Begin typing your search above and press return to search.

జగన్ వ్యూహం సక్సెస్ అయిందా ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత కొద్ది నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి క్యాడర్ ని ఆయా నియోజకవర్గాల నాయకులను అలెర్ట్ చేస్తూ వస్తున్నారు.

By:  Satya P   |   19 Oct 2026 9:05 AM IST
జగన్ వ్యూహం సక్సెస్ అయిందా ?
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత కొద్ది నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి క్యాడర్ ని ఆయా నియోజకవర్గాల నాయకులను అలెర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకం అని చెబుతున్నారు. ఏకగ్రీవం అన్న మాట ఎక్కడా వినిపించకూడదని కూడా ఒకటికి పదిసార్లు గట్టిగా చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని అది వైసీపీకి కలసి వస్తుందని కూడా ఆయన పార్టీ శ్రేణులకు చెబుతూ వచ్చారు. జగన్ ఇంతలా చెప్పిన మీదట పార్టీ బాగా యాక్టివ్ అయింది. అదేమిటి అన్నది నామినేషన్ల ఘట్టంలో స్పష్టంగా కనిపించింది. ప్రతీ చోటా నామినేషన్లు బాగా పడ్డాయి. అంతే కాదు కొన్ని చోట్ల ఒకటికి మించి కూడా నామినేషన్లు వేసిన వారు ఉన్నారు.

రీచార్జి అయిన తీరు :

జగన్ కోరుకున్నట్లుగానే పార్టీ రీచార్జి అయింది అని అంటున్నారు. అనేక చోట్ల పార్టీ జెండా పట్టుకుని వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగాయి. ఇక రాయలసీమలో అయితే వైసీపీ బాగానే పుంజుకుందని నివేదికలు ఉన్నాయి. కోస్తా ఉతరరాంధ్రాలోనే వైసీపీ ఇంకా హుషార్ చేయాల్సి ఉందని అంటున్న క్రమంలో వచ్చిన ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ కి చురుకుదనం పుట్టిందని అంటున్నారు. ఆ విషయంలో మాత్రం వైసీపీ చాలా వరకూ సక్సెస్ అయినట్లే అని అంటున్నారు.

కసి పెరిగింది :

ఈసారి అంతా అనుకుంటున్నట్లుగానే రాయలసీమలోనే ఎక్కువగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వైసీపీ నామినేషన్లు వేయలేకపోయింది కూడా అక్కడే కావడం విశేషం. అయితే అక్కడ వైసీపీ నుంచి క్యాడర్ ధీటుగానే తలపడింది అని అంటున్నారు. నామినేషన్ల దాఖలు కోసం దాదాపుగా ఫైటింగ్ సీన్లు కనిపించాయి. నామినేషన్లు వేశారా లేదా అన్నది పక్కన పెడితే తమ పార్టీ కోసం క్యాడర్ పట్టుదలగా ముందుకు పోవడం జరిగింది. ఇదే సమయంలో నామినేషన్లు వేయనీయడం లేదని పోలీసుల వేధింపులు ఉన్నాయని వైసీపీ క్యాడర్ ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇంత పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా రంగంలోకి రావడం ఇదే మొదటిసారి. దాంతో పార్టీల పరంగా విభజన జరిగినపుడు ఆ మేరకు కసి కూడా బాగా వైసీపీలో రేగింది అని అంటున్నారు. జగన్ అయితే ఇదే కోరుకున్నారని కూడా అంటున్నారు.

కూటమి విజయం మీద :

వాస్తవానికి అధికారంలో ఏ పార్టీ ఉంటుందో వారికే స్థానిక సంస్థల ఎన్నికలు అనుకూలంగా ఉంటాయి. అయిదేళ్ళు అధికారంలో ఉన్న జగన్ కి ఈ సంగతి తెలియనిది కాదని అంటున్నారు. అయినా సరే ఆయన కూటమి దౌర్జన్యాలు అంటూ పలు మార్లు మీడియా ముందుకు రావడం గవర్నర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వద్దకు వెళ్ళి ఫిర్యాదులు చేయడం వెనక కూటమిని ఎక్స్ పోజ్ చేయడం అనే వ్యూహం ఉందని అంటున్నారు.

ఫైర్ వేరే లెవెల్ లో :

అంతే కాదు తమ చేత నామినేషన్లు వేయనీయలేదని తాము పోటీ చేస్తే కూటమికి ఓడిపోతామన్న భయం ఉందని జగన్ చెప్పడం ద్వారా కూటమిని విజయాన్ని తక్కువ చేసి చూపించే ఎత్తుగడ వేశారని అంటున్నారు. నిజంగా రెండు పార్టీలూ పోటీ పడి ఉంటే వచ్చే ఫలితం కూటమికి అనుకూలంగా ఉంటే సంగతి వేరు కానీ నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు కాబట్టి ఇలా గెలిచారు అన్నది కూడా జగన్ చెప్పదలచారు అని అంటున్నారు. అన్నింటికీ మించి తమ క్యాడర్ ని కట్టడి చేసి నియంత్రించడం అన్నది అవతల వైపు నుంచి గట్టిగా వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా వారిలో ఫైర్ వేరే లెవెల్ లో కనిపిస్తుందని అది 2029 ఎన్నికల నాటికి అతి పెద్ద బలం అవుతుందన్నదే వైసీపీ వ్యూహంగా ఉంది.