ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు.. రాయలసీమ, తెలంగాణకు మాత్రం ఉపశమనం
నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
By: Tupaki Political Desk | 10 Nov 2026 12:38 AM ISTతెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగబట్టాడా? అన్నట్లు పరిస్థితి తయారైంది. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకుంటే, మరోవైపు తుఫాన్లు, అల్పపీడనాలతో ఒకేసారి కురుస్తున్న భారీ వర్షాలు రైతాంగానికి అంతులేని కష్టాన్ని మిగుల్చుతున్నాయి. ముఖ్యంగా వరుస తుఫాన్లు ఏపీ రైతులకు తీవ్ర నష్టాలు కలిగిస్తున్నాయి. అర్నబ్ తుఫాన్ ఆ వెంటనే వచ్చిన మురసు కారణంగా ఏపీలోని కోస్తా ప్రాంతం అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల్లో మరో నాలుగు రోజుల్లో అంటే ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందనే అంచనాలు భయపెడుతున్నాయి.
బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం రూపుదిద్దుకోనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా చేసిన ప్రకటన రైతన్నల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని గమనం, తీవ్రతను బట్టి వర్షాల ప్రభావంపై మరింత స్పష్టత వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ హెచ్చరిక రైతులను వణికిస్తోంది. ఇప్పటికే రెండు భారీ తుఫాన్ల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట నీళ్లలో మునిగిపోయింది. ఇప్పుడు మళ్లీ వర్షాలు కురిస్తే మిగిలిన ఆ కాస్త పంట కూడా నేలమట్టం అయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. అయితే ఇదే సమయంలో తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్న రాయలసీమ, తెలంగాణ రైతులు మాత్రం వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
మారుతున్న వాతావరణం
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. తెలంగాణలో ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతుండగా, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత సాధారణం కంటే తక్కువగా నమోదవుతోంది. ఇలాంటి సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
అప్రమత్తంగా ఉండాలి
ప్రకృతి వైపరీత్యాల నుంచి తేరుకోవడం కష్టంగా మారిన ఈ తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. చేతికి వచ్చిన ధాన్యం, పంట ఉత్పత్తులు తడవకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు సముద్రంలో అలల తాకిడి పెరిగే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా వాతావరణ శాఖ జారీ చేసే అధికారిక బులెటిన్లను మాత్రమే గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
