జోగికి కొత్తరకమైన టార్చర్.. రాజకీయాల్లో ఇదే ఫస్ట్ టైం!
ఐవీఆర్ఎస్ కాల్స్ (IVRS Calls) అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఒక సమాచారాన్ని ఒకే సమయంలో వేల మందికి చేరవేడానికి ఈ టెక్నాలజీని వాడుకుంటారు.
By: Tupaki Political Desk | 24 Oct 2025 11:00 PM ISTఐవీఆర్ఎస్ కాల్స్ (IVRS Calls) అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఒక సమాచారాన్ని ఒకే సమయంలో వేల మందికి చేరవేడానికి ఈ టెక్నాలజీని వాడుకుంటారు. కంప్యూటర్ ద్వారా మొబైల్ కాల్స్ చేయించి తాము అనుకున్న విషయాన్ని ప్రజలకు చేరవేస్తారు. అయితే ఇన్నాళ్లూ ఈ టెక్నాలజీని ఒక విధంగా వాడితే, కూటమి ప్రభుత్వం మాత్రం సరికొత్తగా వాడుతోంది. తమ రాజకీయ ప్రత్యర్థులను డామేజ్ చేసే అస్త్రంగా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఇన్నాళ్లు ఎన్నికల సమయంలో సర్వేలు, అభ్యర్థుల ఎంపిక, ప్రభుత్వ పథకాల ప్రచారం, ప్రజాభిప్రాయ సేకరణకు మాత్రమే వాడుకోవడం మనం చూశాం. కానీ, ఇప్పుడు కూటమి పార్టీలు రూటు మార్చాయి. ప్రధానంగా కూటమికి నేత్రుత్వం వహిస్తున్న టీడీపీ వినూత్నంగా ప్రతిపక్షాలను బదన్నాం చేయడానికి ఐవీఆర్ఎస్ కాల్స్ ను వాడుకోవడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైన కల్తీ మద్యం విక్రయాలపై అసలు నిందితులు, కుట్రదారులు అంటూ కొందరి పేర్లతో ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి. ఇందులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తుండటంతో ఆయన షాక్ కు గురయ్యారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అన్నమయ్య జిల్లా మునకలచెరువులో కల్తీ మద్యం ఫ్యాక్టరీని ఎక్సైజ్ అధికారులు గుర్తించి సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇద్దరు టీడీపీ నేతలకు సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో ఆ పార్టీ ఇద్దరినీ సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో ఏ1 అద్దేపల్లి జనార్దనరావుకు మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ తో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. జోగి రమేష్ సూచనలతో ప్రభుత్వంపై బురద జల్లడానికే మద్యం కల్తీ చేశామని ఏ1 జనార్దనరావు వీడియో విడుదల చేయడంతో కలకలం రేపింది. ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. అదే సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది.
అయితే ప్రభుత్వం మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ పై ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. మరోవైపు జోగి టార్గెట్ గానే సిట్ దర్యాప్తు ప్రారంభమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో జోగిని టెన్షన్ పెట్టేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందన్న అభిప్రాయం వినిపించింది. ఇదే సమయంలో ప్రభుత్వం తరఫున రంగంలోకి దిగిన టీడీపీ టెక్నాలజీని వాడుతూ కల్తీ మద్యానికి జోగి రమేష్ కారణమని ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడం సంచలనంగా మారింది. అయితే, ఈ కాల్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న జోగి శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన పాత్రపై ఎటువంటి ఆధారం లేకుండా తన పరువుకు నష్టం వాటిల్లేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
