పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు....కూటమి కీ డెసిషన్ ?
ఆంధ్రులకు జీవనాడి లాంటి ప్రాజెక్టు పోలవరం 1940 ప్రాంతంలో పోలవరం ఆలోచన వచ్చింది.
By: Satya P | 29 Dec 2025 9:00 PM ISTఆంధ్రులకు జీవనాడి లాంటి ప్రాజెక్టు పోలవరం 1940 ప్రాంతంలో పోలవరం ఆలోచన వచ్చింది. దాదాపుగా తొంబై ఏళ్ళ కల ఇది. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పోలవరం ప్రాజెక్ట్ కి ఎవరి పేరు పెట్టాలి అన్న దాని మీద కూటమిలో పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది అని అంటున్నారు. అంతే కాదు పోటీ కూడా ఏర్పడుతోంది అని చెబుతున్నారు పోలవరం ప్రాజెక్టుకు పేరు పెట్టే విషయంలో ప్రధాన పక్షం టీడీపీ పెద్దగా మాట్లాడడం లేదు కానీ బీజేపీ జనసేనల నుంచే కొత్త డిమాండ్లు వస్తున్నాయి.
అమరజీవి పేరుతో :
ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరుని పోలవరం ప్రాజెక్ట్ కి పెట్టాలని జనసేన కోరుతోంది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం మీద తన అభిప్రాయం చెప్పారు. మొత్తం ఆంధ్రులకే ప్రాతినిధ్యంగా ఉంటూ వారికి చిరస్మరణీయుడు అయిన పొట్టి శ్రీరాములు పేరు జిల్లాకు ప్రాంతానికి పెడితే చాలదని ఏపీ మొత్తానికి ప్రభావితం చేసే పోలవరం ప్రాజెక్టు వంటి వాటికి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు. ఇది సమంజసమైన సూచనగా అంతా భావిస్తున్నారు. అయితే బీజేపీ నుంచి మరో ప్రతిపాదన వస్తోంది.
వాజ్ పేయి గౌరవం :
కేంద్రంలో ఆరున్నరేళ్ళ పాటు ప్రధానిగా పనిచేసిన వారు అజాత శత్రువు ఏపీకి తన పాలనలో ఎంతో చేసిన దివంగత నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరుని ఈ ప్రాజెక్టుకు పెట్టాలని బీజేపీ కోరుతోంది. ఇటీవలనే ఏపీలో మొత్తం 26 జిల్లలలో వాజ్ పేయి విగ్రహాలను బీజేపీ ఏర్పాటు చేసింది. అమరావతిలో స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేస్తూ అక్కడ కూడా ఆయన భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ నేపథ్యంలో వాజ్ పేయి పేరు ప్రతిష్టలను మరింతగా శాశ్వతం చేయలన్న తలంపుతో బీజేపీ ఈ డిమాండ్ పెడుతోంది.
లాజిక్ ఉందిగా :
అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడానికి ఒక లాజిక్ ఉంది. ఆయన వల్లనే ఏపీ స్టేట్ ఏర్పడింది. పైగా ఆయన ఆత్మ బలిదానం చేశారు. దాంతో ఈ రోజు ఆంధ్రులు అందుకుంటున్న ఫలాలు అన్నీ ఆయన త్యాగంతోనే అని చెప్పాలి. అలాంటి మహనీయుడు ఆంధ్రుడు అయిన పొట్టి శ్రీరాములు పేరు పోలవరం ప్రాజెక్ట్ కి పెట్టడం ఎంతో సముచితం అని అంటున్నారు. అదే విధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం తన పూర్తి నిధులతో పోలవరం ప్రాజెక్ట్ ని నిర్మిస్తోంది. ఇది జాతీయ ప్రాజెక్టు. సాధారణంగా జాతీయ ప్రాజెక్టులకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు చెప్పిన వారి పేరే పెడుతూంటారు. అలా ఆనవాయితీగా ఉంది. ఇక చూస్తే కేంద్రంలో ఏపీ ఎన్డీయే ప్రభుత్వం ఉంది. బీజేపీ మంత్రి కూడా ఏపీలో ఉన్నారు. ఏపీలో వాజ్ పేయి విగ్రహాలు అన్ని చోట్లా పెట్టిన కూటమి ప్రభుత్వం కేంద్రం వాజ్ పేయి పేరు పెట్టమంటే పెట్టకుండా ఎలా ఉండగలదు అన్న మాట ఉంది. అయితే వాజ్ పేయి ఎంత దేశ నేత అయినా ఆంధ్రుడి పేరు పోలవరం వంటి ప్రాజెక్ట్ కి పెడితే బాగుంటుంది అన్నది మేధావుల నుంచి వస్తున్న సూచనలు. మరి చంద్రబాబు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది.
