Begin typing your search above and press return to search.

కార్యకర్తల కోసం వేల కోట్ల పనులు.. స్థానిక ఎన్నికల ముందు కూటమి మ్యాజిక్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రూపాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ, స్థానిక ఎన్నికల సమయంలో ఇటు పట్టణ సంస్థలకు అటు పంచాయతీలకు ఒకేసారి వేల కోట్లు విడుదల చేయడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోందని చెబుతున్నారు.

By:  Tupaki Political Desk   |   29 Sept 2026 5:00 AM IST
కార్యకర్తల కోసం వేల కోట్ల పనులు.. స్థానిక ఎన్నికల ముందు కూటమి మ్యాజిక్
X

వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్న ప్రభుత్వం కూటమి కార్యకర్తలకు చేతినిండా పని కల్పించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిందని అంటున్నారు. పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఒకేసారి వేల కోట్ల నిధులు విడుదల చేయడం ద్వారా కార్యకర్తలకు చిన్నచిన్న కాంట్రాక్టులు అప్పగించి భారీగా లబ్ధి చేయాలనే వ్యూహాన్ని రచిస్తుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రూపాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ, స్థానిక ఎన్నికల సమయంలో ఇటు పట్టణ సంస్థలకు అటు పంచాయతీలకు ఒకేసారి వేల కోట్లు విడుదల చేయడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోందని చెబుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విజయం సాధించి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం త్వరలో నిర్వహించే స్థానిక ఎన్నికల్లో వంద శాతం ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనల్లో ఇదే విషయాన్ని చెబుతూ కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో కేడర్ లో అసంతృప్తి చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలలో చాలా అభివృద్ధి పనులు చేసినా, అవేవీ కేడర్ ద్వారా చేయలేదని, కాంట్రాక్టర్లకు మాత్రమే మేలు జరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేడర్ కు ఆర్థికంగా ఆదుకునేలా కొన్ని పనులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది.

ఇందులో భాగంగా పట్టణ స్థానిక సంస్థల్లో దాదాపు రూ.50 వేల కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచించిందని అంటున్నారు. ఇందులో ముందగా రూ.11,359 కోట్ల పనులను కొద్దిరోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించడం విశేషంగా చెబుతున్నారు. ఈ నిధులతో పట్టణాల్లో రోడ్లు, కాలువల నిర్మాణానికి దాదాపు రూ.5 వేల కోట్లు వరకు వెచ్చిస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో ప్రైవేటు భాగస్వామ్యంతో మరికొన్ని పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీల్లో కూడా పల్లె పండుగ 3.0 పేరుతో మరో 10 వేల కోట్లతో వివిధ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని అంటున్నారు.

ఇలా గ్రామాలు, పట్టణాల్లో కలిపి ఒకేసారి భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం వెనుక పక్కా రాజకీయ వ్యూహం దాగివుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రధానంగా చెబుతున్నా, ఆ నిధులతో కార్యకర్తలకు పనులు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. తద్వారా కార్యకర్తలకు కొంతమేర ఆర్థిక ప్రయోజనం దక్కుతుందని, దీంతో ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని ప్రభుత్వ పెద్దలు వ్యూహరచన చేసినట్లుగా చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో తమకు ఎటువంటి ప్రయోజనం లేదని భావిస్తున్న కేడర్ ను సంతృప్తి పరచడానికి ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. మొత్తానికి స్వామి కార్యం, స్వకార్యం ఒకేసారి తీరినట్లు అభివృద్ధి పనులతోపాటు కార్యకర్తల్లో అసంతృప్తిని చల్లార్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని విశ్లేషిస్తున్నారు.