Begin typing your search above and press return to search.

సాయిరెడ్డి కొత్త పార్టీ: ఎవరికి ఎంతెంత ఎఫెక్ట్‌?

కొత్త పార్టీ ఏర్పాటుపై విజయసాయి రెడ్డి ఈ నెల 11న ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. పలు పార్టీల నేతలు తనతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు ఆయన కొత్త పార్టీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ విధివిధానాలు ప్రకటించిన తర్వాతే నేతల చేరికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

By:  Garuda Media   |   8 Nov 2026 8:35 AM IST
సాయిరెడ్డి కొత్త పార్టీ: ఎవరికి ఎంతెంత ఎఫెక్ట్‌?
X

రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టాలని భావిస్తున్న విజయ సాయి రెడ్డి దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఈ నెల 11న చేస్తానని చెప్పారు. ఇదే సమయంలో ఆయన పలు పార్టీల నేతలు తనతో టచ్ లో ఉన్నారంటూ సంచలన ప్రకటన చేయటం విశేషం. అయితే పైకి ఏ పార్టీ అనేది పేరు చెప్పకపోయినా అంతర్గతంగా ఈ విషయంపై సాయి రెడ్డి పక్కా క్లారిటీతో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా పరిచయాలు పెంచుకోవడంతో పాటు రాజకీయ శత్రుత్వం లేకపోవడం సాయిరెడ్డికి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

సహజంగా వైసీపీలో ఉన్న నాయకులు ఇతర పార్టీల నేతలతో వైరం పెంచుకోవడంతో పాటు వివాదాస్పదంగా కూడా వ్యవహరించారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఇతర పార్టీల నేతలతో వైసిపి నాయకులకు తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. కానీ దీనికి భిన్నంగా సాయి రెడ్డి దాదాపు అందరి నేతలతోనూ కలివిడిగానే వ్యవహరించారు. ముఖ్యంగా వైసీపీకి బద్ధ శత్రువుగా భావించి టిడిపిలోనూ ఆయనకు అనుకూలమైన వ్యక్తులే ఉన్నారు. స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు ఆయనకు బంధువు కూడా కావడం మరో విశేషం.

అయితే సాయి రెడ్డి కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన ఇటు టిడిపి నుంచి లేదా జనసేన నుంచి భారీ స్థాయిలో నాయకులు వెళ్తారా అనేది ఇప్పటికిప్పుడు ఎవరూ చెప్పలేని విషయం. కానీ, ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం వైసిపి నుంచి తీవ్ర స్థాయిలో ఎదురు దాడి ఎదుర్కొంటున్న కొంతమంది నాయకులు మాత్రం ఖచ్చితంగా సాయి రెడ్డి వైపు చూస్తారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మానుగుంట మహీధ‌ర్ రెడ్డి అలాగే ఇదే జిల్లాలోని మరో ఇద్దరు నాయకులు విజయవాడలో వైసీపీకి చెందిన ముఖ్య నాయకుడు కూడా సాయి రెడ్డికి టచ్ లో ఉన్నారని అంటున్నారు. అయితే వైసీపీ వైపు నుంచి మరో వాదన కూడా వినిపిస్తోంది. తాము ఎందుకు పనికిరారు అని పక్కన పెట్టిన నాయకులే సాయి రెడ్డి వైపు చూసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలపై సాయి రెడ్డికి గట్టి ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కూడా వైసిపి నుంచి ప‌లువురు నాయకులు జంప్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ జాబితాలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ముఖ్య నాయకుడు ఫైర్ బ్రాండ్ నేత పేరు వినిపిస్తోందని అంటున్నారు. అలాగే అసంతృప్తితో ఉన్న విజయనగరం జిల్లా నాయకులు కూడా కొందరు సాయి రెడ్డి వైపు చూస్తున్నారని తెలుస్తోంది. కానీ సాయి రెడ్డి కొత్త పార్టీ ఏ మేరకు ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది అనేది అంచనా వేసిన తర్వాతే కొంతమంది నాయకులు జంప్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంచైనా చెడైనా కూటమి పార్టీలోనే ఉండాలన్నది దాదాపు అందరి నాయకుల అభిప్రాయంగా ఉంది.

అసంతృప్తి ఉన్నప్పటికీ పార్టీ మారేంతగా నాయకులు సిద్ధంగా అయితే లేరు. కానీ దీనికి భిన్నంగా వైసీపీలో మాత్రం ఒక వైపు పార్టీ పరమైన అసంతృప్తి రెండోవైపు ప్రజల్లో నానాటికి క్షీణిస్తున్న గ్రాఫ్ వంటివి నాయకులు అంతర్మ‌థ‌నంలోకి నెడుతున్నాయి. దీంతో నాయకులు పక్కచూపులు చూస్తున్నారన్నది వాస్తవం. ఇక సాయి రెడ్డికి కాంగ్రెస్ నాయకులతో పరిచయాలు ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి ఎంతమంది వస్తారు అన్నది సందేహమే.

కరడు గట్టిన కాంగ్రెస్ వాదులుగా ఉన్న‌ నాయకులు మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. పైగా చాలా వరకు నాయకులు సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పటికి ఇప్పుడు సాయి రెడ్డి పార్టీలో చేరి తిరిగి పుచ్చుకోవాలి అనుకుంటే వారికి సాధ్యమయ్యే పని కూడా కాకపోవచ్చు. అంతేకాదు అసలు సాయి రెడ్డి పార్టీ విధి విధానాలు ఏంటి సిద్ధాంతాలు ఏంటి అనేది కూడా కీలకమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో సాయి రెడ్డి కొత్త పార్టీ ఎవరెవరికి ఎంతెంత ప్లస్ గా మారుతుంది.. ఎంత మైనస్ గా మారుతుంది.. అనేది కొన్నాళ్లపాటు వేచి చూడాల్సిందే.