ఏపీకి హైడ్రా...మామూలుగా ఉండదంతే !
హైడ్రా కమిషనర్ రంగనాధ్ ప్రత్యేకంగా పవన్ కి కలిశారు అంటే అది ఆసక్తికరమైన చర్చగానే ముందుకు వచ్చింది.
By: Satya P | 25 Oct 2025 9:27 PM ISTతెలంగాణాలో హైడ్రా అనే వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి క్రియేట్ చేశారు. ఆయన అధికారం చేపట్టాక ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సరికొత్త వ్యవస్థకు విశేష అధికారాలు ఇచ్చారు. దాంతో ఆక్రమణలు తొలగించేందుకు హైడ్రా తెలంగాణాలో చేసిన దూకుడు దాని పరిణామాలు పర్యవసానాలు అంతా చూశారు. హైడ్రా వల్ల అన్ని పార్టీలూ ఇబ్బంది పడ్డాయని అంటారు. అందులో కాంగ్రెస్ కూడా ఉంది. అంతే కాదు హైడ్రాతో బిగ్ షాట్స్ చాలా మంది సతమతమైన ఘటనలు కూడా ఉన్నాయి.
హద్దూ పద్దూ లేకుండా :
కాదేదీ కబ్జాలు అనర్హం అన్నట్లుగా హద్దూ పద్దూ లేకుండా దురాక్రమణలు చేసిన వారి పాలిట హైడ్రా సింహస్వప్నం అయింది అని అంతా చెబుతారు. హైడ్రా ద్వారా చెరువులను ఆక్రమించుకున్న భవనాలు ప్రజలకు సంబంధించిన సామూహిక స్థాలను కబ్జా చేసిన కట్టడాలు అన్నీ కూడా దెబ్బకు కూలిపోయాయి. హైడ్రా అన్నది ఒక విధంగా టెర్రర్ పుట్టించింది అని అంటారు. పెద్దల విషయంలో ఏముందో తెలియదు కానీ సగటు ప్రజానీకం అయితే ఇలాంటి వ్యవస్థ ఒకటి అందరికీ ఉండాలని బలంగా కోరుకున్నారు.
పవన్ తో భేటీ :
ఇదిలా ఉంటే తెలంగాణాలో హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ ప్రత్యేకంగా ఏపీకి వచ్చారు. అంతే కాదు ఆయన మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసులో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ సైతం ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ ఇద్దరూ అనేక అంశాల మీద చర్చించుకున్నారు అని చెబుతున్నారు. అంతే కాదు హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా అవసరం అని ఈ సందర్భంగా పవన్ పెర్కొన్నట్లుగా తెలుస్తోంది. పాలకుల ముందు చూపు అలాగే నిబద్ధత కలిగిన అధికారుల పనితీరు ఏ వ్యవస్థకు అయినా మంచి పేరు తీసుకుని వస్తాయని పవన్ అభిప్రాయపడ్డారు.
అంతే కాదు హైడ్రా లాంటి కొత్త వ్యవస్థను తెలంగాణా ప్రభుత్వం తీసుకుని రావడం పట్ల పవన్ అభినందించారు.
ఏపీకి కూడానా :
హైడ్రా కమిషనర్ రంగనాధ్ ప్రత్యేకంగా పవన్ కి కలిశారు అంటే అది ఆసక్తికరమైన చర్చగానే ముందుకు వచ్చింది. పవన్ పిలిపించుకున్నారా లేక ఆయన వచ్చారా అన్నది తెలియదు కానీ పవన్ ఆయనను కలిసిన సందర్భంలో అన్న మాటలు చూస్తే ఏపీలో కూడా హైడ్రా తరహా వ్యవస్థను తీసుకుని వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. పవన్ అయితే అటవీ శాఖతో సహా ఏ శాఖకు చెందిన భూములు కబ్జాకు గురి అయితే సహించేది లేదని స్పష్టంగా చెబుతున్నారు. అంతే కాదు ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అయితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరిస్తున్నారు ఈ నేపధ్యంలో హైడ్రా కూడా అలాంటి వ్యవస్థ కాబట్టి పవన్ ఆలోచనలకు తగిన విధంగా హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీలో పురుడు పోసుకునే అవకాశాలు ఉన్నాయా అన్నదే చర్చగా ఉంది.
వేరే లెవెల్ నే :
ఇదిలా ఉంటే హైడ్రా లాంటి వ్యవస్థ వస్తే కనుక ఏపీలో కూడా అనేక సంచలనాలు నమోదు అయ్యే అవకాశాలు కచ్చితంగా ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే భూములు ఎక్కడైనా చేప చుట్టేసే వారు నిండుగా మెండుగా ఉన్నారు. మరి అభివృద్ధి చెందిన ప్రాంతాలలో అయితే ఈ తరహా సంఘటనలు కోకోల్లలు. మరి హైడ్రా అంటూ వస్తే కనుక కబ్జాదారులకు నిద్ర లేని రాత్రులే అని అంటున్నారు. పవన్ ఈ విషయంలో ఆసక్తిగా ఉన్నారు అంటే కచ్చితంగా కూటమి ప్రభుత్వం దీని మీద సీరియస్ గానే అడుగులు వేస్తుందని అంటున్నారు. చూడాలి మరి హైడ్రా ఏపీలో ఆవిర్భావానికి ఎంత దూరం ఉందో.
