Begin typing your search above and press return to search.

రైతులకు అది తప్పనిసరా?

ఫార్మర్ ఐడి అనేది రైతుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఒకే డిజిటల్ రికార్డుగా మార్చే గుర్తింపు వ్యవస్థ.

By:  Madhu Reddy   |   25 Aug 2026 9:43 AM IST
రైతులకు అది తప్పనిసరా?
X

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు అందుతున్న వ్యవసాయ సేవలను మరింత సులభతరం చేయడానికి డిజిటల్ నమోదు విధానం కీలకంగా మారుతోంది. ఫార్మర్ ఐడి, ఈ - పంట, వంటి డిజిటల్ వ్యవస్థలు రైతుల ఆధార్, మొబైల్ నంబర్, భూమి అలాగే పంట సాగు వివరాలను ఒకే చోట అనుసంధానిస్తున్నాయి. అయితే ఫార్మర్ ఐడీ లేకపోతే చెల్లింపులు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయా? రైతులకు ఈ ఐడీ నిజంగానే తప్పనిసరా? దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? నమోదు ఎక్కడ చేసుకోవాలి? అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఫార్మర్ ఐడి అంటే:

ఫార్మర్ ఐడి అనేది రైతుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఒకే డిజిటల్ రికార్డుగా మార్చే గుర్తింపు వ్యవస్థ. ఇందులో రైతు ఆధార్, మొబైల్ సంఖ్య, భూమి విస్తీర్ణం, సాగు చేస్తున్న పంటల వివరాలు ఉంటాయి. దీనివల్ల వ్యవసాయ శాఖ సేవలను త్వరగా అందించడానికి, పథకాల అర్హతలను పరిశీలించడానికి అధికారులకు పని సులువవుతుంది. అయితే ఇది కేవలం డేటాబేస్ మాత్రమే కాబట్టి, ఐడీ ఉన్నంత మాత్రాన ప్రతి పథకానికి ఆటోమేటిక్‌గా అర్హత రాదు. పథక నిబంధనలు కూడా పాటించాల్సి ఉంటుంది.

పెట్టుబడి సాయం, పంట బీమా కోసం:

పీఎం-కిసాన్, అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ ఆర్థిక సాయం పథకాలకు రైతుల డిజిటల్ డేటా సరిగ్గా ఉండటం చాలా అవసరం. అలాగే ఉచిత పంట బీమా పొందేందుకు ఇ-పంట ఆధారంగా నమోదు చేసిన పంట వివరాలు ప్రామాణికంగా పనిచేస్తాయి. పొలంలో వేసిన పంట వివరాలు సరిగ్గా నమోదైతేనే ప్రమాద సమయాల్లో బీమా పరిహారం అందుతుంది.ఇక ప్రభుత్వ సంస్థలకు పంటలు అమ్మేందుకు ఫార్మర్ ఐడి అవసరమని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. బీమా, ఇన్సూరెన్స్, ఎరువులు, సంక్షేమ పథకాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని పౌర సరఫరాలు, మార్క్‌ఫెడ్ కొనుగోళ్లకూ వర్తింపజేయాలని కేంద్రం ఆదేశించింది.

సబ్సిడీలు, పంట రుణాలు పొందడం సులువు:

విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ పనిముట్లపై ప్రభుత్వం ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీలను పొందడానికి డిజిటల్ రికార్డులు సహాయపడతాయి. బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందే సమయంలో భూమి పత్రాలతో పాటు ఈ డిజిటల్ వివరాలు పరిశీలనను వేగవంతం చేస్తాయి. అయితే రుణం మంజూరు అనేది బ్యాంకుల నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

కనీస మద్దతు ధర కింద పంట విక్రయం:

ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలలో కనీస మద్దతు ధరకు ధాన్యం లేదా ఇతర పంటలను విక్రయించాలంటే రైతు వివరాలు, ఇ-పంట నమోదు తప్పనిసరి. పంట వివరాలు డిజిటల్‌గా సరైన సమయంలో నమోదు కాకపోతే ఎంఎస్పీ ద్వారా విక్రయించే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

నమోదు ఎక్కడ చేసుకోవాలి? అవసరమైన పత్రాలు:

రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రం ను సంప్రదించి ఫార్మర్ ఐడి లేదా వివరాల నమోదు ఉందో లేదో సరిచూసుకోవచ్చు. నమోదు కోసం ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్, భూమి పట్టాదార్ పాస్‌బుక్, సాగు పంట వివరాలు అందజేయాల్సి ఉంటుంది.

ముందే చెక్ చేసుకోవడం మేలు:

ప్రభుత్వ సేవలు, పథకాల లబ్ధి నేరుగా మరియు వేగంగా అందాలంటే రైతు డిజిటల్ వివరాలు సరిగ్గా ఉండటం ఎంతో ముఖ్యం. అందువల్ల రైతులు చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా, రైతు సేవా కేంద్రానికి వెళ్లి తమ భూమి, పంట వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో ఒకసారి పరిశీలించుకోవడం శ్రేయస్కరం.