Begin typing your search above and press return to search.

ప్రతీ గడపకూ వెళ్ళాల్సిందే.... ప్రతీ తలుపూ తట్టాల్సిందే !

తెలుగుదేశం పార్టీ ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. రెండేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజల దగ్గరకు వెళ్ళి నేరుగా చెప్పాలనుకుంటోంది.

By:  Satya P   |   17 Jun 2026 1:00 PM IST
ప్రతీ గడపకూ వెళ్ళాల్సిందే.... ప్రతీ తలుపూ తట్టాల్సిందే !
X

తెలుగుదేశం పార్టీ ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. రెండేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజల దగ్గరకు వెళ్ళి నేరుగా చెప్పాలనుకుంటోంది. అందుకోసం ప్రతీ గడప వద్దకూ వెళ్ళాల్సిందే, ప్రతీ తలుపూ తట్టాల్సిందే అని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దిశా నిర్దేశం చేశారు. ఈ భారీ కార్యక్రమం ఈ నెల 25 న మొదలై ఆగస్టు 10 వరకూ ఏకంగా 45 రోజులకు పైగా సాగుతుంది. వారూ వీరూ అన్న తేడా లేదు అంతా జనం వద్దకు వెళ్లాల్సిందే అని లోకేష్ ఆదేశించారు.

మంత్రి నుంచి బూత్ లెవెల్ దాకా :

టీడీపీలో మంత్రి స్థాయి నుంచి మొదలుకుని బూత్ లెవెల్ స్థాయి నాయకుడి వరకూ ప్రతీ ఒక్కరూ జనం బాట పట్టాలని లోకేష్ కచ్చితంగా చెప్పేశారు. ప్రభుత్వం ఈ రెండేళ్ళలో ఏమి చేసింది ప్రజలకు ఎంత మంచి జరిగింది అన్నది ప్రతీ ఒక్కరికీ వివరంగా చెప్పాలని లోకేష్ కోరారు. ప్రజలకు కూటమి ప్రభుత్వంలో జరిగిన మంచిని చాటి చెప్పాలని జనాలను చైతన్యం చేయాలని ఆయన సూచించారు.

అభివృద్ధి ప్లస్ సంక్షేమం :

కూటమి ప్రభుత్వం ఒక వైపు అభివృద్ధికి బాటలు వేస్తూనే మరో వైపు సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది అని లోకేష్ చెప్పారు. ఈ విషయం జనాలకు అర్ధమయ్యేలా తెలియచేయాలని అన్నారు. ఏపీలో ప్రస్తుతం అమలు జరుగుతున్న ప్రతీ ఒక్క కార్యక్రమం జనాలకు చేరాలని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాదు కర పత్రాలు అలాగే బుక్ లెట్లను కూడా ప్రజలకు తీసుకుని వెళ్ళి అందచేయాలని కోరారు. ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా ఒక ఉద్యమంగా పాలుపంచుకోవాలని ప్రతీ రోజూ ఠంచనుగా కొన్ని ప్రాంతాలను ఎంచుకుని పర్యటించాలని కూడా సూచించారు. అదే సమయంలో ఆయా ప్రాంతాలలో ఉన్న జనసేన బీజేపీ కార్యకర్తలను కూడా కో ఆర్డినేట్ చేసుకోవాలని లోకేష్ చెప్పారు. ఇది చంద్రబాబు అదేశంగా ఆయన పార్టీలోని నేతలను స్పష్టం చేశారు.

గతం నుంచి గుణపాఠం :

ఇక 2014 నుంచి 2019 మధ్యలో కూడా టీడీపీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసిందని ఆయన అన్నారు. అయినా సరే ప్రజలలో వాటిని సరిగ్గా తీసుకుని వెళ్లలేకపోయామని లోకేష్ చెప్పారు. ఆనాడు రాజకీయ ప్రత్యర్ధులు చేసిన విష ప్రచారం కూడా తిప్పికొట్టలేకపోయామని లోకేష్ చెప్పారు. అందువల్ల ఈసారి అలాంటి వాటికి ఏ మాత్రం అవకాశం ఇవ్వరాదని లోకేష్ కోరారు.

సర్ తో జాగ్రత్త :

ఇక ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పట్ల ప్రతీ కార్యకర్త నాయకుడు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ కోరారు. ఒక్క ఓటు కూడా పోరాదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే దీని మీద శిక్షణా తరగతులు నిర్వహించామని అలాగే బూత్ లెవెల్ లో ఏజెంట్లను కూడా నియమించామని చెప్పారు. ఎమ్మెల్యేలు నిరంతరం బూత్ లెవెల్ ఏజెంట్లతో టచ్ లో ఉండాలని లోకేష్ కోరారు. ఇక ఓట్ల విషయంలో ఏమైనా తీవ్ర సమస్యలు ఉంటే కనుక పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఓటర్ వెరిఫికేషన్ సెల్ ని సంప్రదించాలని కూడా లోకేష్ కోరారు. మరో వైపు చూస్తే ఈ నెల 20వ తేదీ వరకూ ప్రతీ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండేళ్ల కూటమి విజయోత్సవ సభలను నిర్వహించాలని కూడా లోకేష్ కోరారు. మొత్తానికి టీడీపీ జనం బాట పట్టనుంది అని తెలుస్తోంది. రానున్న రోజులలో స్థానిక ఎన్నికల దృష్ట్యా టీడీపీ ఈ విధంగా కీలక వ్యూహంతో ముందుకు సాగుతోంది అని అంటున్నారు.