రాష్ట్రాలకు కేంద్రం ర్యాంకింగ్.. టాప్ లో ఏపీ
దేశంలో పీపీపీ విధానంలో చేపట్టే అభివృద్ధి పనులపై కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఏపీ అగ్రస్థానం దక్కించుకుంది.
By: Tupaki Political Desk | 8 Jan 2026 5:00 AM ISTదేశంలో పీపీపీ విధానంలో చేపట్టే అభివృద్ధి పనులపై కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఏపీ అగ్రస్థానం దక్కించుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రానున్న మూడేళ్లలో రూ.1.16 లక్షల కోట్ల పెట్టుబడులతో 270 ప్రాజెక్టులు ఏపీలో ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP)ప్రాజెక్టుల కింద దేశవ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో 852 ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలియజేసింది. ఇందుకుగాను మొత్తం రూ. 17 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు వివరించింది. దీనిపై జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.
పీపీపీ విధానంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రభుత్వం తొలిస్థానంలో నిలవగా, ఆ తర్వాత వరుసగా తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. ఏపీలో రూ. 1.16 లక్షల కోట్ల విలువైన 270 ప్రాజెక్టులను నెలకొల్పనున్నట్లు ఆర్థికశాఖ ప్రకటించింది. అదేవిధంగా తమిళనాడు రూ. 87,639 కోట్లు, మధ్యప్రదేశ్ రూ. 65,496 కోట్ల విలువైన ప్రాజెక్టులను దక్కించుకున్నట్లు కేంద్రం తన నివేదికలో తెలియజేసింది. అదేసమయంలో శాఖల వారీగా వచ్చిన పెట్టుబడులు, ప్రాజెక్టుల వివరాలను కూడా కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో 8 కేంద్ర విభాగాలు, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ కలిపి రూ. 13.15 లక్షల కోట్ల ఉమ్మడి వ్యయంతో 232 పీపీపీ ప్రాజెక్టులను చేపట్టనున్నాయని చెబుతున్నారు. మిగిలిన 3.84 లక్షల కోట్ల రూపాయల విలువైన 620 ప్రాజెక్టులను 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయనున్నాయని వెల్లడించింది. పీపీపీ విధానంపై ఏపీలో పెద్ద ఎత్తున రగడ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం విడుదల చేసిన ఈ జాబితాపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
రాష్ట్రాలు పీపీపీ విధానంలో చేపట్టే వాటిలో సామాజిక రంగం, రవాణా, లాజిస్టిక్స్ ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయని ఆర్థిక శాఖ వెల్లడించింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో సామాజిక, వాణిజ్య మౌలిక సదుపాయాలు కింద 186 ప్రాజెక్టులు, రవాణా, లాజిస్టిక్స్ పెట్టుబడుల ద్వారా 161 ప్రాజెక్టులు రాష్ట్రాల్లో ఏర్పాటు కానున్నాయి. నీరు, పారిశుధ్యంపై 29, ఇంధన రంగంలో 25 ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో నీరు, పారిశుధ్య రంగంలో 75 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపింది. మౌలిక సదుపాయాల రంగంలో 68, రవాణాలో 36, ఇంధన రంగంలో 16 ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పీపీపీ ప్రాజెక్టుల్లో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 108 పనులు చేపట్టనుంది. దీనికింద అయ్యే వ్యయమే రూ. 8.77 లక్షల కోట్లుగా చెబుతున్నారు. అదేవిధంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖలో 46 ప్రాజెక్టులకు రూ. 3.4 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖలో 29 ప్రాజెక్టులకు రూ. 12,254 కోట్లు, నౌకాయానం, రైల్వేలలో కూడా వేల కోట్లతో ప్రాజెక్టులను ప్రతిపాదించారు. అదేసమయంలో పౌర విమానయాన శాఖలో 11 ప్రాజెక్టులను రూ. 2,262 కోట్లతో చేపట్టున్నట్లు ప్రకటించారు.
