'పాలిటిక్స్' అంటే అంతే.. తన మన లేనట్టే... !
రాజకీయాల్లో తన -మన అనే మాటే ఉండదు.. అనడానికి అనేక ఉదాహరణలు తెరమీదికి వస్తున్నాయి.
By: Garuda Media | 28 Oct 2026 1:00 AM ISTరాజకీయాల్లో తన -మన అనే మాటే ఉండదు.. అనడానికి అనేక ఉదాహరణలు తెర మీదికి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకే ఇంట్లో ఉన్న వారు.. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వచ్చేసరికి.. ఒకే ఇంటి సభ్యులు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఒకే ఇంట్లో ఉంటే ఇబ్బందులు వస్తాయని భావించి.. వేర్వేరు ఇళ్లకు మారిపోయారు. పైగా.. వారంతా ఒకే ఇంటి సభ్యులు కావడంతో.. ప్రచారం ఇప్పుడు కీలకంగా మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా పార్టీల పరంగానే ప్రచారం చేస్తున్నా.. మున్ముందు.. మాత్రం విమర్శలు తప్పేలా లేవు.
అక్కా తమ్ముళ్లు సై..
ఎంపీ టీసీల విషయానికి వస్తే.. కొన్ని కొన్ని జిల్లాల్లో అక్కా తమ్ముళ్ల మధ్యే పోరు నెలకొంది. అక్క ఒక పార్టీ అయితే.. తమ్ముడు మరో పార్టీ తరఫున నామినేషన్ వేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాఘవపట్నం ఎంపీటీసీ స్థానానికి అక్క, తమ్ముడు నందిపల్లి యరకయ్యమ్మ, తమరాల సత్యనారాయణ తల పడుతున్నారు. యరకయ్యమ్మ వైసీపీ తరఫున నామినేషన్ వేయగా.. సత్యనారాయణ టీడీపీ తరఫున తల పడుతున్నారు. వీరి ప్రచారంలో వ్యక్తిగత విమర్శలు లేకపోయినా.. పార్టీ పరంగా మాత్రం దూకుడుగానే ఉన్నారు.
తునిలో కూడా వైసీపీ, టీడీపీల తరఫున అక్కా తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. దాసరి నాగరాజు టీడీపీ తరఫున నామినేషన్ వేస్తే.. ఆయన అక్క జ్యోతి మాత్రం జనసేన నుంచి లైన్లో ఉన్నారు. వాస్తవానికి వీరిద్దరికీ.. ఇరు పార్టీలూ టికెట్లు ఇవ్వలేదు. అయినప్పటికీ.. ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచారు. చిత్రం ఏంటంటే.. 2021లో నాగరాజు.. వైసీపీ తరఫున పోటీ చేసినప్పుడు.. జ్యోతి ఆయన విజయం కోసం కష్టపడి గెలిపించారు. కానీ, ఈ సారి మాత్రం అక్కా తమ్ముళ్లు ఉభయులు కూడా తలపడుతుండడం గమనార్హం.
తోడికోడళ్లు..!
తోడి కోడళ్లు అనగానే.. నర్సీపట్నం అందరికీ గుర్తుకు వస్తుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడి సతీమణితోపాటు.. ఆయన సోదరుడి సతీమణి సైతం.. తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. స్పీకర్ సతీమణి టీడీపీ తరఫున, అయ్యన్న సోదరుడి భార్య వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే.. వీరిద్దరే కాదు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని విస్సా కోడూరులోనూ.. తోడి కోడళ్లు ఎన్నికల బరిలో సై అంటున్నారు. టీడీపీ సీనియర్ నేత బొర్రా కోటేశ్వరరావు.. ఇద్దరు కోడళ్లు ఇక్కడ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ, వైసీపీల తరఫున బరిలో నిలవడం గమనార్హం.
తల్లీ కూతుళ్లు
రాజకీయాల్లో తన మన ఉండదనడానికి ఇదో ఉదాహరణ.. ఏకంగా ఓ ఎంపీపీ స్థానానికి తల్లీ కూతుళ్లే తలపడుతు న్నారు. అందునా.. కుమార్తె టీడీపీ తరఫున, తల్లి వైసీపీ తరఫున నామినేషన్లు వేశారు. ఈ చిత్రమైన ఘటన విజయనగరం జిల్లా కోటశిర్లాం ఎంపీటీసీ స్థానంలో చోటు చేసుకుంది. బొప్పడాల జయలక్ష్మి, బొప్పడాల విజయలక్ష్మి తల్లీకూతుళ్లు. కానీ, ఎన్నికల వేళ.. కుమార్తె జయలక్ష్మి వేరు పడి.. టీడీపీ తరఫున నామినేషన్ వేయగా.. తల్లి విజయలక్ష్మి.. వైసీపీ తరఫున పోటీలో ఉన్నారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా పలు కుటుంబాలు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేస్తుండడం గమనార్హం.
