Begin typing your search above and press return to search.

జగన్ సభలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు : రేవంత్ రెడ్డి లాజిక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా స్పందించారు.

By:  Tupaki Political Desk   |   13 Jun 2026 11:22 AM IST
జగన్ సభలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు : రేవంత్ రెడ్డి లాజిక్
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఈ విషయం ముగిసిన అధ్యాయంగా చెబుతూనే ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో పవన్ సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదన్న విషయం తన పరిధి కాదని చెబుతూనే ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సభలకు అనుమతి ఇవ్వకపోవడంపై పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో జగన్ రెడ్డిని వెనకేసుకువచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటంపై ఆసక్తికర చర్చ జరుగుతోందని చెబుతున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలో తిరిగేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన తెలంగాణలో పోటీ చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. ఆ హక్కు ప్రజాస్వామ్యం కల్పించింది. ఇందులో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం వివరించారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతామంటే ఇక్కడి వారు అదేవిధంగా స్పందిస్తారని సీఎం వ్యాఖ్యానించారు. పవన్ అన్నారు, పొన్నం కౌంటర్ ఇచ్చారు అంతటితో ఆ కథ ముగిసిపోయిందని సీఎం తేల్చిచెప్పారు.

హైదరాబాద్ లో పవన్ సభకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్నది పోలీసుల ఇష్టం. నా ప్రమేయం ఏముంటుంది? తెలంగాణలో అనేక మంది స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. వారందికీ లభించిన అనుమతులు పవన్ కల్యాణ్ కు లభించలేదంటే, అది పోలీసుల నిర్ణయం. ఏపీలో జగన్ కు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదన్నది పవన్ ముందుగా చెప్పాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత విధానాలను ఎప్పుడూ సమర్థించదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే పవన్, టి.కాంగ్రెస్ వివాదంలో ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి పేరు ప్రస్తావించడమే హాట్ టాపిక్ అవుతోంది.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన పర్యటనకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. గత 13 నెలలుగా హైదరాబాద్ లో పర్యటనకు సమస్యలు ఎదురవుతున్నట్లు పవన్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పవన్ పర్యటనపై అభ్యంతరం లేదని చెబుతూనే, ఏపీలోని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పర్యటనలను అడ్డుకుంటున్నారనే కోణంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో విపక్ష వైసీపీకి అస్త్రంగా మారే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

జగన్, రేవంత్ రెడ్డి మధ్య రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేకపోయినా, పవన్ ను ఇరుకన పెట్టేందుకు జగన్ పేరు ప్రస్తావించి పరోక్షంగా ఆయనకు రేవంత్ రెడ్డి సహకరించారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వాడుకుని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తనను అడ్డుకుంటుందని జగన్ రెడ్డి ప్రచారం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.