Begin typing your search above and press return to search.

ఏపీలో 26 కాదు 32...కొత్త ఏడాది కూటమి గిఫ్ట్ !

ఏపీలో పాలనాపరంగా సంస్కరణలకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా చేయాలని చూస్తోంది

By:  Satya P   |   24 Oct 2025 10:18 PM IST
ఏపీలో 26 కాదు 32...కొత్త ఏడాది కూటమి గిఫ్ట్ !
X

ఏపీలో పాలనాపరంగా సంస్కరణలకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా చేయాలని చూస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం చాలా కాలం క్రితమే కసరత్తుని మొదలెట్టింది. అంతే కాదు మంత్రి వర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో టీడీపీ కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. తాము అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను ప్రకటిస్తామని చెప్పారు. అంతే కాదు వైసీపీ హయాంలో అశాస్త్రీయంగా చేసిన కొన్ని జిల్లాలలో పరిస్థితిని మార్పు చేస్తామని కూడా స్పష్టం చేసింది. ఆ మేరకు ఈ హామీని 2026 కొత్త ఏడాది వస్తూనే నిలబెట్టుకోవడం ద్వారా మరో ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చాలని చూస్తోంది.

కొత్త జిల్లాలు ఇవే :

రాష్ట్రంలో కొత్త జిల్లాలుగా ఆరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీటి మీద సమగ్ర అధ్యయనంతో పాటు స్థానిక ప్రజల వినతులు పాలనా పరమైన సౌలభ్యాలు సెంటిమెంట్లూ అన్నీ చూసుకున్న మీదటనే 26 జిల్లాలను కాస్తా మరో ఆరింటిని కలుపుతూ 32 జిల్లాలను తీసుకుని రావాలని ప్రభుత్వం సంకల్పించింది అని అంటున్నారు. ఇక కొత్త జిల్లాలుగా శ్రీకాకుళం జిల్లాలోని పలాసని విడదీస్తూ ఏర్పాటు చేస్తారని అంటున్నారు. అలాగే మార్కాపురం, మదనపల్లె, గూడూరు, రాజంపేట కొత్త జిల్లాలు అవుతాయని అంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తుందని చెబుతున్నారు.

ఆ రెండూ విలీనం :

ఇక ప్రకాశం జిల్లాలో ఒకపుడు ఉన్న అద్దంకి, కందుకూరులను 2022లో వైసీపీ చేసిన జిల్లాల పునర్ విభజనలో విడదీసి వేరే జిల్లాలలో కలిపారు. బాపట్లలో అద్దనికి విలీనం చేశారు. అలాగే కందుకూరుని నెల్లూరులో కలిపారు. ఇపుడు ప్రజాభిప్రాయం మేరకు ఈ రెండు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతారని అంటున్నారు. అదే విధంగా మరికొన్ని ఈ తరహా విన్నపాలను కూడా మంత్రి వర్గ ఉప సంఘం పట్టించుకుని సమగ్రమైన నివేదికను తయారు చేసింది అని అంటున్నారు.

కేబినెట్ లో పెట్టి :

ఇక తొందరలోనే మంత్రివర్గ ఉప సంఘం అందించే నివేదికను కేబినెట్ లో పెట్టి చర్చిస్తారు అని అంటున్నారు. అక్కడ నుంచి వచ్చే సలహా సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని పూర్తి స్థాయిలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేస్తారు అని అంటున్నారు. ఇక 2026 జనవరి 26 నుంచి కొత్త జిల్లాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. మొత్తానికి కొత్త జిల్లాలు కనుక ఏర్పాటు అయితే ఏపీలో 32కి సంఖ్య మారుతుంది. తెలంగాణాలో విభజన తరువాత 10 ఉమ్మడి జిల్లాలు ఉంటే వాటిని చాలా ఏళ్ళ క్రితమే 33 జిల్లాలుగా చేశారు. తెలంగాణా కంటే జనాభా పరంగానూ అలాగే భౌగోళికంగానూ అన్ని విధాలుగా పెద్దది అయిన ఏపీలో మాత్రం 2022 దాకా 13 జిల్లాలే ఉన్నాయి. ఇపుడు అచ్చంగా 32 కాబోతున్నాయి. కొత్త జిల్లాలతో పాలన మరింత ముందుకు సాగుతుందని అంటున్నారు. ఒక విధంగా వికేంద్రీకరణకు ఇది రాచ బాటగా చెబుతారు అలాగే కేంద్ర ప్రభుత్వం జిల్లాలకు అభివృద్ధి కోసం ఇచ్చే నిధులు పధకాలు కూడా ఈ విధంగా ప్రయోజనకరంగా అందుకోవచ్చు అని అంటున్నారు.