Begin typing your search above and press return to search.

సంతానమే సంపద...కూటమి గట్టి సంకల్పం

ఏపీలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యం ఉంది. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద పెద్ద ఎత్తున ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు.

By:  Satya P   |   7 July 2026 5:00 AM IST
సంతానమే సంపద...కూటమి గట్టి సంకల్పం
X

ఏపీలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యం ఉంది. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద పెద్ద ఎత్తున ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ సభలో సంతానమే సంపద అని చాటి చెబుతున్నారు. ఈ విషయంలో ప్రత్యర్ధులు విమర్శలు చేసినా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని బాబు ఒక సంకల్పంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ జనాభా దినోత్సవం నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకూ వారం రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా అధిక సంతానం గురించి ఆరోగ్యవంతమైన సమాజం గురించి ప్రజలలో చైతన్యం కోసం కూటమి ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపడుతోంది.

నగదు ప్రోత్సాహం :

ఇదిలా ఉంటే మాటలతో కాదు చేతలకే కూటమి ప్రభుత్వం దిగుతోంది. ఎక్కువ సంతానం ఉన్న వారికి నగదు పురస్కారం అందించాలని నిర్ణయించింది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆ కుటుంబానికి అయిదు వేల రూపాయల నగదు బహుమతిని అందించనుంది. అలాగే ప్రతీ జిల్లాలో మూడు జంటలకు అయిదు వేల రూపాయలను ఈ విధంగా నగదు బహుమతితో సత్కరించనుంది. అలాగే కానుపుల మధ్య రెండేళ్ళ విరామం పాటించిన దంపతులకు కూడా అయిదు వేల రూపాయల ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు గా ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఈ కార్యక్రమం కోసం 56 లక్షల రూపాయలను కూటమి ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

ఆరోగ్యవంతమైన సమాజం కోసం :

ఇదిలా ఉంటే కాన్పుల మధ్య తగిన విరామం పాటించడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలకు అవ్గాహన కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఈ వారం రోజుల ప్రచారం సాగనుంది. గర్భధారణకు సరైన సమయాన్ని ఎంచుకోవడం, కాన్పుల మధ్య తగిన విరామం పాటించడం వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలు కలుగుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన దంపతులకు నగదు పురస్కారాన్ని అందచేయనున్నామని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు.

వాటి మీదనే ప్రత్యేక ఫోకస్ :

యుక్తవయస్సు గర్భధారణలు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు అలాగే మండలాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఆరోగ్యవంతమైన విధానాన్ని పాటిస్తే మాతృత్వ మరణాల్లో 30 శాతం, శిశు మరణాలలో 10 శాతం వరకు తగ్గుతాయని ప్రజలకు అవగాహన కల్పించాలన్నది ప్రభుత్వం ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా, మండల స్థాయిలో సమావేశాలు, ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతే కాదు ఉత్తమంగా పనిచేసిన వైద్యులు, సిబ్బందికి నగదు పురస్కారాలు ఇవ్వనున్నట్లుగా మంత్రి తెలిపారు. మొత్తానికి అధిక సంతానమే కాదు ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను చేపడుతోంది. దాంతో పాటు సంతాన లక్ష్ములకు ప్రభుత్వం నజరానాలు కూడా దక్కనున్నాయి.