Begin typing your search above and press return to search.

ఏపీ ఖజానాకు జీఎస్టీ చిల్లు

ఏపీలో ఆర్థిక పరిస్థితి రాను రానూ ఇబ్బందికరంగా మారుతోంది. గత పదకొండేళ్ళుగా విభజన కష్టాల నుంచి రాష్ట్రం గట్టెక్కలేకపోతోంది అన్నది కఠోర వాస్తవం.

By:  Satya P   |   27 Dec 2025 4:00 AM IST
ఏపీ ఖజానాకు జీఎస్టీ చిల్లు
X

ఏపీలో ఆర్థిక పరిస్థితి రాను రానూ ఇబ్బందికరంగా మారుతోంది. గత పదకొండేళ్ళుగా విభజన కష్టాల నుంచి రాష్ట్రం గట్టెక్కలేకపోతోంది అన్నది కఠోర వాస్తవం. అదే సమయంలో రాజకీయంగా విపరీతమైన పోటీతో అధికారమే పరమావధిగా పార్టీలు జనాలకు ఇస్తున్న ఉచిత హామీలు ఉండనే ఉన్నాయి. భారీ రెవిన్యూ లోటుతో ఏపీ 2014 జూన్ 2న ఏర్పాటు అయింది. 2014లో రాష్ట్రం భారీ రెవెన్యూ లోటును ఎదుర్కొంది. కాగ్ నివేదిక ప్రకారం చూస్తే కనుక 24,194 కోట్ల రూపాయలు లోటు 2014-15లోనే ఉంది.

అంతరం పెరుగుతోంది :

ఇక తరువాత చూస్తే ఆదాయాలను తెచ్చే హైదరాబాద్ లాంటి మహానగరం లేకపోవడంతో ఈ లోటు సంవత్సరాల నుంచి అలా పెరుగుతూనే ఉంది. అదే విధంగా చూస్తే కనుక తరువాతి సంవత్సరాల్లో ఆదాయానికి ఖర్చులకు మధ్య భారీ అంతరం పెరుగుతూ ఆఖరుకు పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే సాధారణ ఖర్చుల కోసం భారీగా రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్రం రెండవ తరం జీఎస్టీ సంస్కరణలు అంటూ ఈ ఏడాది అక్టోబర్ లో తీసుకుని వచ్చిన కొత్త స్లాబుల వల్ల ఏపీ ఆదాయం ఇంకా దెబ్బ తింటోంది.

జీఎస్టీ షాక్ :

జీఎస్టీ స్లాబ్స్ నుంచి మధ్యతరగతి దిగువ తరగతి ఊరట అంటూ చాలా వస్తువులను తప్పించేశారు. దాంతో వాటి వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పోయింది. ఏపీకి ఏకంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు తగ్గుదల వీటి ఫలితంగా ఉంటుందని ఆనాడు లెక్క వేశారు. కానీ ఆచరణలో ఇంకా ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ లో కొంత మేర జీఎస్టీ దెబ్బ కనిపిస్తే నవంబర్ లో అది మరింతగా పెరిగినట్లుగా గణాంకాలు వివరిస్తున్నాయి. లెక్కలు చూస్తే కనుక గత ఏడాది అక్టోబర్ లో రాష్ట్రానికి 2 వేల 777 కోట్ల రూపాయలు జీఎస్టీ ద్వారా రాబడి వస్తే ఈ ఏడాది అది బాగా తగ్గింది. ఇక గత ఏడాది నవంబర్ లో 2 వేల 827 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఈ ఏడాది నవంబర్ లో బాగా తగ్గి 2 వేల 697 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే ఇది ఒక విధంగా నాలుగు శాతం పైగానే తగ్గుదల అని అధికారులు వివరిస్తున్న నేపధ్యం ఉంది.

కేంద్రం సర్దుబాటు :

ఇలా జీఎస్టీ ద్వారా తగ్గిన ఆదాయానికి కేంద్రం రాష్ట్రాలకు ఏదో విధంగా సర్దుబాటు చేయాల్సి ఉంది. కానీ ఆ విధంగా చేయడం లేదు, పైగా మధ్యతరగతి కోసం ఇదంతా సూపర్ జీఎస్టీ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా ఏపీ లాంటి వాటికి జీఎస్టీ షాక్ మామూలుగా లేదని అంటున్నారు ఎందుకంటే ఆదాయం పెద్దగా గత పదకొండేళ్ళలో పెరిగింది లేదు, సేవా రంగం కానీ పరిశ్రమల రంగం కానీ ఎక్కువగా ఆదాయాన్ని ఇవ్వడం లేదు, ఈ రోజుకీ వ్యవసాయ రంగం నుంచే ఆదాయం వస్తోంది.

భారాలుగా అన్నీ :

ఈ పరిస్థితులలో నెల వచ్చిదంటే చాలు ప్రభుత్వానికి ఎంతో భారం పడుతోంది సామాజిక పెన్షన్ ఏకంగా నాలుగు వేలకు పెంచేసి అరవై అయిదు లక్షల మందికి ఇస్తున్నారు అలాగే ఉచిత బస్సు అమలు చేస్తున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఫ్రీ అంటున్నారు. రైతులకు అన్న దాతా సుఖీభవ పథకం ఉంది. వీటితో పాటు ఇతర హామీలు ఎన్నో ఉన్నాయి. దాంతో ఖజానాకు వస్తున్నది తక్కువ ఖర్చు ఎక్కువ అవుతోంది. దీంతో అప్పులతోనే అంతా చేయాల్సి వస్తోంది. ఇది ఒక విధంగా ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. అమరావతి రాజధాని కోసం కూడా అప్పులు ఒక వైపు చేస్తున్నారు. ఇలా ఏ వైపు చూసుకున్నా ఏపీ చాలా ఆర్ధిక కష్టాలలో ఉంది అని అంటున్నారు.