Begin typing your search above and press return to search.

మూడు కాదు రెండే... జిల్లాల పునర్విభజనలో పీఠముడి వీడినట్లేనా.!

అవును... జిల్లాల పునర్విభజనపై జరిగిన సమావేశంలో అధికారులు సీఎం చంద్రబాబు వద్ద ఓ కీలక విషయాన్ని ప్రస్థావించారు.

By:  Raja Ch   |   28 Dec 2025 8:00 PM IST
మూడు కాదు రెండే... జిల్లాల పునర్విభజనలో పీఠముడి వీడినట్లేనా.!
X

ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్న సంగతి తెలిసిందే. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు! అయినప్పటికీ.. కొన్ని జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథంలో.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది! ఈ క్రమంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో.. చివరకు రెండు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.

అవును... జిల్లాల పునర్విభజనపై జరిగిన సమావేశంలో అధికారులు సీఎం చంద్రబాబు వద్ద ఓ కీలక విషయాన్ని ప్రస్థావించారు. ఇందులో భాగంగా... చిన్న జిల్లాల కారణంగా తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే.. రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్‌ కడపలో, రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో, కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లె జిల్లాలో రాయచోటిని కలిపేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాలని అధికారులు ప్రతిపాదించారు.

వాస్తవానికి తొలుత.. మదనపల్లె, పోలవరం, మార్కాపురం ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని చెబుతున్నారు. అయితే తాజాగా వీటిలో రెండు మాత్రమే ఎంపికయ్యాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా... మదనపల్లె, మార్కాపురం జిల్లాలను మాత్రమే కొత్తగా ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

కాగా... జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో మార్పుచేర్పులకు సంబంధించి ప్రభుత్వం గత నెల 27న ప్రాథమిక నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. నెల రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించింది. ఈ సందర్భంగా... రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 927 అభ్యంతరాలపై ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు శనివారం చర్చించారు. వీటన్నింటిపై ఆదివారం మరోసారి సమగ్రంగా చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు. 31న తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.

రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి!:

కొత్తగా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోన్న మదనపల్లిలో రాయచోటిని కలిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారని అంటున్న నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలని కోరుతూ రాయచోటిలో ఆదివారం ఉదయం జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. ఈ సందర్భంగా... 'మదనపల్లె వద్దు – రాయచోటి ముద్దు' అంటూ నినాదాలతో హోరెత్తించారు.

జనగణన పూర్తవ్వగానే డీలిమిటేషన్!:

ఈ సందర్భంగా గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రక్రియపైనా కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... జనగణన పూర్తయ్యేవరకూ డీలిమిటేషన్‌ చేపట్టకూడదని కేంద్రం ఆదేశించిందని, సర్వే పూర్తవ్వగానే గ్రేటర్‌ విజయవాడ, గ్రేటర్‌ తిరుపతి ప్రక్రియ చేపడతామని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్రం జనాభా సర్వే ప్రారంభించినందు వల్ల ఈ ప్రక్రియ ఇప్పుడు చేపట్టేందుకు అడ్డంకిగా మారిందని తెలిపారు.