విశాఖలో లలిత కళా అకాడమీ- ఏపీలో సాహిత్య అకాడమీ
ఏపీలో పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
By: Satya P | 3 April 2026 12:48 AM ISTఏపీలో పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అనేక కీలక ప్రతిపాదనలు చేస్తోంది. వీటికి కేంద్రం నుంచి భారీ ఆర్ధిక ఊతాన్ని కూడా ఏపీలో కూటమి సర్కార్ కోరుకుంటోంది. ఈ నేపధ్యంలో ఏపీకి సంబంధించి పలు కొత్త టూరిజం ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ను కేంద్రం నుంచి సానుకూల స్పందన లభిస్తోంది.
భారీ ప్రాజెక్టులతో :
ఏపీలో 915 కోట్ల రూపాయల విలువైన తొమ్మిది కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి టూరిజం మంత్రి కందుల దుర్గేష్ తాజాగా సమర్పించారు. అంతే కాకుండా ఏపీలో పెండింగ్ లో ఉన్న ఆరు సాంస్కృతిక ప్రాజెక్టులపైన కీలక చర్చలు జరిపారు ఈ విధంగా వీటి అన్నింటికీ ఆమోదానికి కేంద్ర టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నుంచి హామీ పొందారు. దాంతో ఏపీలో రానున్న రోజులలో టూరిజానికి సంబంధించి రూపు రేఖలే మారిపోతాయని అంటున్నారు.
కీలక నగరాలల్లో ప్రాజెక్టులు :
ఇదిలా ఉంటే విశాఖలో లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం, ఏపీలో సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ బ్రాంచ్ ఏర్పాటుకు కేంద్రం వద్ద ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు ఉంచింది. అలాగే తెలుగు సంస్కృతికి,నాటక రంగానికి జాతీయ గుర్తింపుని కోరుకుంటోంది. ఇక రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, అమరావతిలో పర్యాటక భవన్ ఏర్పాటుకు సైతం కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తోంది అని చెబుతున్నారు. అలాగే అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ,అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం తరఫున చేసిన విజ్ఞప్తులకు సానుకూల స్పందన లభించింది అంటున్నారు.
గ్లోబల్ డెస్టినేషన్స్ :
ఇక అంతర్జాతీయ డెస్టినేషన్లుగా తిరుపతి,విశాఖపట్నంకు నిధుల విడుదలపై కేంద్ర హామీ ఇచ్చింది. అదే విధంగా దేశంలోని 50 అత్యుత్తమ పర్యాటక కేంద్రాల జాబితాలో వీటిని చేర్చేందుకు కేంద్రం నుంచి సముఖత వ్యక్తం అయింది. విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాలలో కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణానికి సైతం కేంద్రం అంగీకరించింది. తెలుగు భాషా వైభవానికి పట్టాభిషేకం కోసం ఏపీ కూటమి తీసుకుంటున్న చర్యలకు కేంద్రం సహకారం అందించనుంది అని అంటున్నారు. ఈ క్రమంలో సూర్యరాయాంధ్ర నిఘంటువు పునర్ముద్రణకు కేంద్రం అంగీకరించింది.
టెంపుల్ టూరిజం కోసం :
ఇదే విధంగా చూస్తే కనుక ప్రసాద్ స్వదేశ్ దర్శన్ పథకాల కింద రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు బీచ్‌ల అభివృద్ధికి నిధులు కేంద్రం నుంచి రాబట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. దాంతో ప్రసాద్ పథకం కింద మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి 95.18 కోట్లు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి 213.72 కోట్లు వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి 120 కోట్లు కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి 36 కోట్లు నెల్లూరు గృహ మల్లేశ్వర స్వామి ఆలయానికి 48.95 కోట్లు నిధులను అభివృద్ధికి కేంద్రం నుంచి భరోసా లభించింది.
