ఉత్తరాంధ్రకు విమానయాన ఊపు: AP అభివృద్ధిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశ్లేషణ!
ఈ సదస్సులో భాగంగా ఏపీ విమానయాన రంగానికి సంబంధించి మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు.
By: Sivaji Kontham | 7 Oct 2026 10:23 PM ISTవిశాఖపట్నంలోని ఐఐఎం (IIM) వేదికగా జరిగిన తొలి సీఐఐ (CII) ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక భవిష్యత్తుకు సరికొత్త దిశానిర్దేశం చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కేవలం స్థానిక పరిధిలోనే కాకుండా ఒక ప్రముఖ గ్లోబల్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఏపీ `ఇండియాస్ ఆంధ్ర అడ్వాంటేజ్` పేరుతో సరికొత్త పెట్టుబడి గమ్యస్థానంగా మారుతోందని ఆయన కొనియాడారు.
ఈ సదస్సులో భాగంగా ఏపీ విమానయాన రంగానికి సంబంధించి మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో భవిష్యత్తులో మరో ఆరు కొత్త విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం ప్రారంభిస్తున్నామని చెబుతూ.. ఏవియేషన్ రంగంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని వివరించారు. ఇటీవల ప్రారంభమైన ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని పేర్కొంటూ.. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ అభివృద్ధి ప్రణాళికలలో భాగంగా `విశాఖ ఎకనామిక్ రీజియన్` త్వరలోనే వాస్తవ రూపం దాల్చనుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న పెట్టుబడులు, రవాణా రంగం.. మౌలిక వసతుల కల్పన వల్ల పారిశ్రామికంగా ఎంతో వృద్ధి సాధించే అవకాశం ఉందని చెప్పారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రముఖ గ్లోబల్ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల ప్రజలకు ఇది సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనకు అనుగుణంగా రాష్ట్ర మౌలిక సదుపాయాలు- పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్థన్ రెడ్డి కూడా కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు పూర్తి లాజిస్టిక్స్ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగు మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, 22 ట్రక్ టర్మినల్స్, 300 కోల్డ్ చైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించారు. ఈ సదస్సు వేదికగా పలు దిగ్గజ కంపెనీలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోవడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నిదర్శనంగా నిలిచింది.
వందల కోట్ల పెట్టుబడులు
విమానయాన రంగం - మౌలిక వసతులు:
ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమాన సర్వీసులు ప్రారంభించడం .. భోగాపురం వంటి అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం ద్వారా రాష్ట్రానికి గ్లోబల్ కనెక్టివిటీని పెంచడం.
పారిశ్రామిక వృద్ధి - పెట్టుబడులు:
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీని నూతన పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడం.
ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి:
విశాఖపట్నం -ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే వందల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తాయని అంచనా.
విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో వందల కోట్ల విలువ చేసే ఒప్పందాలు జరిగాయి. ఆ మేరకు ప్రభుత్వంతో కార్పొరెట్ కంపెనీలు ఒప్పందాలు చేసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. వందల కోట్ల బడ్జెట్లతో రూపొందే ఈ ప్రాజెక్టులతో వేలాది ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని ఇండస్ట్రియలిస్టులు తెలియజేసారు.
