Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం...రీజన్ అదేనా ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By:  Satya P   |   15 Aug 2026 9:04 AM IST
స్థానిక  ఎన్నికలు మరింత ఆలస్యం...రీజన్ అదేనా ?
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓటర్ల జాబితా ఇపుడు కీలకంగా మారింది. పాత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తామని ఇంతకు ముందు అధికారులు చెప్పినట్లుగా ప్రకటనలు వచ్చాయి. అయితే పాత జాబితాతో ఎలా నిర్వహిస్తారు అన్న విమర్శలు వచ్చిపడ్డాయి. అందులో షిఫ్ట్ అయిన ఓటర్లు చనిపోయిన ఓటర్లు, మ్యాపింగ్ లో లేని ఓటర్లు అంతా కలసి ఏకంగా 45 లక్షల మంది దాకా పక్కకు పోయారు. డబుల్ ఎంట్రీ ఓటర్లను కూడా తగ్గించి చూపించారు. దాంతో నాలుగు కోట్ల దాకా ఉన్న ఏపీ ఓటర్ల సంఖ్య మూడున్నర కోట్లకు వచ్చింది. దాంతో పాత జాబితా అంటే ఇవన్నీ మళ్లీ చర్చకు వస్తాయి. దాంతోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో తర్జన భర్జన పడుతోంది అంటున్నారు

ఏపీలో ఓటర్ల తుది జాబితా :

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా ఈ ఏడాది అక్టోబర్ 3 న విడుదల కానుంది. ప్రస్తుతం ముసాయిదా జాబితా అందుబాటులో ఉంది, దీనిపై అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు 30 వరకు కొనసాగుతుంది. అందులోనే పక్కాగా వివరాలు అన్నీ వస్తాయని అంటున్నారు. సర్ ప్రక్రియలో తొలగించిన 45 లక్షల ఓట్ల నుంచి కూడా వివరణలు తీసుకుని సవరణలు చేస్తే ఓటర్లు ఇంకా పెరుగుతారు. అలాగే యువ ఓటర్లు కొత్త ఓటర్లను కూడా చేరుతారు. అది కచ్చితమైన ఓటర్ల జాబితా అవుతుందని అంటున్నారు. మరి ఆ ఓటర్ల జాబితా చేతిలో పడితేనే తప్ప రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను నిర్వహించలేదని అంటున్నారు.

రెండు నెలల తరువాతనే అంటూ :

అందుకే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు నెలల తరువాతనే జరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం ఆగస్టు మధ్యలో నడుస్తోంది. అక్టోబర్ 3న తుది జాబితా వచ్చిన తరువాత అన్నీ వేగవంతంగా పూర్తి చేస్తే అదే నెలలో స్థానిక ఎన్నికలు ప్రారంభించి రెండు విడతలుగా నిర్వహించవచ్చు అని అంటున్నారు. ఇక అదే సమయంలో ఓటర్ల జాబితాతో పాటుగా రిజర్వేషన్లు, కోర్టుకేసులు వంటి వాటి విషయంలోనూ స్పష్టత రావలసిన అవసరం ఉంది అని అంటున్నారు. ఇలా ఈ కీలక విషయాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తం మీద రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే సిద్ధంగా ఉంది.

దసరా తరువాతనేనా :

ఇక అక్టోబర్ అంటే పండుగల నెలగా ఉంది. దసరా ఉత్సవాలు పెద్ద ఎత్తున పది రోజుల పాటు సాగుతాయి. దాంతో అక్టోబర్ మూడవ వారం కూడా ముగిసిపోతుంది. అలా అన్నీ పూర్తి చేసుకున్న తరువాత అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలు జరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. ఆ సమయం అయితే అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుందని కూటమి ప్రభుత్వం కూడా భావిస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద మరో రెండు నెలలకు పైగా స్థానిక ఎన్నికల సమరం ముందుకు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. ఎపుడు ఎన్నికలు జరిగినా కూటమిదే విజయం అని అధికార పార్టీ ధీమాగా ఉంది.