పీపీపీ- ఒక రచ్చ-మరో పరిష్కారం..!
రాష్ట్రంలో మెడికల్ కాలేజీ లను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
By: Garuda Media | 14 Oct 2025 10:05 AM ISTరాష్ట్రంలో మెడికల్ కాలేజీ లను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఇలా నిర్మించడం ద్వారా పేదలకు వైద్యం అందదని, మరింతగా ప్రైవేటు వ్యాపారం పెరుగుతుందని వైసిపి సహా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కూడా గుప్పిస్తున్నాయి. అయినప్పటికీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో తన విధానాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే అసలు పిపిపి విధానంలో వైద్య కాలేజలను నిర్మించడం మంచిదా కాదా అనేది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న ప్రధాన చర్చ. ఏ ఇద్దరు కలుసుకున్నప్పటికీ ఇదే విషయంపై ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా అప్పుల్లో ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండడం లేదు. వరుసగా గడిచిన 10 సంవత్సరాల బడ్జెట్లను గమనిస్తే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మూలధన వ్యయాన్ని భారీగా తగ్గిస్తూ వస్తున్నాయి.
అంటే ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేకుండా పోతుంది. దీనికి సంక్షేమ పథకాలు కావచ్చు, ఉచిత హామీలు కావచ్చు ఏ కారణం అయినప్పటికీ ప్రభుత్వ రంగంలో మూలధన వ్యయం తగ్గుతూ వస్తున్న క్రమంలో ప్రైవేటు రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. జవాబుదారీ తనతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రైవేట్ రంగం చాలా జోరుగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల వైపు నుంచి కూడా ప్రైవేటు రంగానికి ఉన్న ప్రోత్సాహం ప్రభుత్వ రంగానికి ఉండటం లేదు.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణ పాఠశాలలు ప్రస్తుతం ఉన్న వైద్యశాలలే. ప్రస్తుతం ఉన్న వైద్యశాలలో కేవలం అత్యంత నిరుపేదలు మాత్రమే వైద్యం చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. మిగిలిన దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, అదేవిధంగా ఎగువ మధ్య తరగతి ప్రజల నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రైవేటు వైద్యశాలల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 17 కాలేజీలలో ఐదు కాలేజీల్లో ఇప్పటికే కొంతవరకు పూర్తయ్యాయి కాబట్టి వాటిలో తరగతుల నిర్వహిస్తున్నారు.
మిగిలిన 12 కాలేజీల విషయాన్ని ప్రైవేటుకు అప్పగించడం ద్వారా మెరుగైన సదుపాయాలతో ప్రజలకు సేవలు అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తోంది. పేదలకు ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన పేదలకు అన్ని కాలేజీలలోనూ అన్ని వైద్యశాలల్లోనూ మెరుగైన ఉచిత వైద్యం అందుతుందన్న విషయాన్ని స్పష్టం చేస్తే ఈ సమస్యకు తెరపడే అవకాశం ఉంది.
అలా కాకుండా ఎవరి వాదన వారే వినిపించుకుంటూ ఉంటే అసలు పిపిపి విధానం పైనే ప్రజలు విముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రభుత్వానికి కూడా తీవ్ర నష్టం వాటిలే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అసలు పీపీపీ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. అలా చేస్తే.. ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.
