జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్.. రేపే ప్రారంభం.. ఏపీలో కొత్త చరిత్ర!
మన రాష్ట్రంలో బంగారు నిక్షేపాలను వెలికి తీసే కీలకమైన ప్రైవేటు మైన్ ప్రారంభానికి సిద్ధమైంది.
By: Tupaki Political Desk | 23 Jun 2026 12:22 PM ISTమన రాష్ట్రంలో బంగారు నిక్షేపాలను వెలికి తీసే కీలకమైన ప్రైవేటు మైన్ ప్రారంభానికి సిద్ధమైంది. రాయలసీమలోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో నిర్మించిన గోల్డ్ మైన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించనున్నారు. సుమారు 1477 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ గోల్డ్ మైన్ లో దాదాపు 2 కిలోమీటర్ల మేర బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఏటా వెయ్యి కిలోల బంగారు శుద్ధి చేసేలా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ అభివృద్ధి చేశారు. దీని రెండో దశ విస్తరణ పనులకు కూడా బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. జొన్నగిరి గోల్డ్ మైన్ తో ఈ ప్రాంతం దశ, దిశ మారనున్నట్లు చెబుతున్నారు.
జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ తో రాయలసీమ ముఖచిత్రం మారనుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు కరువు, కాటకాలతో వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడిన రాయలసీమ ఇప్పుడు పరిశ్రమల రాకతో అభివృద్ధిలో దూసుకుపోతోందని అంటున్నారు. బ్రిటిష్ కాలం నాటి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) తర్వాత, బంగారం తవ్వకాలకు జొన్నగిరి ప్రాంతం కేంద్రబిందువుగా మారడం విశేషంగా చెబుతున్నారు. జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా సంస్థ చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు, కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాదాపు 1,477 ఎకరాల విస్తీర్ణంలో, అత్యాధునిక ఓపెన్ కాస్ట్, 'అండర్ గ్రౌండ్ మైనింగ్ పద్ధతుల ద్వారా బంగారం వెలికితీసేలా ప్రణాళికలు రూపొందించారు. భూమి లోపల 2 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించిన బంగారు నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రీయంగా గుర్తించడం ఈ ప్రాజెక్టుకున్న ప్రత్యేకత.
రూ.320 కోట్ల పెట్టుబడి
రూ.320 కోట్లతో ఈ ప్లాంట్‌ను నిర్మించారు. బుధవారం ప్రారంభం కానున్న మొదటి యూనిట్ ద్వారా ఏటా 1,000 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది దేశీయ బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల్లోని స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేవలం మైనింగ్ పనులే కాకుండా, గని నిర్వహణ, రవాణా, అనుబంధ రంగాల్లో వందలాది మందికి ఉపాధి దక్కనుంది. గనుల తవ్వకాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రుల ఆధునికీకరణ వంటి సామాజిక బాధ్యతలను కూడా ఈ సంస్థ నెరవేరుస్తోంది.
రాయలసీమ అభివృద్ధికి ఊతం..
గతంలో రత్నాలు, వజ్రాలకు పెట్టింది పేరైన రాయలసీమకు, ఇప్పుడు బంగారం తోడవ్వడం ఆ ప్రాంత ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ బంగారు గని కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, రాయలసీమ ప్రాంత పారిశ్రామికీకరణకు ఒక చోదక శక్తి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, మరిన్ని మైనింగ్ సంస్థలు ఈ ప్రాంతం వైపు చూసే అవకాశం ఉంది. ఏపీని ఆకర్షణీయమైన పారిశ్రామిక హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఒక బలమైన పునాదిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కర్నూలు జిల్లా కేంద్రంగా మొదలైన ఈ 'బంగారు విప్లవం', యావత్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతిని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందనే ఆశాభావం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
