ఆపత్కాలంలో బాబుకు టచ్ లోకి కేంద్రం
ఈ నేపథ్యంలో అతి పెద్ద తుఫాన్ గా మొంథా తన పంజాని ఏపీ మీద విసిరేసింది ఈ దెబ్బకు చిగురాకు మాదిరిగా ఏపీ విలవిలలాడుతోంది.
By: Satya P | 28 Oct 2025 11:03 PM ISTకేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఎంతో మేలు జరుగుతుందని ఎన్డీయే నాయకులు ఎపుడూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ ప్రయోజనాలు ఏమిటో కాల గమనంలో కొన్ని తెలుస్తాయి. అయితే ఎక్కువగా ఆశించిన మూలంగా ఏపీకి కేంద్రం పెద్దగా చేయడం లేదన్న భావన కూడా ఉంది. అయితే గతానికి ఇప్పటికీ పరిస్థితి మారింది. నాలుగవ సారి సీఎం గా చంద్రబాబు ఏపీలో పీఠమెక్కాక మూడవసారి నరేంద్ర మోడీ కేంద్రంలో ప్రధానిగా ప్రమాణం చేశాక ఈ ఇద్దరి మధ్యన మంచి సంబంధాలు కుదిరాయి. ఒక వైపు పార్టీల పరంగానే కాకుండా మరో వైపు వ్యక్తిగతంగానూ బాబు మోడీల మధ్య మంచి స్నేహం చిగురించింది.
ప్రకృతి విసిరే సవాల్ :
ఏపీ పూర్తిగా తీర ప్రాంత రాష్ట్రం. ఒక విధంగా చూస్తే గుజరాత్ తరువాత అత్యధిక తీర ప్రాంతం ఉన్నది ఒక్క ఏపీలోనే. తొమ్మిది ఉమ్మడి జిల్లాలు సముద్ర తీరం వెంబడే ఉంటాయి. ఇక తుఫానులు ప్రకృతి విపత్తులు ఏపీకి చాలా కామన్. అవి ఏడాదిలో కొన్ని సీజన్లలో తప్పకుండా వస్తాయి. ఇక అన్ సీజన్లలో కూడా ఎక్కువగా వచ్చేవి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే ప్రకృతి విసిరే ఆగ్రహానికి ఎక్కువగా గురి అయ్యే రాష్ట్రంగా ఏపీ ఉంటుంది. అఫ్ కోర్స్ తీర ప్రాంత రాష్ట్రాలలో ఇదే కధ ఉంటుంది. కానీ గుజరాత్ లాంటివి సంపన్నమైనవి కాబట్టి తట్టుకోగలవు. ఏపీ విభజన తరువాత ఇంకా గాయాలతో ఉంది. దాంతో ఈ ప్రకృతి విపత్తులు వరసగా వచ్చి ఇబ్బంది పెడుతూంటే తట్టుకోవడం చాలా కష్టమే అన్నది వాస్తవం.
మొంథా పడగ నీడన :
ఈ నేపథ్యంలో అతి పెద్ద తుఫాన్ గా మొంథా తన పంజాని ఏపీ మీద విసిరేసింది ఈ దెబ్బకు చిగురాకు మాదిరిగా ఏపీ విలవిలలాడుతోంది. మొత్తానికి మొత్తం రాష్ట్రమంతా తీవ్రమైన ప్రభావం చూపించిన తుఫాన్ గా చరిత్రలో మొంథా చాలా కాలం గుర్తు ఉంటుంది. నలభై నుంచి యాభై లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ఈ తుఫాన్ తీవ్రతకు గురి అయ్యారు అంటే మొత్తం జనాభాలో అది పదవ వంతు అన్న మాట. ఆస్తి నష్టం అయితే చెప్పాల్సింది లేదు, పంటల నష్టం తలచుకుంటే గుండె చెరువు అవుతుంది. ఏపీ మీద విరుచుకుపడిన మొంథాని భరించడం అంటే ఏపీకి చాలా కష్టమైన విషయమే.
మోడీ భరోసా :
అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం అండగా ఉంటామని భరోసా ఇవ్వడమే అతి పెద్ద ఆశా కిరణంగా అంతా భావిస్తున్నారు. మోడీయే స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి కేంద్రం సహకారం అందిస్తుంది అని హామీ ఇవ్వడం గొప్ప విషయంగా చూడాలి. అదే సమయంలో కేంద్రం నుంచి తగినంత సాయం అందుతుంది అని మంత్రి నారా లోకేష్ కూడా ప్రకటించారు. ఇక కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంగళవారం రాత్రి ఫోన్ చేసి మొంథా తుఫాన్ తీరం తాకిన తరువాత ఎదురైన పరిస్థితులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వాకబు చేశారు. కేంద్రం అండగా ఉంటుందని ఆయన కూడా గట్టి హామీ ఇచ్చారు. ఈ విధంగా కేంద్ర పెద్దలు ఈ కీలక సమయంలో స్పందించడం పట్ల ఒకింత నమ్మకం అయితే కలుగుతోంది. ఏది ఏమైనా మొంథా ఎంత నష్టం చేసింది ఏమి మిగిల్చింది అన్న లెక్కలు నెమ్మదిగా బయటకు వస్తాయి. మళ్ళీ పునర్ నిర్మాణం చేసుకోవాలి అంటే చాలానే కష్టపడాల్సి ఉంది. కేంద్రం కనుక వెన్ను తట్టి నిలబడితే తప్పకుండా ఏపీ మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది అన్న విశ్వాసం అయితే ప్రజలు అందరిలో ఉంది.
