అదిగో అమరావతి ... వైసీపీకి నో వే !
కట్ చేస్తే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ వచ్చాక అమరావతి రాజధానిని ఎంతో కొంత ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది.
By: Satya P | 14 Oct 2025 9:37 AM ISTరాజకీయంగా ఎవరు ఎవరిని ఎన్ని అయినా అనుకోవచ్చు. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం రాష్ట్రమే ప్రాధాన్యం కావాలి. మహాకవి గురజాడ అప్పారావు చెప్పినట్లుగా దేశమంటే మనుషులే. అలాగే ఆంధ్ర రాష్ట్రం అయితే అయిదు కోట్ల మంది ప్రజానీకం. ఈ సత్యం ఎవరైనా గుర్తించాల్సి ఉంది. రాష్ట్ర రాజధాని అంటే అది ఆంధ్రులకు అతి పెద్ద సెంటిమెంట్ గా మారింది. ఎందుకంటే దాని వెనక ఎంతో చారిత్రాత్మకమైన విషాదం దాగి ఉంది.
అన్నీ కోల్పోయిన వేళ :
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఏపీ కూడా పదకొండు జిల్లాలతో ఒక భాగం. అలా దశాబ్దాల పాటు కొనసాగింది. ఆ సమయంలో మద్రాస్ ఏపీకి కూడా రాజధాని, కానీ 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయినపుడు పట్టుబట్టినా మద్రాస్ ని రాజధానిగా ఇవ్వలేదు. ఆ తరువాత హైదరాబాద్ తో ఆరు దశాబ్దాల అనుబంధం పెంచుకుని ఉమ్మడి రాజధానిగా అభివృద్ధి చేసినా కూడా చివరికి మొండెం లేని విధంగా విభజన ఏపీ 2014లో మిగిలింది. ఇలా ఎన్నో బాధలు ఎన్నో అవమానాల నుంచి రాజధాని కావాలన్న కసి ఆంధ్రులలో ఏర్పడింది. అయితే దానికి తగినట్లుగా 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతి పేరిట రాజధాని కోసం భారీ ఎత్తున వేలాది ఎకరాలలో భూ సేకరణ చేసి మరీ 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన కూడా చేసింది.
వ్యూహాత్మక తప్పిదంగా :
కట్ చేస్తే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ వచ్చాక అమరావతి రాజధానిని ఎంతో కొంత ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. కానీ రాజకీయ కారణాలతో పక్కన పెట్టేసి మూడు రాజధానుల నినాదాన్ని అందుకుంది. దాంతోనే మొత్తం అయిదేళ్ళు కాలక్షేపం చేసింది. ఇది ఆంధ్రులను ఎంతగానో బాధించింది. అందుకే 2024 లో అలాంటి ఫలితాలు మూడు రీజియన్లలోనూ వచ్చాయని అంటారు. 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమరావతి రాజధాని పనులను మొదలెట్టింది. శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా సీఆర్డీయే భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు దాంతో అమరావతి రాజధాని కళ కట్టినట్లుగా కనిపిస్తోంది. రానున్న రోజులలో వరసబెట్టి మరిన్ని నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు చోటు చేసుకోనున్నాయి.
నిలువెత్తు సాక్ష్యంగా :
దాంతో ఏపీ రాజధాని అమరావతి అన్నది నిలువెత్తు సాక్ష్యంగా దర్జాగా ఉన్న భవనాల రూపంలో కనిపిస్తున్నాయి. అమరావతి రాజధానికి అలా ఒక రూపు రేఖ కూడా దిద్దుకుంటున్న సందర్భం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2028 నాటికి ఏకంగా ప్రభుత్వ భవనాలు పూర్తి మౌలిక సదుపాయాలతో ఒక సమగ్రమైన రూపమే కనిపిస్తుంది. దాంతో ఏపీ ప్రజలకు రాజధాని అమరావతి అన్నది మనసులో కాదు ఎదురుగానే ఆవిష్కృతమవుతుంది. ఈ నేపధ్యంలో వైసీపీకి ఏ విధంగా చూసినా అమరావతి రాజధాని గురించి వేరేగా ఆలోచించే చాన్స్ అన్నది లేనే లేదని అంటున్నారు. మళ్లీ మూడు రాజధానులు అని ఎవరైనా అన్నా వినే వారే వెర్రి వెంగలాయి అవుతారని అంటున్నారు ఇక వైసీపీ కూడా రాజధాని విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమరావతి స్టాండ్ తీసుకుని ఏమైనా నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా రాజధాని విషయంలో తామూ ఉన్నామని అనిపించుకోవడం మేలు అని అంటున్నారు లేకపోతే వైసీపీకి నో వే అన్న విశ్లేషణలు ఉన్నాయి.
