లోకేష్ కీలక చొరవ... రూ.లక్ష కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలు!
ఇదే సమయంలో... విశాఖపట్నం ప్రాంతంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని ఆర్.ఎం.జెడ్ గ్రూప్ ప్రతిపాదించింది.
By: Raja Ch | 21 Jan 2026 8:59 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ లు దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఏపీలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో దాదాపు లక్ష ఉద్యోగాలు కల్పించే కీలక ప్రాజెక్టుకు ముందడుగు పడింది! మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో ఈ స్థాయిలో భారీ పెట్టుబడికి ఆర్.ఎం.జెడ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇది లోకేష్ కీలక చొరవ ఫలితమని అంటున్నారు.
అవును... దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం 2026లో ఒక ప్రధాన వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఏపీ ప్రభుత్వం, ఆర్.ఎం.జెడ్ కార్పొరేషన్ కీలక పెట్టుబడి భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డిజిటల్, పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం దీని లక్ష్యంగా చెబుతుండగా.. లోకేష్, ఆర్.ఎం.జెడ్ గ్రూప్ చైర్మన్ మనోజ్ మెండా సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది.
ఈ కీలక పెట్టుబడి భాగస్వామ్యం భాగంగా... రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, లాజిస్టిక్స్ ఆధారిత వృద్ధిని ప్రోత్సహిస్తూ.. మరోవైపు విశాఖపట్నంను తదుపరి తరం డిజిటల్, మౌలిక సదుపాయాల కేంద్రంగా ఉంచాలనే రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉందని అంటున్నారు. ఈ ప్రతిపాదిత పెట్టుబడిలో భాగంగా.. విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్ లో సుమారు 50 ఎకరాల్లో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ) పార్క్ ను అభివృద్ధి చేయాలని ఆర్.ఎం.జెడ్ గ్రూప్ యోచిస్తోందని తెలుస్తోంది.
ఇదే సమయంలో... విశాఖపట్నం ప్రాంతంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని ఆర్.ఎం.జెడ్ గ్రూప్ ప్రతిపాదించింది. ఈ క్రమంలో... దశలవారీగా 1 గిగావాట్ వరకు సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరం అవుతుందని చెబుతున్నారు. అదేవిధంగా... రాయలసీమ ప్రాంతంలో ఆర్.ఎం.జెడ్ గ్రూప్ టేకులోడు వద్ద దాదాపు 1,000 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్క్ ను స్థాపించాలని యోచిస్తోందని చెబుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో తయారీ, గిడ్డంగులు, లాజిస్టిక్స్ కార్యకలాపాలను లంగరు వేయగలదని.. పారిశ్రామిక ఉపాధిని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపాదిత ప్రాజెక్టులు ఐదు నుండి ఆరు సంవత్సరాలలో దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని సూచిస్తాయని.. ఫలితంగా ఆయా రంగాలలో దాదాపు 1 లక్ష మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. మంత్రి లోకేష్ చొరవతో దావోస్ వేదికగా ఏపీకి అతిపెద్ద గుడ్ న్యూస్ వినిపించినట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు!
