పోలింగ్ కి కౌంట్ డౌన్ : జనం నాడి చిక్కుతుందా ?
ఏపీలో దాదాపుగా 30 నెలల తరువాత జనాలు ఓటు వేయబోతున్నారు.
By: Satya P | 31 Oct 2026 12:00 AM ISTఏపీలో దాదాపుగా 30 నెలల తరువాత జనాలు ఓటు వేయబోతున్నారు. అయిదు విడతలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తొలి విడతకు నవంబర్ 1న తెర లేవనుంది. మొదటి విడతలో అర్బన్ బాడీస్ కి ఎన్నికలు జరుగుతున్నాయి. 87 మునిసిపాలిటీస్, 13 కార్పోరేషన్లు మొత్తంగా 100 చోట్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 1వ తేదీ ఏపీలో ఒక బిగ్ జడ్జిమెంట్ డే గా ఉండబోతోంది. ఏపీలో 2024 మే 13న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 25 ఎంపీ, 175 ఎమ్మెల్యే సీట్లకు ఒకేసారి నిర్వహించిన ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల అయ్యాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి 95 సీట్ల షేర్ తో భారీ విజయాన్ని నమోదు చేసింది.
ప్రాధాన్యత అందుకే :
నామమాత్రంగా వైసీపీ మిగిలింది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి రెండున్నరేళ్ళ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మధ్యలో ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ విధానాల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు కూటమి పాలన సంతృప్తిని ఇచ్చిందా లేదా అన్నది ఎంతో కొంత స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో తెలుస్తుందా అన్నది అయితే చర్చగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో మరే ఎన్నిక కానీ ఏ రకమైన తీర్పు కానీ జనం వైపు నుంచి రాలేదు, దాంతో స్థానిక సంస్థల ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలను అటు అధికార కూటమి ఇటు విపక్ష వైసీపీ కూడా చాలా సీరియస్ గానే తీసుకున్నాయి. దాంతో నామినేషన్ల పర్వం నుంచే ఘర్షణ వాతావరణం ఏర్పడింది అని గుర్తు చేస్తున్నారు.
సహజంగా చూస్తే :
ఇక స్థానిక సంస్థల ఎన్నికల తీరు చూస్తే సహజంగా అధికారంలో ఎవరు ఉంటారో వారి వైపే జనం తీర్పు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు ఓటు చేస్తే తమకు మేలు జరుగుతుందని, స్థానికంగా తమ ప్రాంతాలలో అభివృద్ధి జరుగుతుందని భావిస్తారు. అంతే కాదు ప్రభుత్వంతో కలసి నడవాలని మెజారిటీ జనాలు అనుకుంటారు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల మీద పెద్దగా అంచనాలు అయితే రాజకీయంగా లేకపోయినా కొన్ని చోట్ల నుంచి వచ్చే విలక్షణ తీర్పులు మాత్రం ప్రత్యేకం అవుతాయి. వాటినే పట్టుకుని నిశితంగా పరిశీలన చేయడం జరుగుతుంది.
ఏకమొత్తంగా అంటూ :
ఇక ఏకమొత్తంగా నూరు శాతం స్ట్రైక్ రేట్ ని కూటమి పార్టీలు సాధించాలని ఆ వైపు నుంచి ఘనమైన నినాదం వినిపిస్తోంది. 2024లో వచ్చిన రిజల్ట్ నే రిపీట్ చేయాలని కూడా కూటమి పార్టీలు కోరుకుంటున్నాయి. అదే సమయంలో రెండున్నరేళ్ల పాలన అంటే సగం పూర్తి అయినట్లే. దాంతో ఎక్కడో ఒక చోట అసంతృప్తి ఉంటుంది అని దానిని వెలికి తీస్తే తమకు 2029 ఎన్నికలకు దారి దొరికినట్లే అని విపక్ష వైసీపీ భావిస్తోంది. అందుకే ఈసారి స్థానిక ఎన్నికల్లో గట్టిగా తేల్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. మొత్తం ఫలితాలు ఒక్కలా ఉండవని ఎంతో కొంత తేడా కనిపించినా అది తన విజయంగా భావించాలని దానినే పెద్దది చేసి చూపించాలని తద్వారా ప్రజల నాడిని పట్టుకుని ఇదే రేపటి సార్వత్రిక ఎన్నికల్లో తీర్పుగా మార్పుగా చూడాలని వైసీపీ భావిస్తుంది అన్నది కూడా ఉంది.
మంచిదే కదా :
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మాత్రం ప్రతికూలత ఎక్కడ వచ్చినా దానిని సరిదిద్దుకునే చాన్స్ అధికార కూటమికి కచ్చితంగా ఉంటుంది. చేతిలో ఇంకా సగం పాలన ఉంటుంది కాబట్టి ఆ విధంగా చక్కబెట్టుకుని 2029 నాటికి గట్టిగా జనం వద్దకు వెళ్ళవచ్చు. అలా జనం ఏమనుకుంటున్నారు అన్నది తెలియడం అధికారంలో ఉన్న వారికే అవసరం అని అంటున్నారు. మరి అలా జరుగుతుందా జనం ఎక్కడైనా తమ భావనలు బయట పెడతారా లేదా గుంభనంగా ఉంటూ అధికార కూటమికే జై కొడతారా అన్నదే చూడాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే కనుక లోకల్ బాడీస్ లో ఎంతో కొంత జనం నాడి పట్టడానికి పార్టీలే కాదు రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అలా జరుగుతుందా లేదా అన్నదే ఇంట్రెస్టింగ్ మ్యాటర్.
