Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రాకు వణుకు...మరో హుదూద్ ?

ఇప్పటికి సరిగ్గా 12 ఏళ్ళ క్రితం 2014లో ఇదే అక్టోబర్ నెల 12వ తేదీన హుదూద్ తుఫాన్ వచ్చి ఎంతలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే.

By:  Satya P   |   25 Oct 2026 9:13 AM IST
ఉత్తరాంధ్రాకు వణుకు...మరో హుదూద్ ?
X

ఇప్పటికి సరిగ్గా 12 ఏళ్ళ క్రితం 2014లో ఇదే అక్టోబర్ నెల 12వ తేదీన హుదూద్ తుఫాన్ వచ్చి ఎంతలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. విశాఖ తీరాన్ని ఆనాడు హుదూద్ తాకింది. ఆ దెబ్బకు అందమైన విశాఖ స్వరూపమే మారిపోయిది. పచ్చని కొండలు బోడి గుండుగా మారిపోయాయి. అభివృద్ధి అంతా విద్వంశం అయింది. వారం పది రోజుల పాటు విశాఖ అంధకారంలో మగ్గింది. ఇక విశాఖ ప్రపంచంతో అనుసంధానం కావడానికి చాలా టైం పట్టింది. కోలుకోవడానికి కూడా ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత అలాంటి బలమైన తుఫాను ఉత్తరాంధ్రను తాకబోతోంది అన్న హెచ్చరికలు అయితే వినిపిస్తున్నాయి. దాంతో ఈ ప్రాంతం వణుకుతోంది.

అతి తీవ్ర తుఫానుగా :

ఇక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారానికి వాయుగుండంగా మారింది. ఇది ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. ఆ మీదట సోమవారం నాటికి తీవ్ర తుఫాను గా మారి ఆ మీదట అతి తీవ్రమవుతుందని అంటున్నారు. ఇక ఈ నెల 28న బాపట్ల- విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంటున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115-125 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. దీంతో భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు ప్రీ-సైక్లోన్ వాచ్ ని జారీ చేసింది.

ప్రస్తుతం ఎక్కడంటే :

ఇక వాయుగుండంగా ప్రస్తుతం ఆవరించి ఉన్న ఈ విపత్తు విశాఖపట్నానికి ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు కాకినాడకు 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం తొలుత దక్షిణ దిశగా కదిలి, అక్టోబర్ 25న తీవ్ర వాయుగుండంగా బలపడనుందని, . ఆ తర్వాత దిశ మార్చుకుని పశ్చిమ వాయవ్య దిక్కుగా ప్రయాణించి మరింత శక్తిని పుంజుకోనుందని ఐఎండీ చెబుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అక్టోబర్ 26 నాటికి తుపానుగా, 27 నాటికి తీవ్ర తుపానుగా, 28వ తేదీ ఉదయం నాటికి అతి తీవ్ర తుపానుగా మారుతుందని అంటున్నారు. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడటానికి బలపడటానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. మాడెన్ జూలియన్ ఆసిలేషన్ వంటి వాతావరణ అంశాలు ఈ తుపాను తీవ్రతను పెంచేందుకు దోహదం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఏపీ వైపే దిశ :

ఈ తుఫాను అయితే అక్టోబర్ 28వ తేదీన ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో బాపట్ల -విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంటున్నారు. ఆ సమయంలో గాలి వేగం గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అలాగే గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగానికి చేరవచ్చునని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక వాతావరణ నిపుణులు ఈ తుఫాను ఏపీ తీరం వైపే వస్తుందని అది కూడా అతి తీవ్రంగా మారుతుందని ఏకాభిప్రాయంగా చెబుతున్నారు.

హుదూద్ సమయంలో :

ఇక చూస్తే హుదూద్ తుఫాన్ విశాఖ నగరం నడిబొడ్డున తీరాన్ని దాటింది. ఆ సమయంలో గంటకు 170 నుండి 180 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో గరిష్టంగా గంటకు 195 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ భీకర గాలుల తాకిడికి విశాఖపట్నంలో భారీ విధ్వంసం జరిగింది. నగరంలోని సుమారు 70 శాతం పైగా చెట్లు నేల కూలాయి, విద్యుత్ స్తంభాలు, కమ్యూనికేషన్ టవర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ తుఫాను ప్రభావం వల్ల విశాఖ తీర ప్రాంతాలు, భవనాలు అప్పట్లో చిగురుటాకులా వణికిపోయాయి. ఇపుడు ఈ తాజా తుఫాన్ కూడా బాపట్ల విశాఖ మధ్యన తీరాన్ని తాకుతుందని తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి అని చెబుతున్న దానిని చూస్తే విశాఖ నుంచి ఉత్తరాంధ్రా సహా కోస్తా ప్రాంతం అంతా వణుకుతోంది.