Begin typing your search above and press return to search.

కొలికపూడి, రఘురామ.. ఈ లిస్టులో ఇంకెవరు ఉన్నారు?

ఏపీలో అధికార టీడీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే తలనొప్పులు ఎక్కువవుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   25 Oct 2025 2:00 AM IST
కొలికపూడి, రఘురామ.. ఈ లిస్టులో ఇంకెవరు ఉన్నారు?
X

ఏపీలో అధికార టీడీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పెద్దలకు షాకిచ్చాయని అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలను తప్పుపట్టేలా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చేసిన వాఖ్యలు అనేక ఊహాగానాలకు తెరలేపాయి. అదేవిధంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కు ఎన్నికల ముందు తాను ఐదు కోట్లు ఇచ్చానంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి రేపిన దుమారం రాష్ట్ర రాజకీయాలను ముఖ్యంగా టీడీపీ అంతర్గత రాజకీయాలను ఒక కుదుపునకు గురిచేశాయని అంటున్నారు.

సీనియర్ రాజకీయ నేత, కూటమి పార్టీల్లో అందరివాడుగా చెప్పుకునే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు విశాఖ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని తప్పుపడుతూ, భీమవరం డీఎస్పీ జయసూర్య సమర్థుడంటూ కితాబునివ్వడం కలకలం రేపింది. అయితే వెంటనే సర్దుకున్న డిప్యూటీ స్పీకర్ మరునాడు నష్టనివారణకు దిగినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ కు విలువనివ్వకుండా మాట్లాడటమేంటని చర్చకు కారణమైందని అంటున్నారు. టీడీపీతో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ ఎంతో సఖ్యత కోరుకుంటున్న సమయంలో రఘురామ వంటి సీనియర్లు ఇలా మాట్లాడటం సబబేనా? అన్న చర్చ జరుగుతోంది. ఆయన వైఖరి తెలిసిన వారు ఈ విషయంలో ప్రశ్నించడానికి కూడా వెనకడుగు వేస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రఘురామతో ఎలా మాట్లాడాలో అన్న తర్జనభర్జన పడుతున్నారని అంటున్నారు.

గోదావరి జిల్లాలకు చెందిన డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు సహజంగా మాట్లాడినా ఎక్కడో ఒక చోట వ్యంగ్యం ధ్వనిస్తుందనే అభిప్రాయం ఉంది. తన మాటకు గోదావరి ప్రాంత చణుకులు జోడించే రఘురామ ప్రతిపక్షాలపై వేసిన పంచులతో అందరికీ నవ్వు తెప్పిస్తుంటారు. కానీ, స్వపక్షంపైనా ఆయన అదే బాణీ ప్రదర్శించడం వల్ల ఎమ్మెల్యేలు అంతర్గతంగా ఆయనపై గుర్రుగా ఉంటున్నారని చాలాకాలంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయం పార్టీ ద్రుష్టికి వెళ్లినా, రఘురామను నియంత్రించే పనిచేయలేదని అంటున్నారు. దీంతోనే ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పైనా అదే పద్ధతిలో మాట్లాడేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్ల వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి ఫలితం ఎదుర్కొంటారో కానీ, పార్టీకి మాత్రం నష్టం చేస్తున్నారన్న విషయాన్ని విస్మరిస్తున్నారని అంటున్నారు.

ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విషయంలో కూడా పార్టీ ఎన్నో అవకాశాలు ఇస్తున్నా, ఆయన తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన రెండో రోజే కొలికపూడి రేపిన వివాదం తీవ్ర చర్చకు దారితీసింది. దుందుడుకు వైఖరితో పార్టీ కార్యకర్తలు, అధికారులు, మీడియాతోనూ ఆయన విభేదాలు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు నేరుగా పార్టీ అగ్ర నాయకత్వంపైనే ఆరోపణలకు దిగడంతో ఎమ్మెల్యే విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో రఘురామ, కొలికపూడి వంటి వివాదాస్పదుల జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల్లో కొందరు ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు, ఆరోపణలు వచ్చినా, అధిష్టానం జోక్యం వల్ల వెంటనే సర్దుకునే వారు. కానీ కొలికపూడి, రఘురామ వంటివారు మాత్రం తమ సహజ ప్రవర్తనను వీడక పార్టీని చిక్కుల్లో నెడుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.