ఏపీ పుట్టిన రోజు...నవంబర్ 1 ప్రాధాన్యత కోల్పోతుందా ?
నవంబర్ 1 అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి.
By: Satya P | 31 Oct 2026 11:52 PM ISTనవంబర్ 1 అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి. ఒకటా రెండా 58 ఏళ్ళ పాటు ఈ వేడుకను ఉమ్మడిగా ఆంధ్రులు అందరూ జరుపుకున్నారు. అంతే కాదు ఈ రోజుకు మరో విశిష్టత ఉంది. అదే రోజున దేశంలో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్ సహా కేంద్ర పాలిత ప్రాంతాలు అయిన లక్షద్వీప్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, ఢిల్లీ వంటి వాటికి నవంబర్ 1 ఒకటి అవతరణ దినోత్సవం గా ఉంది. అలా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు దేశంలో శ్రీకారం చుట్టింది కూడా ఏపీనే. మరి అంతటి విశిష్టత కలిగిన నవంబర్ 1 ఇప్పుడు ఎందుకు ప్రాధాన్యత కోల్పోతోంది అన్నది అయితే పెద్ద చర్చగా ఉంది.
అప్పటి నుంచే అలా :
ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీగా మారిన తరువాత 1956 నవంబర్ 1 ని అవతరణ దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చారు. అలా 2013 దాకా కొనసాగింది. అయితే 2014 జూన్ 2 నుంచి ఏపీ తెలంగాణా విడిపోయాయి. దాంతో తెలంగాణా జూన్ 2 ని అవతరణ దినోత్సవంగా జరుపుకుంటోంది. ఏపీ మాత్రం ఒక తేదీ అన్నది లేకుండా అలాగే కొనసాగుతోంది. ఇక వెనక్కి వెళ్ళి చూస్తే 2014లో జూన్ 2 అప్పటి టీడీపీ ప్రభుత్వం నవ నిర్మాణ దీక్ష పేరుతో జరుపుతూ వచ్చింది. అలా రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2వ తేదీని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విభజన గాయాలను గుర్తుచేసుకుంటూ నవనిర్మాణ దీక్షగా ప్రకటించింది తప్ప నవంబర్ 1న అవతరణ దినోత్సవ ఉత్సవాలు చేయలేదు. ఇక 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన నవంబర్ 1వ తేదీనే అధికారికంగా రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరపాలని జీవో జారీ చేసింది. అంత వరకే అలా పరిమితం అయింది.
రెండేళ్ళుగా లేకుండానే :
ఇక 2024 లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం నవంబర్ 1వ తేదీని అవతరణ దినోత్సవంగా జరపడం లేదు. మరో వైపు చూస్తే నవంబర్ 1 అనేది ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక వ్యవస్థాపక దినోత్సవం కాదని కూడా అభిప్రాయాలు ఉన్నాయంటారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేసిన తర్వాత ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి అప్పటి ఏపీని విడిపోయి కర్నూలు రాజధానిగా భారతదేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ప్రకటించారు. దాంతో అక్టోబర్ 1 ని ఏపీకి అసలైన అవతరణ దినోత్సవం అని అన్న వారూ ఉన్నారు.
ఎక్కువ మందికి ఆ డేట్ :
అయితే నవంబర్ 1 అంటేనే ఎక్కువ మందికి ఆంధ్ర రాష్ట్ర అవతరణ అన్నది గుర్తుకు వస్తుంది కాబట్టి ఆ రోజునే జరుపుకోవాలన్న మాట ఉంది. అయితే ఒక రాష్ట్రానికి ఏరోజూ అవతరణ అన్నది లేకుండా చేయడం మంచిది కాదని అంటున్నారు. ఏడాది పాటు సాగిన అభివృద్ధిని ఒక్కసారి తలచుకుని మరింత ముందుకు వెళ్ళేందుకు పునరంకితం అయ్యేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది, అలాగే రాష్ట్రానికి పుట్టిన రోజు అన్నది ఒక గర్వం అని అంటారు. అలాగే గౌరవంగా చూస్తారు. మరి ఆ విధంగా జరపాలన్న ధ్యాస పాలకులలో ఉందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 1 అన్నది ప్రాధాన్యత లేని తేదీగా మారిపోతోంది. తెలంగాణాకు జూన్ 2 ఉంది, ఏపీకి ఫార్మేషన్ డే ఏదీ అంటే జవాబు అయితే లేదు, దీని మీద భాషాభిమానులు, ఆంధ్ర రాష్ట్ర ప్రేమికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
