అత్యంత వేగంగా అంబులెన్స్ సేవలు.. క్వాంటం టెక్నాలజీతో సరికొత్త మార్పులు!
క్వాంటం కంప్యూటర్ ద్వారా అంబులెన్స్ లను నిర్వహించాలనే ప్రభుత్వ ఆలోచన విప్లవాత్మకంగా అభివర్ణిస్తున్నారు.
By: Tupaki Political Desk | 31 Aug 2026 11:19 AM ISTఏపీలో క్వాంటం కంప్యూటర్ సేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మిస్తుండగా, అక్కడి క్వాంటం కంప్యూటర్లు పనిచేయడానికి ముందే ఈ టెక్నాలజీని అత్యావసర వైద్య సేవలకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా వైద్య రంగంలోని అంబులెన్స్ సేవలలో క్వాంటం సేవలు ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా గుంటూరు జిల్లాను ఎంపిక చేశారు. ఈ జిల్లాలోని 67 అంబులెన్స్ లను క్వాంటం కంప్యూటర్ కు అనుసంధానించి అత్యావసర సేవలను మరింత వేగంగా అందజేయాలని భావిస్తున్నారు.
క్వాంటం కంప్యూటర్ ద్వారా అంబులెన్స్ లను నిర్వహించాలనే ప్రభుత్వ ఆలోచన విప్లవాత్మకంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటివరకు ప్రమాదాలు, ఇతర అత్యావసర సమయాల్లో మాత్రమే అంబులెన్స్ లు వచ్చేవి. అదేవిధంగా బాధితులు, వారి బంధువులు సూచించిన ఆస్పత్రులకు తీసుకువెళ్లేవి. ఆ సమయంలో ఆయా అస్పత్రుల్లో సరైన వసతులు లేకపోతే అంబులెన్స్ సేవలు వృథా అయ్యేవి. బాధితులకు వైద్యం అందేది కాదు. అయితే ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ ద్వారా అత్యావసర సేవలను ప్రోయాక్టివ్ విధానం ద్వారా అందజేయాలని నిర్ణయించారు.
ఇప్పటివరకు అమలవుతున్న విధానానికి, ఈ కొత్త క్వాంటమ్ విధానానికి చాలా వ్యత్యాసం ఉందని చెబుతున్నారు. గతంలో సాధారణంగా అంబులెన్స్‌లను జిల్లా మండల కేంద్రాల్లోని ఆసుపత్రుల వద్దే నిలిపి ఉంచేవారు. ఎవరైనా అత్యవసర సమయాల్లో 108 లేదా ఇతర సర్వీసులకు ఫోన్ చేసిన తర్వాతే ఆసుపత్రి నుంచి అంబులెన్స్ బయలుదేరి వెళ్లేది. ఈ ప్రయాణ సమయం కారణంగా కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడేవి. కానీ, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం 'ప్రొయాక్టివ్' (ముందస్తు) విధానాన్ని తెస్తోంది.
ఈ కొత్త విధానంలో భాగంగా క్వాంటమ్ అల్గారిథమ్ గత మూడేళ్ల ఎమర్జెన్సీ కాల్స్ డేటాను క్షుణ్ణంగా విశ్లేషిస్తుంది. ఏయే ప్రాంతాల నుంచి అత్యవసర కాల్స్ లేదా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనే డేటాను గుర్తిస్తారు. ఆయా సమస్యాత్మక ప్రాంతాలకు దగ్గర్లోనే అంబులెన్స్‌లను మోహరిస్తారు. దీనివల్ల ఎమర్జెన్సీ కాల్ రాగానే అంబులెన్స్ ఎలాంటి ఆలస్యం లేకుండా క్షణాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా, అంబులెన్స్ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి గూగుల్ మ్యాప్స్‌తో అనుసంధానమైన క్వాంటం కంప్యూటర్ టెక్నాలజీ మార్గ నిర్దేశం చేయనుంది.
అంబులెన్స్ బయలుదేరిన క్షణం నుంచి రియల్ టైమ్ ట్రాఫిక్ పరిస్థితులను, రద్దీని బేరీజు వేస్తూ అత్యంత వేగంగా, ఎలాంటి అడ్డంకులు లేని ప్రత్యామ్నాయ మార్గాలను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తుందని చెబుతున్నారు. దీనిద్వారా రోగిని సరైన సమయానికి సమీపంలోని ఆసుపత్రికి చేరవేయడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, దగ్గర్లోని పెద్ద ఆస్పత్రులు, బెడ్స్ సౌలభ్యంపైనా ముందస్తు సమాచారం అందుతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌లోని అత్యంత క్లిష్టమైన అల్గారిథమ్‌లను రన్ చేయడానికి విజయవాడలోని స్టేట్ డేటా సెంటర్‌లో ప్రత్యేకంగా 'కొహెరెంట్ ఐసింగ్ మెషీన్'ను ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని సంప్రదాయ క్వాంటమ్ కంప్యూటర్ల హైబ్రిడ్ వెర్షన్‌గా సెమీ-క్వాంటమ్ కంప్యూటర్‌గా పేర్కొంటున్నారు.
కేవలం అత్యవసర వైద్య సేవలు మాత్రమే కాకుండా, ఈ క్వాంటమ్ సాంకేతికతను రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలకు విస్తరించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు, కొత్త ఔషధాల ఆవిష్కరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, లాజిస్టిక్స్, సప్లై చైన్ ఆప్టిమైజేషన్, ఫైనాన్షియల్ మోడలింగ్, మెటీరియల్ సైన్సెస్, రూట్ ప్లానింగ్ వంటి వివిధ రంగాలకు సంబంధించిన మరో 24 కీలక సేవల కోసం కూడా ఈ సీఐఎం సాంకేతికతను వినియోగించనున్నారని చెబుతున్నారు.
