బాబుకు బిగ్ టెస్ట్: 'పీపీపీ'... ఫలితం ఏంటి.. !
అంటే కచ్చితంగా పిపిపి విధానంలో మెడికల్ కాలేజీలో నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. దీనికి తోడు పీ-ఫోర్ విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది.
By: Garuda Media | 28 Sept 2025 11:00 AM ISTరాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానం మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి ఒకటి రెండు విషయాల్లో పి పిపి విధానం కొంతవరకు మెరుగైందే. అయినప్పటికీ ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ పి పిపి విధానాన్ని తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీలో ఈ విషయాన్ని మంత్రి భారత్ స్పష్టం చేశారు. ఇప్పటికే పీపీపీ విధానంలో దేశంలో అనేక ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని, దీనివల్ల మెరుగైన పాలన, మెరుగైన సంస్కరణలు ప్రజలకు చేరువ అవుతాయని మంత్రి భరత్ చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో పిపిపి విధానంలో ప్రజలకు మేలు జరుగుతుందని కూడా ఆయన తెలిపారు. వాస్తవానికి ఈ విధానాన్ని చంద్రబాబు ఆది నుంచి సమర్థిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరింతగా దీనిని తీసుకురావడం మరింతగా ఇతర వ్యవస్థలకు కూడా ఆపాదించడం వంటివి వివాదానికి దారితీస్తున్నాయి. ప్రస్తుతం మెడికల్ కాలేజీల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి ఇప్పటికే ఐదు కాలేజీలకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కాంట్రాక్టర్లను ఆహ్వానించారు. ఎంతమంది వచ్చినా అనుమతిస్తామని ఈ విధానంలో స్పష్టం చేశారు.
అంటే కచ్చితంగా పిపిపి విధానంలో మెడికల్ కాలేజీలో నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. దీనికి తోడు పీ-ఫోర్ విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. పేదలకు సంబంధించిన అన్ని విషయాలను పి4 విధానంలో ధనవంతులైన వారికే అప్పగించడం ద్వారా ప్రభుత్వం పేదలను పైకి తీసుకువస్తుందని సీఎం చంద్రబాబు స్వయంగా చెబుతున్నారు. అంటే ఒక రకంగా పేదలను తగ్గించే క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కార్యక్రమం మంచిదే అయినప్పటికీ అనుసరిస్తున్న విధానాలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారం మాత్రం దీనికి భిన్నంగా ఉంది.
ఇక గనులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పిపిపి విధానాన్ని ఎంచుకుంది. గనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో నిధులు వస్తాయి. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మేలు చేస్తుంది. దీనిని వసూలు చేసుకునేందుకు అధికారులు ఉంటారు. గనుల శాఖ పూర్తిగా దీని కోసమే కేటాయించారు. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని కూడా పిపిపికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అప్పగించేసారు కూడా. ఏఎంఆర్ సంస్థ పలు గనులను సొంతం చేస్తుంది. ఈ క్రమంలో రాయల్టీ సొమ్మును పిపిపి ద్వారా దక్కించుకున్న సంస్థ వసూలు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీని ప్రభుత్వానికి చెల్లించి మిగిలిన సొమ్మును తన లాభాలు కింద జమేసుకునే అవకాశం ఉంటుంది.
దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తుందని కనుల శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు కొందరు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పి పిపి ద్వారా మాత్రమే మేలు జరుగుతుందని నిర్ణయించుకుని ముందుకు సాగుతోంది. ఇక, రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలను కూడా పిపిపి విధానంలోనే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇలా అనేక విషయాల్లో పిపిపి విధానాన్ని తీసుకురావడాన్ని ప్రభుత్వం సమర్ధించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇక గ్రామీణ స్థాయిలో రహదారులను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో నిర్మిస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలోకి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పట్టణ మండల స్థాయి రహదారుల విషయాన్ని మాత్రం మళ్లీ పీపీపీకే అప్పగించాలని నిర్ణయించారు. దీనివల్ల టోల్ గేట్లు ఏర్పాటు చేయడం తప్పదు అన్నది గతం నుంచి వస్తున్న విమర్శ. ఇప్పుడు దీనిపై మరింత లోతుగా కసరత్తు చేసిన ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన చేయనుంది. ఏది ఏమైనా పి పిపి విధానం ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేస్తుందో తెలియదు గానీ ప్రజల్లో మాత్రం తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
