Begin typing your search above and press return to search.

అమిత్ షా టాస్క్ మరింత ముందుకు.. ఏపీ ‘ఆపరేషన్ సంభవ్’!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్ఫూర్తితో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సంభవ్’ మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది.

By:  Tupaki Political Desk   |   21 Nov 2025 9:00 PM IST
అమిత్ షా టాస్క్ మరింత ముందుకు.. ఏపీ ‘ఆపరేషన్ సంభవ్’!
X

కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్ఫూర్తితో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సంభవ్’ మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. వచ్చేఏడాది మార్చిలోగా రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే గడువుతో మావోయిస్టు విముక్త భారత్ ఆవిష్కరిస్తానని తరచూ ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా 2009లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ ను మరింత విస్తరించి ‘ఆపరేషన్ కగార్’ ప్రవేశపెట్టారు.

ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ కకావికలమైంది. ఒకప్పుడు శత్రుదర్భేద్యంగా మార్చుకున్న దండకారణ్యాన్ని సైతం ఆ పార్టీ ఖాళీ చేయాల్సివచ్చింది. పార్టీ ముఖ్యనేతలలో చాలా మంది ఎన్కౌంటర్లలో హతమవగా, మరికొందరు సీనియర్లు ప్రాణాలు కాపాడుకునేందుకు పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే సేఫ్ జోన్ వెతుక్కుంటూ కొందరు నక్సల్స్ తాజాగా ఏపీ వైపు వచ్చారని ప్రభుత్వం గుర్తించింది.

మూడు రోజుల క్రితం అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోయిస్టు గెరిల్లా ఆర్మీ కమాండర్ మడ్వి హిడ్మా బృందం పోలీసులకు ఎదురైంది. దీంతో చత్తీస్ ఘడ్ నుంచి మావోయిస్టులు రాష్ట్రంవైపు వస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఇక మారేడుమిల్లి ఎన్కౌంటరుతో హిడ్మాతోపాటు ఆయన సహచరి ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా బుధవారం జరిగిన ఎన్కౌంటరులో మరో ఏడుగురు ముఖ్యనేతలు మరణించారు. ఈ క్రమంలోనే లభ్యమైన సమాచారంతో రాష్ట్రంలో ఐదు జిల్లా పరిధిలో మొత్తం 52 మందిని అరెస్టు చేశారు.

ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆపరేషన్ సంభవ్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఏపీలో హింసను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పిన డీజీపీ.. మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా చేయడానికి ఆపరేషన్ సంభవ్ చేపట్టినట్లు వివరించారు. సంభవ్ అంటే హిందీ పదం. తెలుగులో ఆ పదానికి నిర్మూలన అనే అర్థం వస్తుంది. ఇక కేంద్రం కూడా ఆపరేషన్ కగార్ అంటోంది. కగార్ అంటే అంతం లేదా అంతిమ యుద్ధం అనే అర్థం వస్తుంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే లక్ష్యాన్ని ఒకే గడువులోగా సాధించాలని ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు.