Begin typing your search above and press return to search.

ఏపీ కాంగ్రెస్ పీఠం కోసం పోటా పోటీ...నిజమేనా ?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియడంతోనే ఏపీ మీద కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారిస్తారు అని అంటున్నారు. ఏపీ కాంగ్రెస్ కి కొత్త నాయకత్వం జవ సత్వాలు ఇస్తారు అని అంటున్నారు.

By:  Satya P   |   28 July 2026 1:11 PM IST
ఏపీ కాంగ్రెస్ పీఠం కోసం పోటా పోటీ...నిజమేనా  ?
X

ఏమో గుర్రం ఎగరావచ్చు అని సామెత ఒకటి ఉంది. ఏపీలో కాంగ్రెస్ ని చూస్తే అదే అనిపిస్తోంది. వరసగా జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఒక్క సీటు రాలేదు సరికదా అనేక చోట్ల డిపాజిట్లు కూడా పోయాయి. రెండు శాతం ఓటు షేర్ మాత్రమే దక్కుతూ వస్తోంది. అలాంటి కాంగ్రెస్ కి సారధ్యం వహించాలి అంటే చాలా మంది నేతలు మాకెందుకు వచ్చినా ఇబ్బంది అనుకుని పక్కకు తప్పుకునేవారు అని ప్రచారం సాగేది. విభజన తరువాత ఎక్కువ కాలం పీసీసీ చీఫ్ గా పనిచేసిన వారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. ఆయన తరువాత మరో మాజీ మంత్రి సాకే శైలజానాధ్, ఆ తరువాత గోదావరి జిల్లాలకు చెందిన ఒక నేతకు కొంతకాలం చాన్స్ ఇచ్చారు. ఇపుడు వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా ఉన్నారు. అయితే తొందరలోనే ఏపీ కాంగ్రెస్ లో భారీ మార్పులు వస్తాయని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

బలోపేతం చేసే దిశగా :

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియడంతోనే ఏపీ మీద కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారిస్తారు అని అంటున్నారు. ఏపీ కాంగ్రెస్ కి కొత్త నాయకత్వం జవ సత్వాలు ఇస్తారు అని అంటున్నారు. ఈసారి సామాజిక తూకాన్ని కూడా పాటిస్తూ ప్రాంతీయ సమీకరణలను కూడా సరి చూసుకుంటారని అంటున్నారు. ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గానికి ఈసారి పీసీసీ పీఠం దక్కవచ్చు అని అంటున్నారు. 2029 ఎన్నికలకు సమాయత్తం కావాలంటే ఇప్పటి నుంచే రంగంలోకి దిగాలని మొత్తంగా ప్రక్షాళన చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది.

పెద్దాయన రెడీనా :

ఇక గతంలో ఒక పెద్దాయనను కాంగ్రెస్ అధ్యక్ష పీఠం చేపట్టమని అడిగారని ప్రచారం సాగింది. అయితే ఆయన సున్నితంగా నో చెప్పారని కూడా అంటూ వచ్చారు. ఆయన కేంద్రంలో మంత్రిగా పనిచేసి కీలక శాఖలు చూసిన వారు, గోదావరి జిల్లాలకు చెందిన బలమైన సామాజిక వర్గం నేతగా ఉన్నారు. ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ పుంజుకుంటుందని కూడా అంటున్నారు. గతంలో నో చెప్పిన ఆయన ఇపుడు సుముఖంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం మారిన జాతీయ స్థాయి పరిస్థితులు కాంగ్రెస్ కి దక్షిణాదిన ఒక్కసారిగా పెరిగిన బలంతో పాటు ఉత్తరాది రాజకీయాల్లో వస్తున్న మార్పులు అని అంటున్నారు.

రేసులో చాలా మంది :

అంతే కాదు ఉత్తరాంధ్ర నుంచి ఒక కేంద్ర మాజీ మంత్రితో పాటు రాయలసీమ నుంచి కూడా పలువురు కీలక నేతలు పీసీసీ పీఠం చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. గత ఎన్నికలు వేరు 2029 ఎన్నికలు వేరు అని కాంగ్రెస్ నేతలు భావించడమే ఇందుకు కారణం అని అంటున్నారు. ఈసారి కచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ తన బలాన్ని నిరూపించుకుంటుందని లెక్క వేస్తున్నారు. దానికి జాతీయ స్థాయిలో నాయకత్వం రాహుల్ గాంధీ ఇమేజ్, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మీద యాంటీ ఇంకెంబెన్సీ ఏపీలో విపక్ష శిబిరంలో ఉన్న రాజకీయ శూన్యత వంటివి కూడా తమకు కలసి వచ్చే అంశాలుగా విశ్లేషిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే కనుక ఏపీలో కాంగ్రెస్ జెండా గతంలో మాదిరిగా ఎగురుతుందని కూడా చాలా మంది నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ భావజాలం అలాగే ఉందని దానిని జనం గట్టిగా పట్టుకున్నపుడు ఆటోమేటిక్ గా గ్రాఫ్ పెరిగి తీరుతుందని విశ్లేషిస్తున్నారు.