Begin typing your search above and press return to search.

మొంథా తుపాను ఏపీని ఏం చేయనుంది?

వరం సైతం శాపంగా మారుతుంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ ఈ మాట వర్తిస్తుంది. ఏదైతే వరంగా భావిస్తారో.. అది విసిరే సవాళ్లతో తరచూ ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది

By:  Garuda Media   |   26 Oct 2025 9:48 AM IST
మొంథా తుపాను ఏపీని ఏం చేయనుంది?
X

వరం సైతం శాపంగా మారుతుంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ ఈ మాట వర్తిస్తుంది. ఏదైతే వరంగా భావిస్తారో.. అది విసిరే సవాళ్లతో తరచూ ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. ఏపీకి వరంగా భారీ తీర ప్రాంతాన్ని చెబుతుంటారు. ఈ మాటలో నిజం ఉన్నప్పటికి.. విరుచుకుపడే విపత్తులతోనూ ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని.. రాష్ట్ర ప్రజల్ని మొంథా తుపాను వణుకు పుట్టిస్తోంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు.. అంటే మూడు రోజులు మొంథా తుపానుతో ఏం జరుగుతుందన్నది ప్రశ్నగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయానికి వాయుగుండంగా బలపడగా.. శనివారం సాయంత్రానికి అండమాన్ నికోబార్ దీవులకు 510 కి.మీ. దూరంలో.. చెన్నైకు 890కి.మీ. దూరంలో.. విశాఖకు 920కి.మీ. కాకినాడకు 920కి.మీ. దూరంలో కేంద్రీక్రతమై ఉంది.

ఇది ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా.. సోమవారం ఉదయానికి నైరుతి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా రూపాంతరంగా మారి.. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం.. కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రం తీరం దాటే వీలుందని అంచనా వేస్తున్నారు. బుధవారం ఉదయానికి తుపానుగా బలహీనపడుతుందని భావిస్తున్నారు.

రానున్న మూడు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే వీలున్న వేళ.. రెడ్ అలెర్టును జారీ చేశారు. విశాఖ.. మచిలీపట్నం.. క్రిష్ణపట్నం.. నిజాంపట్నం.. గంగవరం..కాకినాడ పోర్టులకు ఒకటో నెంబరు హెచ్చరికలు జారీ చేయగా.. తీవ్ర తుపానుగా తీరం దాటే వేళలో మాత్రం గరిష్ఠంగా గంటకు 110కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని భావిస్తున్నారు. తాజా పరిణామాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు.. తిరుపతి జిల్లాలకు ఆదివారం భారీ వర్షాలు కురిసే వీలుంది.

ఇక.. సోమవారం భారీగా వర్షాలు కురిసే జిల్లాల విషయానికి వస్తే..

బాపట్ల

ప్రకాశం

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

తిరుపతి

అన్నమయ్య

వైఎస్సార్ కడప జిల్లాల్లో అత్యంత భారీగా.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ.. పశ్చిమ గోదావరి.. క్రిష్ణా.. గుంటూరు.. పల్నాడు..చిత్తూరు.. నంద్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే వీలుంది. ఇదే కాకుండా అల్లూరు సీతారామరాజు.. అనకాపల్లి..కాకినాడ.. తూర్పుగోదావరి.. ఏలూరు.. ఎన్టీఆర్.. కర్నూలు.. శ్రీసత్యసాయి అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

ఇదే విధంగా మంగళవారం కూడా రాయలసీమ.. కోస్తా.. గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోనూ పలు జిల్లాల్లో అతి భారీతో పాటు భారీ వర్షాలు కురిసే వీలుంది. బుధవారం విషయానికి వస్తే కోస్తా జిల్లాలతో పాటు.. గోదావరి.. ఉత్తరంధ్ర పరిధిలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ.. భారీ వర్షాలకు వీలుంది. సో.. ఈ రోజు నుంచి బుధవారం వరకు ఏపీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.