నకిలీ మద్యం కుంభకోణం: 'జోగి' మూలాలు.. వెలుగులోకి సంచలన విషయాలు!
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పటి ఎమ్మెల్యే, మంత్రి అయిన జోగి రమేష్ ఆదేశాల మేరకు తాము నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్దన్ రావు అంగీకరించారు.
By: A.N.Kumar | 13 Oct 2025 8:13 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం వ్యవహారం లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి.. ముఖ్యంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ కేసులో ఏ-1 నిందితుడైన జనార్దన్ రావు విచారణలో తాజాగా వైసీపీపై సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి మంత్రి జోగి రమేష్ పాత్ర ఉందంటూ జనార్ధన్ రావు బాంబు పేల్చారు.
* టీడీపీపై బురద జల్లడానికి వైసీపీ ప్లాన్ అంటూ ఆరోపణ!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నకిలీ మద్యం వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. దీంతో మద్యం కుంభకోణాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, అధికార కూటమిపై బురద జల్లాలనే కుట్రతోనే నకిలీ మద్యం దందా మళ్లీ మొదలైందని జనార్దన్ రావు వెల్లడించారు.
* జనార్దన్ రావు చెప్పిన ప్రకారం...
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పటి ఎమ్మెల్యే, మంత్రి అయిన జోగి రమేష్ ఆదేశాల మేరకు తాము నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్దన్ రావు అంగీకరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ మళ్లీ జనార్దన్ రావుకు ఫోన్ చేసి, నకిలీ మద్యం తయారు చేయాలని ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, నింద వారిపై వేయడానికి ఈ కుట్ర పన్నారని అన్నారు. మొదట ఇబ్రహీంపట్నంలో అనుకున్నా, తర్వాత తంబళ్లపల్లి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉండడంతో, అక్కడ తయారీ కేంద్రాన్ని పెట్టాలని జోగి రమేష్ ఆదేశించారని... ప్రభుత్వంపై బురద చల్లడానికి ఇది అనువుగా ఉంటుందని స్కెచ్ వేశారని ఆరోపించారు..
* ప్లాన్ వర్కౌట్ కాలేదు... అందుకే మోసం!
జనార్దన్ రావు ఆదేశాలను అమలు చేస్తూ తంబళ్లపల్లిలో తయారీ మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జనార్దన్ రావుకు అండగా ఉంటానని, తదుపరి ఎన్నికల్లో టికెట్ కూడా ఇప్పిస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని నిందితుడు తెలిపాడు. నకిలీ మద్యం తయారవుతున్న క్రమంలో జనార్దన్ రావును హఠాత్తుగా ఆఫ్రికా పంపించి, తన అనుచరుల ద్వారా ఎక్సైజ్ శాఖకు లీకులు ఇచ్చి దాడులు చేయించారు జోగి రమేష్ అని ఆరోపించాడు. . ఈ వ్యవహారంలో టీడీపీ నేతల పేర్లు బయటకు వచ్చినా, ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే వారిని సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ ప్లాన్ అనుకున్నంతగా విజయవంతం కాలేదని తెలుస్తోంది.
దీంతో జోగి రమేష్ మళ్లీ ఫోన్ చేసి ఇబ్రహీంపట్నంలో దాడి చేయిద్దామని ఆదేశించారు. ముందు రోజు గోదాంలో సరుకు తీసుకొచ్చి పెట్టమని జనార్దన్ రావును ఆదేశించారు. జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు. ఈసారి వైఎస్సార్సీపీ అనుకూల మీడియా కూడా ముందుగానే అక్కడే ఉంచారు. దీంతో ఈ ప్లాన్ వర్కౌట్ అయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది.
* నమ్మించి మోసం... బయటపడ్డ నిజాలు
ప్లాన్ సక్సెస్ అయ్యాక, జోగి రమేష్ జనార్దన్ రావుకు ఫోన్ చేసి నువ్వు రావాల్సిన అవసరం లేదని, బెయిల్ ఇప్పిస్తానని చెప్పి మాట తప్పారు. అంతేకాదు, జనార్దన్ రావు తమ్ముడిని కూడా ఈ కేసులో ఇరికించారు. నమ్మించి మోసం చేసిన నేపథ్యంలోనే జనార్దన్ రావు బయటకు వచ్చి ఈ సంచలన విషయాలన్నీ వెల్లడించారు.
* జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం...
వైఎస్సార్సీపీ వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తానని చెప్పి జయచంద్ర రెడ్డిని మోసం చేసేందుకు ప్రయత్నించింది. కేసులో జయచంద్ర రెడ్డి పాత్ర లేదని జనార్దన్ రావు స్పష్టం చేశారు.
మొత్తంగా, టీడీపీపై బురద జల్లడానికి వైసీపీ నాయకులు ఎంతటి కుట్రలకు పాల్పడ్డారని జనార్ధన్ రావుతోపాటు, టీడీపీ తాజాగా ఈ నకిలీ మద్యం కేసు లో సంచలన ఆరోపణలు చేస్తోంది.
