కొత్త జిల్లాలా? కొత్త కేంద్రాలా?: సర్కారు డైలమా
ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి వచ్చాక.. వాటిని మారుస్తామని చంద్రబాబు సహా.. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు.
By: Garuda Media | 9 Aug 2025 5:00 AM ISTప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి. అయితే.. వీటిని 32 జిల్లాలకు పెంచాలన్నది ఒక ప్రతిపాదన. దీనిపై సర్కారు దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించారు. రాష్ట్ర విభజన నాటికి 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అయితే.. వైసీపీ హయాంలో వీటిని పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా.. 25 జిల్లాలు చేయాలని భావించారు. అయితే.. అరకు పార్లమెంటు స్థానం విస్తారంగా ఉండడంతో దీనిని రెండు జిల్లాలు చేశారు.
మిగిలిన పార్లమెంటు స్థానాలను యథాతథంగా ఉంచి.. వాటిని జిల్లాలుగా విభజించారు. అయితే.. జిల్లాల విభజనతో ఎవరికీ ఇబ్బందులు రాలేదు. కానీ, కొత్త జిల్లాల ఏర్పాటుతో వాటికి నిర్ణయించిన జిల్లా కేంద్రాల విషయంలోనే ఇబ్బందులు వచ్చాయి. చాలా జిల్లాలకు నిర్ణయించిన.. జిల్లా కేంద్రాలపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ.. వైసీపీ హయాంలో వీటిని పట్టించుకోలేదు. స్థానిక నాయకుల సూచ నలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని.. జిల్లా కేంద్రాలను నిర్ణయించారు. ఇది ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది.
ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి వచ్చాక.. వాటిని మారుస్తామని చంద్రబాబు సహా.. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ పనికే ప్రభుత్వం పూనుకొంది. అయితే.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంపై డైలమాలో పడుతోంది. సాధారణంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. మరింత మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సహా.. ఇతర ఉద్యోగులు కూడా కావాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు.. నిధులు కూడా కేటాయించాలి. ఇప్పుడున్న పరిస్థితిలో ఇది చేయడం సరికాదన్న వాదన ఇటీవల మంత్రుల నుంచి వినిపించింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి జిల్లా కేంద్రాలను మార్చేసి.. కొత్త జిల్లాల ఏర్పాటును వాయిదా వేయాలని మంత్రివర్గ సమావేశంలో పలువురు సీఎం చంద్రబాబుకు సూచించారు. కానీ, ఇదేసమయంలో హిందూ పురం ఎమ్మెల్యే, బాలయ్య నుంచి మరో డిమాండ్ వినిపిస్తోంది. హిందూపురం జిల్లాగా ఏర్పాటు చేసి.. దీనికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆయన కోరుతున్నారు. ఇది అంతర్గతంగా జరుగుతున్న చర్చ. అలాగే మార్కాపురం జిల్లా కేంద్రం మార్పుతోపాటు.. ప్రత్యేకంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది.
ఇలా ఈ జిల్లాలను ఏర్పాటు చేస్తే.. ఇతర పల్నాడు సహా.. మన్యం, ఏలూరు జిల్లాల్లోనూ.. ఇలాంటి డిమాం డ్లే ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు వాటిని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి జిల్లా కేంద్రాల ఏర్పాటు, సరిహద్దుల మార్పునకే పరిమితం కావాలని భావిస్తున్నారు. మరోవైపు.. సమయం తక్కువగా ఉంది. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత రెండేళ్ల పాటు సరిహద్దులు మార్చడానికి వీల్లేదని కేంద్రం తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచే కుల గణన చేపట్టనున్నారు. తర్వాత.. ఏడాది జనాభా గణన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో ఎక్కువ భారం పెట్టుకోవడం సరికాదన్నది మంత్రులు చెబుతున్న మాట. మరి ఏం చేస్తారోచూడాలి.
