Begin typing your search above and press return to search.

'కక్ష' కు బ్యూరోక్రాట్లు బలి? ఈ కల్చర్ ఏపీలో ఎప్పుడు మొదలైంది?

కాలానికి తగ్గట్లు మారకపోవటం.. గౌరవమర్యాదలకు లోటు లేకున్నా.. రాజకీయం ఈ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది.

By:  Garuda Media   |   30 Jun 2026 4:35 PM IST
కక్ష కు బ్యూరోక్రాట్లు బలి? ఈ కల్చర్ ఏపీలో ఎప్పుడు మొదలైంది?
X

‘అఖిల భారత సర్వీసు’ను సాధించటం అంత తేలికైన విషయం కాదు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన.. కష్టమైన పద్దతిలో జరిపే ఎంపికలో విజయం సాధించటమే ఒక పెద్ద అచీవ్ మెంట్ గా చెప్పాలి. అలాంటి అధికారుల ఫోకస్.. వారి పని తీరు మొత్తం సమాజం చుట్టూనే తిరుగుతుంటుందన్న భావన సమాజంలో ఉండేది. కాలానికి తగ్గట్లు మారకపోవటం.. గౌరవమర్యాదలకు లోటు లేకున్నా.. రాజకీయం ఈ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో ఏపీలో (ఉమ్మడి రాష్ట్రంలోనూ) అఖిల భారత సర్వీసుకు చెందిన పలువురు ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఎదుర్కొంటున్న ‘శిక్ష’లు జాతీయ స్థాయిలోనూ హాట్ టాపిక్ గా మారుతున్న దుస్థితి.

పాలకుల పాలి‘ట్రిక్స్’కు పడిపోయే అధికారులు.. ఆ తర్వాతి కాలంలో తీవ్ర అవస్థల్ని ఎదుర్కొంటున్నారు. అత్యంత కీలకస్థానాల్లో ఉండి.. రాష్ట్ర పాలనా రథాన్ని తమ చేతుల మీదుగా నడిపించాల్సిన ధర్మకర్తలుగా అఖిల భారత సర్వీసు అధికారుల్ని చెబుతారు. ఆ స్థానంలో ఉన్న వారెవరూ.. రాజకీయ ప్రలోభాలకు.. అధికారానికి దాసులుగా కాకుండా.. కేవలం ప్రజలకు మాత్రమే బాధ్యులుగా ఉండాల్సిన అవసరం ఉంది.

అయితే.. అలాంటి తీరు కాలక్రమంలో అంతకంతకూ తగ్గుతూ.. ఇప్పుడు కనుమరుగు అయ్యే దుస్థితి. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు.. ఆంధ్రప్రదేశ్ కు ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. అదేమంటే.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రాజకీయ బదిలీలు సర్వసాధారణం. అధికారంలోకి వచ్చినప్పుడు తమకు అనుగుణంగా అధికారుల్ని ఎంపిక చేసే స్వేచ్ఛ పాలకులకు ఉంటుంది. దీన్ని అసరాగా తీసుకొని.. తమకు నచ్చిన.. తమ మైండ్ సెట్ ను ఇట్టే అర్థం చేసుకొని.. పని చేసే అధికారులకు కీలక స్థానాలు అప్పగించటం ఎప్పటి నుంచో వస్తున్నదే.

అయితే.. ఇందుకు భిన్నమైన పరిస్థితులకు తెర తీసింది మాత్రం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డినే చెప్పాలి. సుదీర్ఘ కాలంగా సీఎం కుర్చీ కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆయన ఎట్టకేలకు 2004లో అధికారాన్ని సొంతం చేసుకున్నారు. అయితే.. ఆయన తన ఛరిష్మాను పెద్ద ఎత్తున విస్తరించుకోవటానికి.. పాలన విషయంలో తన మార్క్ చూపించేందుకు.. తన అజెండాను విజయవంతంగా అమలు చేయటానికి వీలుగా తనదైన టీంను ఎంపిక చేసుకున్నారు.

