గత ఏడాది బిహార్, ఏపీకే ఎక్కువ కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని కోసం రూ.15 వేల గ్రాంటును కేంద్రం ప్రకటించింది.

అదేసమయంలో ఏపీకి కేంద్రం నుంచి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి. క్వాంటం వ్యాలి, గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు ఇలా ఏ విషయమైనే కేంద్రం ఫస్ట్ ఏపీ అన్నట్లే వ్యవహరిస్తోందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కేంద్రం నుంచి గరిష్టంగా నిధులు సాధించేలా పావులు కదుపుతున్నారు. జలజీవన్ మిషన్, పూర్ణోదయ పథకం, పీఎం సూర్యఘర్ ఇలా కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తూ నిధులలో అధిక వాటా దక్కించుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏపీకి ఎన్ని నిధులు కేటాయిస్తారనేది ఆసక్తి పెంచుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గత నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సమర్పించారు. రాజధాని అమరావతితోపాటు పలు ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని అభ్యర్థించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్యాకేజీని కోరుతున్నారు. వచ్చే మూడేళ్లలో సుమారు రూ.41 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. దీనికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారనేది చూడాల్సివుందని అంటున్నారు.

అదేవిధంగా పోలవరం-నల్లమల సాగర్ లింక్ ద్వారా గోదావరి వరద నీటిని ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఈ ప్రతిపాదనకు కేంద్రం ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వంశధార ప్రాజెక్టు కింద నేరడి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి వివాదాల పరిష్కారం, నిధుల విడుదలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తూర్పు రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం తెచ్చిన పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్య, నైపుణ్యాభివృద్ధి, గృహనిర్మాణ రంగాలకు నిధులు కేటాయించాలని విన్నవించారు.

రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పరిష్కరించడంతో పాటు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లో "గ్రోత్ ఇంజిన్"గా గుర్తింపునిస్తూ భారీ కేటాయింపులు చేయాలని ఏపీ ప్రభుత్వం బలంగా కోరుకుంటోంది. మరి ఈ ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబుకు ప్రాధాన్యం పెరిగినందున నిధుల వరద ఎక్కువ పారే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో కేంద్రం ఏయే వరాలు ఇస్తుందనే ఉత్కంఠ రోజురోజుకు ఎక్కువవుతోందని అంటున్నారు.