రాసిపెట్టుకోండి.. రాష్ట్ర పరిస్థితి మారుస్తా!: చంద్రబాబు
దేశంలో విజన్‌కు ఆద్యుడిని తానేనని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలోనే తొలిసారి తాను భవిష్యత్తు ముఖ చి త్రాన్ని ఊహించుకుని, దాని ప్రకారం ప్రణాళికలు వేసుకున్నట్టు చెప్పారు
By: Garuda Media | 12 Sept 2025 9:42 PM ISTదేశంలో విజన్‌కు ఆద్యుడిని తానేనని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలోనే తొలిసారి తాను భవిష్యత్తు ముఖ చి త్రాన్ని ఊహించుకుని, దాని ప్రకారం ప్రణాళికలు వేసుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే గతంలో `విజన్ - 2020`ని తీసుకువచ్చామన్నారు. ఈ విషయం తెలిసిన అబ్దుల్ కలాం.. తనను సంప్రదించి.. విజన్ - 2020 డాక్యుమెంటును తీసుకున్నారని.. దాని ప్రకారం దేశానికి కూడా ఒక విజన్‌ను రూపొందిస్తామని చెప్పారని సీఎం తెలిపారు. తాజాగా ఓ ఆన్‌లైన్ మీడియా సంస్థ మంగళగిరిలో నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో సీఎం మాట్లాడారు.
ఈ సందర్భంగా విజన్ - 2047పై స్పందించిన చంద్రబాబు.. కేంద్రంలోని ప్రధాని మోడీ... `వికసిత భారత్ - 2047`ను ప్రతిపాదించారని చెప్పారు. ఈ క్రమంలో తాను విజన్ - 2047 రూపొందించినట్టు తెలిపారు. వచ్చే 2047 నాటికి రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలన్న అంశంపై పక్కా ప్రణాళిక రూపొందించామన్నారు. ఆ సమయానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతాయన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని మోడీ సర్కారు కారణంగా.. దేశం మొత్తం స్ఫూర్తిమంతమైన పరిస్థితిలో ఉందన్నారు.
ఈ క్రమంలో వచ్చే 22 ఏళ్ల నాటికి రాష్ట్రం ఎలా ఉంటుందన్నది ఊహించుకోవచ్చన్నారు. గత 20 ఏళ్ల కిందట దేశం పరిస్థితి ఇబ్బందుల్లో ఉందని.. కనీసం అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదని చెప్పారు. అలాంటి సమయంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన తెలుగు బిడ్డ, అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు.. దేశ రూపురేఖలు మార్చే ప్రయ త్నం చేశారని అన్నారు. ఆ తర్వాత.. అలాంటి ప్రయత్నాలు జరగలేదన్న ఆయన.. 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ.. మళ్లీ 11 ఏళ్లుగా దేశంలో సంస్కరణలకు పెద్దపీట వేశారని తెలిపారు. దేశాన్ని 4వ ఆర్థిక వ్యవస్థగా మార్చార ని అన్నారు.
2038 నాటికి దేశం రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. 2047నాటకి ఏపీ అతిపెద్ద ఆర్థిక వ్వవస్థగా మారుతుందన్నారు. కావాలంటే రాసిపెట్టుకోవచ్చని సూచించారు. దీనిపై తనకు నమ్మకం ఉందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక.. 12 శాతం వృద్ధి సాధించామన్నారు. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. దీనిని సుస్థిరం చేసుకుంటే.. భవిష్యత్తు బాగుంటుందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 57 లక్షల కోట్లకు(జీఎస్ డీపీ) తీసుకువె ళ్తామని సీఎం చంద్రబాబు లెక్కలు సహా వివరించారు. 2033-34 నాటికి రాష్ట్రంలోని పౌరుల సగటు ఆదాయం 10 లక్షల 55 వేలకు తీసుకువెళ్తామని చెప్పారు. ఒకప్పుడు సెల్‌ఫోన్ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారని.. అలానే ఇప్పుడు కూడా అనుకోవచ్చన్నారు. కానీ, చేసి చూపిస్తామన్నారు.