తన ప్రభుత్వంలో కొందరు అధికారులకు కీలకమైన శాఖల్ని.. స్థానాల్ని అప్పజెప్పారు. అందుకు తగ్గట్లే కీలక ప్రాజెక్టులు.. భూ కేటాయింపుల బాధ్యతను చేపట్టారు. ఇక్కడే ఒక చారిత్రక మార్పు మొదలైంది. సీఎం వైఎస్ ఎంపిక చేసుకొన్న అధికారుల మాటకు ఎదురే లేని పరిస్థితి. ఫైళ్లను పరిగెత్తించటంలో ఒక మార్క్ సాధించారు. అంతేకాదు.. ప్రభుత్వ పెద్దల ఆదేశాల్ని గుడ్డిగా అమలు చేసే దరిద్రపుగొట్టు కల్చర్ కు తెర తీసినట్లైంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం.. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిని ఆశించటం అంతా గడిచిన చరిత్ర. ఆ సందర్భంలో అప్పటివరకు వైఎస్ కు దన్నుగా ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం.. ఎప్పుడైతే జగన్ కు అధికారాన్ని కట్టబెట్టే విషయంలో భిన్నంగా ఆలోచించటం షురూ చేసిందో.. అప్పటి నుంచి కొత్త తరహా రాజకీయం ఏపీలో పురుడు పోసుకుంది. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాలకు భిన్నంగా జగన్ అడుగులు వేయటం.. అతడి వేగాన్ని నిలువరించేందుకు స్పీడ్ బ్రేకర్లు మాదిరి.. అతడిపై అక్రమాస్తుల కేసులు మొదలుకావటం.. వాటికి కొనసాగింపుగా వైఎస్ కు అన్ని విధాలుగా దన్నుగా నిలిచిన అధికారులు పలువురు జైళ్ల పాలయ్యారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జీవోలు జారీ చేసిన బీపీ ఆచార్య.. వై శ్రీలక్ష్మి.. కేవీ బ్రహ్మానందరెడ్డి లాంటి పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. భారత బ్యూరోక్రసీ చరిత్రలో అదో పెద్ద మలుపుగా చెప్పాలి. కట్ చేస్తే.. రాష్ట్ర విభజనతో పాటు.. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. వైఎస్ ప్రభుత్వంలో అనుకూలంగా పని చేసిన అధికారులను పక్కన పెట్టేశారు. తనకు సూట్ అయ్యే అధికారులకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. రాజకీయంగా పలు ఆటుపోట్లు.. అడ్డంకులు ఎదుర్కొన్న జగన్.. 2019లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకొని ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలన షురూ నాటి నుంచి తన లక్ష్యం.. తన టార్గెట్ సూటిగా.. స్పష్టంగా ఉండేది.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారుల్ని ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టారు జగన్మోహన్ రెడ్డి. అందుకు తగ్గట్లే.. అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. బాకు నమ్మకస్తుడైన ఎబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయటం.. ఏపీపీఎస్సీకి గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేయటం.. కొందరు పోలీసు ఉన్నతాధికారులు (పీవీ సునీల్ కుమార్, పీఎస్ ఆర్ ఆంజనేయులు లాంటి అధికారులు ప్రతిపక్షనేతలపై కేసులు నమోదు చేయటం.. వేధింపులకు దిగినట్లుగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇందుకు తగ్గట్లే 2024లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరటం తెలిసిందే. అధికారంలోకి వచ్చినంతనే జగన్ పాలనలో తమను టార్గెట్ చేసిన అధికారులను లక్ష్యంగా చేసుకొని సస్పెన్షన్లు.. విచారణలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకప్పుడు తమిళనాడులో నువ్వా - నేనా అన్న రీతిలో రాజకీయాలు ఉండేవి. పార్టీ సిద్ధాంతాల్ని దాటేసి.. వ్యక్తిగత వైరం స్థాయికి చేరుకోవటమే కాదు.. తమ ప్రత్యర్థులకు సహకరించిన అధికారుల్ని కూడా శత్రువులుగా చూసేవారు. ఇంచుమించు అలాంటి తీరు ఏపీలో ఎక్కువైందని చెప్పాలి. ఇది కొనసాగినంత కాలం పాలన మీద కంటే కూడా పరిమిత ప్రయోజనాల దిశగా పని చేసే దుస్థితి. అదే జరిగితే.. ప్రజలకు మేలు జరగటం అన్నది లేకపోగా.. కొత్త తరహా వికారాలకు నెలవుగా మారుతుందని చెప్పకతప్పదు.